35 సంవత్సరాల క్రితం సంఘటన ఇది. భారతమ్మ గారిది నిరుపేద కుటుంబం, ఐదుగురు పిల్లలు. పిల్లలను పోషించడానికి భర్తతో కలిసి అదే ఊరిలోని ఫంక్షన్ హాల్ లో వంట మనిషిగా పనిచేసేవారు. ఇలాగే కొనసాగితే వారికి భవిషత్తులో అవసరాలకు డబ్బు సరిపోదని ఆ ఫంక్షన్ హాల్ యజమాని నిండు మనసుతో ఆరోజుల్లో 130 రూపాయలు ఇచ్చి టీకొట్టు పెట్టించారు. బాహుశా అప్పుడే మార్కెటింగ్ కిటుకులు తెలిశాయనుకుంటా టీ తో పాటు భారతమ్మ గారు జంతికలు చేసి అర్ధ రూపాయికి అమ్మడం మొదలుపెట్టారు.
భారతమ్మ గారిది చిత్తూరు జిల్లాలోని మొగిలి అనే చిన్న గ్రామం. అప్పటి వరకు ఆ ఊరిలో మొగిలేశ్వరస్వామి దేవాలయం వల్ల ఆ ఊరికి ఒక గుర్తింపు దక్కేది, తర్వాతి రోజుల్లో "భారతమ్మ జంతికలు ఇదే ఊరిలో దొరుకుతాయి కాదు.." అని ఆ ఊరు అలా ఫేమస్ ఐపోయింది. కట్ చేస్తే పెద్ద సక్సెస్.. ఇంట్లో అమ్మ చేసిన జంతికలు కన్నా భారతమ్మ చేసిన జంతికలే మహా రుచిగా ఉన్నాయని ఎంతోమంది అర్డర్లు ఇచ్చి మరి చేయించుకునే వారు. ఆ వచ్చే డబ్బుతో వారి ముగ్గురు అమ్మాయిలకు పెళ్ళి చేశారు.
"నీ బలం పెద్ద బండరాయిని దాటి నప్పుడు కాదు పర్వతాన్ని దాటినప్పుడు తెలుస్తుంది" అంటారో కవి. భారతమ్మ గారి పోరాటం పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యడంతోనే ఆగిపోలేదు. ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా కాని అందులో ఒక అమ్మాయి ఆరోగ్య కారణాల వల్ల చనిపోయారు, మిగిలిన ఇద్దరు ఆడపిల్లలు అనుకోని ప్రమదాలలో వారి భర్తలను కోల్పోయి పుట్టింటికి వచ్చేశారు. ఇక్కడే భారతమ్మ నిజమైన బలం మరింత బయటపడింది. పుట్టింటికి వచ్చిన కూతుళ్ళకు కొండంత అండగా నిలబడ్డారు. తాను నేర్చుకున్న పనినే నేర్పించారు ఇప్పుడు భారతమ్మ గారి దగ్గర పూర్తిగా 15మంది కలిసి పనిచేస్తున్నారు.
మిగిలిన వారు ఎలా ఐనా డబ్బు సంపాదించాలి అనే కాంక్షతో కస్టమర్స్ అభిరుచులకు అంతగా విలువనిచ్చేవారు కాదు కాని భారతమ్మ గారు మాత్రం నాణ్యమైన, రుచి కరమైన స్నాక్స్ తక్కువ ధరకే ఇస్తుండడంతో కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూతరేకులు, తరహాలో భారతమ్మ గారి జంతికలు అని బ్రాండ్ ఇమేజ్ తో మంచి పేరును అందుకుంటున్నారు. మన తెలుగు స్టేట్స్ లో మాత్రమే కాదు ఇప్పుడు భారతమ్మ గారి జంతికలు చెన్నై, బెంగళూర్, లండన్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలలో ఉన్న మన తెలుగు వారిలో చాలామంది ఇండియాకు వచ్చినప్పుడు తీసుకెళ్తుంటారు.
ఇప్పుడంటే రకరకాల స్టార్ట్ అప్స్ వస్తున్నాయి కాని ఆరోజుల్లో 35 సంవత్సరాల క్రితమే మన బామ్మ గారు మంచి సక్సెస్ ఫుల్ Entrepreneurగా పేరు తెచ్చుకుని ఇప్పటికి ఎంతోమందిని ఎక్కడో ఉండి కేవలం తన ఉనికితో Motivate చేస్తున్నారు..
Image Source: Eenadu