ఏమయ్యోయ్ ! ఏం చేస్తున్నావ్ ? మేమోయ్ ..... నా పేరు భూమి. ఇదిగో ఇతను నింగి , అది నీరు, వాడు అగ్ని ..... అది గాలి. మా కుటుంబాన్ని పంచభూతాలు అని మీరందరూ పిలుస్తున్నారు గా. ఏం చేస్తున్నావ్ ? నాకు తెలిసి ఈ పాటికే ఇంట్లో పేరుకుపోయిన చెత్తని అమ్ముకుంటూ ఉంటావ్. లేదా మా నీటిలో కలిపేస్తూ ఉంటావ్. అంతేనా ? కాస్త పెద్దమనసు చేసుకొని..... నీ సమయాన్ని ఇస్తే మా కుటుంబం లో అందరూ నీతో ఓ మారు మాట్లాడతారంట. ఎంతైనా మనిషి అని పిలవబడే నువ్వు.... కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఉత్పన్నమైంది మా నుండే గా. మా మాట కాకపోతే ఇంకెవరిది వింటావూ .......
నింగి : "ఇకపోతే నా పేరు నింగి. నువ్వు కాలివేసిన విషపదార్థాల గాలి నాలోనే తిరిగేది. విమానం లో చక్కర్లు కొడుతూ సంబరపడిపోతావ్. నన్ను దాటి అంతరిక్షంలోకి కూడా వెళ్ళావ్. రాత్రి ఒంటరి గా ఉండే నీకు, బాధలో కొట్టుమిట్టాడుతున్న నీకు చుక్కల్ని, వాటి పక్కనుండే చంద్రుడిని చూపించాను , తెల్లవారితే సూర్యుడిని పరిచయం చేశాను. అలాంటి నేను.... నీకు అతినీలలోహిత కిరణాలు పడకుండా.... ఓజోన్ అనే పొర తో కాపాడుతున్నా. కానీ దాన్నీ చీల్చేసావ్. విషవాయువులు అన్నీ నాకు , నీకు నీ చుట్టూ ఉన్నవారికి పట్టిస్తున్నావ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో. నిశ్శబ్దం ఎంత భయంకరం గా ఉందో నీకు అప్పుడే అర్థంకాదు. నిశ్శబ్దం గా ఉన్న నాకు ఉరుముతూ భయపెట్టడం కూడా తెలుసని మర్చిపోకు."
నీరు : "త్రాగే నీటిని అయ్యాను. మంచినీటి సరస్సు అని చూడకుండా ఆక్రమించేసావ్. వర్షపు నీటిని అయ్యాను. భూమిలోకి ఇంకిపోడానికి కూడా అవకాశం లేకుండా చేసావ్. ఆఖరికి సముద్రపునీటిని కూడా వదిలిపెట్టలేదు కదా. ఇంక ఏం మాట్లాడాలి నేను నీతో ? పండగ కి అసలు అర్థాన్నే మర్చిపోయావ్ . ప్లాస్ట్ అఫ్ పారిస్ వల్ల నాలో ఉండే ఎన్ని జీవరాశులు ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నాయో ఊహించలేదా ? స్వచ్ఛం గా పంటకాలువల్లోకి వెళ్ళాలి అనుకుంటే నా చేతుల్లో రసాయనాలు పెట్టి నా చేతులతోనే పంటల్ని నాశనం చేసేలా చేసావ్ ! ఊరుకున్నాను అనుకుంటున్నావేమో. ఉప్పెనై నిన్ను మ్రింగివేస్తే అడిగేవాడు కూడా ఉండడు అని మర్చిపోకు."
