ముందుగా ఈ పాటని రాసిన "సిరివెన్నెల" గారికి పాదాభివందనాలు చేస్తూ... పాటలోకి వస్తే, ఇదొక అద్భుతం, అమోఘం అని పొగడడం ఆపి, అసలు ఆయన మనకి ఏం చెప్దామనుకున్నారు అని ఆలోచిద్దాం! పాటని తొలి నుంచి మొదలుపెట్టడం కన్నా, మొదటి రెండు వరుసలు వదిలేసి మొదలు పెడదాం!
"ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా, ఆ నిజం తెలుసుకోవా? తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా?"
ఈ రెండు వరసలు సరిగ్గా పట్టుకుంటే, మొత్తం సారం అర్థమవుతుంది! నీలో ఏముందో, నీ బయట అదే ఉంది! అంటే, బయట కనిపించేవి అన్నీ నీలోనూ ఏదో రూపంలో ఉన్నాయి... అలాగే బయట కనిపించే అన్ని చోట్ల నువ్వే ఉన్నావ్! మనుషులలోనూ, ప్రకృతిలో కూడా!
ఇంకొంచెం clarity గా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఒక చెక్కిన pencil ని చూసి, దాని ముళ్ళు మీద ఆసక్తి కలిగి దాని గురించి తెలుసుకున్నావ్! దానిలో Carbon ఉందని గ్రహించి దాని properties మొత్తం తెలుసుకున్నావ్! ఇప్పుడు నువ్వు ఏ అమెరికాకో వెళ్ళావు, అక్కడా ఒక pencil ని చూసావ్! కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా దాని గురించి నేర్చుకోవకర్లేదు! నీకు తెలుసు అది కూడా Carbon యే అని! ఆలాగే నువ్వు కూడా ఒక pencil వి! నీలో ఉండే మనసే ఆ ముళ్ళు, దాని లోపల ఏముందో తెలుసుకుంటే, నీ ఎదుటివాడి మనసు గురించి కూడా తెలుసుకోగలవ్! నిజానికి అక్కడ ఉన్నది కూడా నువ్వే అని అర్థమవుతుంది...
చరణం-1: “కనపడేవి ఎన్నెన్ని కెరటాలు, కలగలపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అల పేరు? మనకిలా ఎదురైనా ప్రతివారు, మనిషి అనే సంద్రాన కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు?”
సముద్రం అంటే అలల సమూహం! అందరూ సముద్రం అనే అంటారు తప్ప, అలని అలని వేరు చేసి చెప్పరు, అలాగే మనమంతా కలిపి ‘మనిషి’ అనే సముద్రంలో అలలం! అందరి లోనూ ఉండే మనిషి ఒక్కడే!
“సరిగా చూస్తున్నదా నీ మది? గదిలో నువ్వే కదా ఉన్నది! చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది!”
ప్రపంచం అనేది ఒక అద్దాల గది! అందులో నువ్వు మధ్యలో ఉంటే, చుట్టూ ఉండే అద్దాలలో నీ ప్రతిబింబాలే కనిపిస్తాయి! నీ చుట్టూ ఉండే మనుషులు కూడా నీ ప్రతిరూపాలే! అసలు నీ మనసు సరిగ్గా చూస్తోందా? వాళ్ళు వేరు, నువ్వు వేరు అని చెప్తోంది!
“నీ ఊపిరిలో లేదా గాలి? వెలుతురు నీ చూపుల్లో లేదా? మన్ను, మిన్ను, నీరు అన్నీ కలిపితే నువ్వే కదా...! కాదా?”
ఈ ప్రపంచం పంచభూతాలతో ఏర్పడింది! Five Elements Of Earth! గాలి, అగ్ని(వెలుతురు, అగ్ని వలెనే ఏర్పడుతుంది), భూమి, ఆకాశం, నీరు! ఇవన్నీ నీలో కూడా ఉన్నాయి! ఇది చాలదా, ప్రపంచం నీలో ఉంది అని చెప్పడానికి?
చరణం-2: “మనసులో నీవైన భావాలే, బయట కనిపిస్తాయి దృశ్యాలై! నీడలూ, నిజాల సాక్షాలే!”
