ప్రభుత్వ పనితీరు, పరిపాలన వ్యవహారాలు అన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకోవడం ఆర్థికశాఖ భాద్యత. ప్రభుత్వ కార్యకలాపాలు, సంక్షేమ పథకాలకి ధనం సమకూర్చుకోవడం ప్రభుత్వ లక్ష్యం. ధనాన్ని సమకూర్చుకోడానికి పన్నులు వసూలు చేయాలి.
మొదటగా పన్నుల చరిత్ర ని ఓసారి పరిశీలిద్దాం, ఎందుకంటే GST అనేది పన్ను యొక్క కొత్త రూపం మాత్రమే, కొత్త పన్ను కాదు.
మానవుడు మొదట్లో తన సంపదలో కొంత భాగం (పశువులు,పిల్లలు ) తెగ నాయకుడికి ఇచ్చేవాడు,నాయకుడు తన గుంపుకి కాపలాగా ఉండేవాడు. తన తెగలోని వారి సంరక్షణ అతని బాధ్యత. రాచరికం మొదలయ్యాక రాజుకి కొంత భాగం సమర్పించుకునేవారు, ఒక్కో కాలం లో ఒక్కో రాజ్యం లో రాజు కి సమ్పరించే పన్నులకి ఒక్కో పేరు ఉండేది. వలస పాలనా కాలంలో సాగులోని నిర్దిష్ట పరిణామం లో, (పండించిన ధాన్యం లో కొంత భాగాన్ని) పన్నుగా ఇవ్వడం మొదలయ్యింది.
ఇక స్వతంత్రం తరువాత ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యం లో ప్రజలు పన్నులు మాత్రమే ప్రభుత్వాన్ని నడిపిస్తాయి. మొదటగా తయారు చేయబడిన వస్తువులకు (Manufacturing Goods ), అధిక ఆదాయం కలిగిన వారికీ పన్ను విధించేవారు తరువాతి కాలం లో వస్తు తయారీ మీద మాత్రమే కాకుండా వాటి అమ్మకాలకి, వస్తు రవాణాకు, దళారీ వ్యవస్థలో భాగమైన టోకు, చిల్లర వ్యాపారులకు కూడా పన్ను వేయడం మొదలయ్యింది.
ఇలా వస్తువు తయారీ దశలను దాటుకొని వినియోగదారుని చేరుకోవడం వరకు పన్నుల మోత ఎక్కువ అవడం,వ్యాపారుల ఆందోళనలు అధికమవడంతో VAT (Value Added Tax ) అని పన్నులలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. అది ఒక వస్తువు తయారీ దశలో వస్తువుకి కలుపుతున్న విలువకు మాత్రమే పన్ను వేస్తుండేది. ఇలా VAT వలన పన్ను మీద పన్ను భారాన్ని తగ్గించడం జరిగింది. కానీ VAT తయారీ రంగానికి మాత్రమే పరిమితం అయ్యింది, సేవా రంగానికి వేరే పన్నుల లక్షణాన్ని అవలంబించే వారు, వీటితో పాటు ఇంకా అనేక రకాలైన రాష్ట్ర, కేంద్ర పన్నులు వివిధ స్థాయిలో ఉండడం తో పన్ను విధాన అధ్యయనం జటిలంగా మారింది.
విడివిడిగా ఉన్న పన్నులన్నిటిని కలిపి ఒకే పన్నుగా తీసుకురావడమే GST. ఇది ఇప్పటికే అనేక దేశాలలో అమలులో ఉంది. కొన్ని దేశాలు అమలు చేసి సాధ్యపడక మళ్ళీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నాయి.