అగ్ని : "వీరిలో నా ఒక్కడికే భయపడతావ్. నేను నిన్ను భయపెట్టను. నా స్వభావమే అంత. నేను నాలా ఉన్నందుకే నువ్వు మాడిపోతావ్. ఇక భయపెట్టడం మొదలు పెడితే కాల్చడానికి కూడా ఎవడూ మిగలడు. సూర్యుడి స్వభావం లో ఉంటా. నువ్వు ఏరి కోరి యురేనియం లోనూ ఉంటా, ఆ పదార్ధం తో చేసే విద్యుశక్తి లో ఉంటా...... ఉండేకొద్దీ వేడి ఎక్కువయ్యి ఎ.సి రూపం లో చల్లదనం కోరుకుంటావ్. దానివల్ల నీకు నువ్వే భూతాపాన్ని పెంచేసి మరీ మరీ చల్లదనం కోరుకుంటావ్. నీ గొయ్యి నువ్వు తవ్వుకునే సమయం ఎప్పుడో ఆసన్నమైంది. "
గాలి : "నీరుకన్నా ముందు నేనే నీకు జీవనాధారం అని తెలుసు. తెలిసి కూడా ఎరువులు వాడతావ్. అంతరిక్షం లోకే వేల్లినోడివి. ఎరువులు లేకుండా వ్యవసాయం చెయ్యడం నీకు తెలియని పనా చెప్పు ? ఎగబడి ఎక్కువ రావాలనే కోరిక తో నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావ్. ఇక ముందు రాబోయే రోజుల్లో నీటి లానే మంచి గాలి అని వస్తుంది. కొనుక్కుంటావ్. ఒక చెట్టు నాటకు. ఉన్నా చెట్లని నరికేసి నువ్వు వదిలిన గాలిలోనే నువ్వు బ్రతుకు. దానికి తోడు ధూమపానం లాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయేమో కనుక్కో. ఎందుకంటే నువ్వు తొందరగా చచ్చిపోతే అందరికన్నా నేనే ఎక్కువ సంతోషిస్తా. నీలాంటివాడిలో ఊపిరినై నేను ఉక్కిరిబిక్కిరి అవ్వలేను. నన్ను విడిపించు....."
భూమి : "వేసవి సెలవుల్లో పల్లెటూళ్ళ ముఖం పడతావ్. కానీ నువ్వున్న చోటే బాగుచేసుకోవడం గుర్తించవు. నాలుగు కరివేపాకులు, ఒక మిరపకాయ వేసిన తాలింపు కే నీకు పొలోమని తుమ్ములు వచ్చేస్తే....... రోజు విడవకుండా రోజు నాలో రకరకాల రసాయనాలూ, ఎరువులూ వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తావ్. నేను తుమ్మితే నువ్వు తట్టుకోగలవా ? ఎన్నో చెట్లకి నాకూ వందల ఏళ్ళ అనుబంధం ఉంది. వంద క్షణాలు కూడా ఆలోచించకుండా నరికేస్తున్నావ్. నీ అన్నవారిని నీకు దూరం ఐతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా ఏంటి ? భూకంపాల గురించి వినే ఉంటావు గా? చెట్లు నరికితే నరికావ్. ఆ రూపం లో సంవత్సరానికి ఒక్కటంటే ఒక్కసారి...... పోనీ నీ పుట్టినరోజునాడైనా ఒక మొక్క నాటావా ? ఎవరో సాలుమరద తిమ్మక్క అనే ఆవిడ నాటితే కానీ నీకు గుర్తురాదా ? ఎన్ని చెట్లని నరుక్కుంటూ వెళ్ళిపోతావ్ ? చివరికి నువ్వు వాటిగురించి చదువుకోవాలన్నా పుస్తకాలు ఉండవు. ఇకపోతే చెత్తా చెదారానికి హద్దు లేదు. నిజానికి మీ అందరికన్నా రోజూ పొద్దున్నే వచ్చి నిస్వార్ధం గా నీ ఇంటి చుట్టూ చెత్త ని శుభ్రంచేసే వాళ్ళంటేనే నాకు చాలా ఇష్టం. వారితో పోలిస్తే ..... నిరంతరం కలుషితం చేసే నీదీ ఓ జన్మేనా ?"
చివరిగా ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఇలా మొండి గా చేసుకుంటూ పోతే చివరికి మిగిలేది మేమె తప్ప నువ్వు కానే కాదు. నువ్వు తినే ఆహరం, పీల్చే గాలి, దాహం తీర్చే నీరు నిన్ను కబళించేస్తాయి. మా పంచభూతాలు సాక్షిగా వివాహం చేసుకుంటావ్. అప్పుడు తప్ప ఆ తర్వాత మేము ఉన్నాం అని కూడా గుర్తించవు . ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడే నీ గెలుపు మొదలవుతుంది. నువ్వు గెలిచి మమ్మల్ని గెలిపిస్తావో లేదా ఓడిపోయి కోట్ల మంది లో ఒకడిలా మిగిలిపోతావో నీ ఇష్టం.