నీలో ఏ భావం అయితే కలుగుతుందో, బయట నీకు అదే కనిపిస్తుంది! అంటే నువ్వు ఆనందంగా ఉంటే, బయట కూడా ఆనందంగానే ఉంటుంది తప్ప బయట ప్రత్యేకించి ఆనందం ఏమీ ఉండదు! ఉదాహరనికి, వర్షం పడితే రోడ్లు పాడవుతాయి నీకు బండి నడపడం ఇబ్బంది అవుతుంది కాబట్టి బాధ! అదే వర్షం రైతుకి ఉపయోగపడుతుంది కాబట్టి అతనికి ఆనందం! లోపం వర్షంలో లేదు నీలో ఉంది! ‘అతడు’ సినిమాలో చందమామని ఉదహరించి నందు ఇదే చెప్తాడు! ఇక్కడ మనం కొంచెం దృష్తి పెడితే, చిన్న విషయం అర్థమవుతుంది! మన మనసుకి ఆనందం కలగడం కోసం, బయట ఏవేవో చేస్తాం, తప్ప మన మనసుని సరిచేసుకోము... ఉదాహరణకి, నీ మనసుకి బండి మీద వేగంగా వెళ్ళడం ఆనందం, అందుకోసం బండి వేగంగా నడిపి ఆనందం పొందుతావ్, తప్ప నీ మనసుకి సర్దిచెప్పుకుని వేగాన్ని తగ్గించవ్! ఒక్కసారి నీ మనసుకు నచ్చజెప్పిచూడు! ఇంక నీ ఆనందం కోసం బయట వాటిని ఏమీ మార్చకర్లేదు!
“శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులూ నీ భావచిత్రాలే!”
ఇది రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు! 1. ఈ శత్రువులు మిత్రులు అనే వాళ్ళు బయట మనుషులలో ఉండరు, నీలోనే లోపాల రూపంలో, ఇష్టాల రూపంలో ఉంటాయి! నీ లోపాలని తగ్గించుకుంటే నీకు శత్రువు అనేదే ఉండదు! 2. ప్రత్యేకించి స్నేహితులు, శత్రువులు అని ఎవరూ ఉండరు... నీ మనసుకు నచ్చిన మనుషులే నీ స్నేహితులు, నీ మనసుకి నచ్చని మనుషులే నీ శత్రువులు! ఎండా, వాన, చలి ఇవన్నీ నీ భావాలకి ప్రతిరూపాలు!
“ఎదురైన మందహాసం, నీలోని చెలిమి కోసం! మోసం, రోషం, ద్వేషం నీ మకిలి మదికి భాష్యం!”
ఎదురుగా చిరునవ్వుతో వచ్చేవాడు నీ చెలిమి కోరేవాడు! నీ మదిలో మోసం, రోషం, ద్వేషం ఉన్నాయి అంటే నీ మనసుకి మకిలి పట్టింది అని! అందరితో చిరునవ్వుతో చెలిమి చెయ్యగలగాలి! ఇప్పుడు ఒకసారి మొదటి రెండు వరసలు చూద్దాం!
“ఎంతవరకు? ఎందుకొరకు? ఇంత పరుగు? అని అడగకు! గమనమే నీ గమ్యం అయితే, బాటలోనే బ్రతుకు దొరుకు!”
అసలు నేను దేనికోసం జీవిస్తున్నాను అని అడగకు! ఎందుకంటే నీ జీవితం అనే పరుగుకి చివరిలో ఒక గమ్యం అంటూ లేదు, ఆ పరుగు సరిగ్గా పరుగెత్తడమే నీ గమ్యం! నీ పరుగుకి మొదలు-చివర నీ చేతిలో ఉండవు! అది ఎలాగంటే...
“పుట్టుకా-చావు రెండే రెండూ, నీకవి సొంతం కావు! పోనీ! జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ!”
పుట్టుక-చావు, ఒక దాని గురించి తెలుసుకుని పనిలేదు, రెండో దాని గురుంచి తెలుసుకోలేము... కానీ ఈ రెంటి మధ్య ఉన్న కాలం మనదే! దానికి పగ, కోపం, ద్వేషం ఇలాంటి రంగులు వేస్తావో! ప్రేమ, ప్రశాంతత, ఆనందం ఇలాంటి రంగులు వేస్తావో! నువ్వే నీ జీవితానికి చిత్రకారుడివి!
ఇంత గొప్ప విలువైన పాటని తన చిత్రం ద్వారా మనకి అందించిన ‘క్రిష్’ గారికి మనం ఎప్పటికీ ఋణపడే ఉంటాం! ఇప్పుడు ఈ పాటను మరోసారి వినండి.. "ఒక మంచి పాటకు జీవితాన్ని మార్చే శక్తి ఉంది" అని మీకు తెలుస్తుంది.
P.S.: ఇది సిరివెన్నెల గారి మీద గౌరవంతో, నాకు పాట అర్థమయినంత వరకూ రాసాను! తప్పులుంటే చెప్పగలరు!
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.