భారతదేశంలో GST లో కొత్తదనం నాలుగు అంచెలుగా విభాగించడం (Slabs ) అవి 5%,12%,18%,28% . ఎక్కువగా వాడకం లో ఉన్న నిత్యావసర వస్తువులకు తక్కువ పన్నులు , విలాసవంతమైన వస్తు, సేవలకు ఎక్కువ పన్ను. మిగిలిన దేశాలతో పోల్చి చూస్తే భారత ప్రభుత్వం 28% slab rate కాస్త ఎక్కువ అనే విమర్శలని ఎదుర్కుంటోంది. కానీ 18% slab కిందకే ఎక్కువ వస్తు, సేవలు వస్తాయని ప్రభుత్వ వాదన.
ఒక సంవత్సర కాలం తరువాత దీనిలోని లోటుపాట్లు గమనించుకోవచ్చు, GST Council ద్వారా మరిన్ని సంస్కారాలను కూడా తీసుకురావాలని ప్రభుత్వ యోచన. ఇక అందరూ ఆందోళన చెందుతున్నట్టు ఇదేమి అంత తీవ్ర సమస్య కాదు, ప్రతీ ఏడాది వార్షిక బడ్జెట్లో ఉండే రేట్ల మార్పు వంటిదిగా భావించొచ్చు, ఎందుకంటే కొత్త పన్ను విధానం వలన పన్ను ఎగవేత తగ్గుతుంది, వినియోగదారులకి మోసాల వల్ల జరిగే నష్టాలు తగ్గుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, తిరిగి ప్రజల సంక్షేమానికి వెచ్చించడానికి తగినంత నిధులు సమకూరుతాయి. కానీ, ప్రజలలో ఉన్న భయాందోళనలకు కారణాలు అనేకం..
సామాన్యుడికి అర్ధం అయ్యేలా, విషయాన్ని వివరించవలసిన వాళ్ళు, ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారు..
GST గురించి ఉన్న అపోహల్లో కొన్ని..
1. అపోహ - పేద,మధ్య తరగతి మీద మీద ఎక్కువ భారం. వివరణ - పేద,మధ్య తరగతి వర్గాలలో 80% వారు ఆదాయ పన్ను పరిధిలోకి రారు, అంటే వారి మీద పరోక్ష పన్ను మాత్రమే ఉంటుంది, వారు ఎక్కువగా వినియోగించేవి నిత్యావసర వస్తువులు మాత్రమే. అంటే వాటి ధరలు, వాటి మీద ఉండే పన్నుశాతంతక్కువ కాబట్టి ఇబ్బంది లేదు, కాకపోతే సేవాపన్నులు (బ్యాంకింగ్,టెలిఫోన్) కాస్త భారంగా మారతాయి. భారాన్ని అదుపులో పెట్టుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు.
2. అపోహ - ఎవరు GST పరిధిలోకి వస్తారు.? వివరణ - వ్యాపారస్తులు ఎవరైనా, వారి స్థూల ఆదాయం(Yearly Turn Over) 20 లక్షలు దాటితే వారు GST పరిధిలోకి వస్తారు వారు GST లో రిజిస్టర్ చేసుకోవాలి.
GST వలన నష్టాలు అంటే ఇవి ఇప్పటికిప్పుడే చెప్పడం సాధ్యం కాదు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం సమాచారమంతా ఆన్ లైన్ లో ఉండడం వలన భద్రత దృష్ట్యా జాగ్రత్త పాటించవలసి ఉంది వ్యాపారస్తులకు e - Literacy అవసరం రిటర్న్స్ ఫైల్ చేయడం కొరకు.
ఇక GST వలన లాభాలు: 1. వ్యాపారస్తులకు సరకు రవాణాలో ఇబ్బంది తగ్గుతుంది. గత అర్ద రాత్రి నుండే దేశ వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు మూత పడ్డాయి 2. వేర్వేరు పన్నులు ఉండవు. 3. దేశమంతా వస్తువుల విలువ ఒకే రీతిన ఉండడం. 4. పన్నుల రేట్ అందరికి తెలియడంతో పారదర్శకత.
"ఒక దేశం ఒక పన్ను విధానం భారత ఆర్థిక వ్యవస్థలో సరికొత్త ఆధ్యాయం"