ఈదర వీర వెంకట సత్యనారాయణ తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో దర్శక ముద్ర వేశారు హాస్య మోతాదు వినోద మోతాదు ఎంత ఉంటుందో అంతకు మించిన స్పూర్తిని నింపే అతి తక్కువ గొప్ప దర్శకులలో ఆయన ఒకరు. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా అంతకు మించి మంచి వ్యక్తి గా ఇ వి వి ఎంతో మంది ఆప్తులైన అభిమానులను సంపాదించుకున్నారు. జూన్ 10 1956లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు లోని కోరుమామిడిలో జన్మించారు. నాన్న వెంకటరావు, అమ్మ వెంకటరత్నం. చిన్నతనం నుండి కళలు, నాటకాలు, సినిమాలు అంటే వళ్ళమాలిన ఇష్టం, రోజూ ఉదయం, మధ్యాహ్నం సినిమాలను చూడటంతో హాజరు తక్కువై ఇంటర్మీయడ్ తప్పాడు. అప్పుడు సత్యనారాయణ తండ్రి ఆయన్ను కాలేజీకి పంపించి లాభం లేదని నిశ్చయించి తండ్రితో పాటు పొలం పనులు చూసుకోవటానికి నియమించాడు. 19 యేళ్ళకే సరస్వతి కుమారితో పెళ్ళైంది. ఆ వెంటనే సంవత్సరానికి ఒకరు చొప్పున ఇద్దరు కొడుకులు రాజేష్, నరేష్ కలిగారు.
కొన్నాళ్ళకు వ్యవసాయంలో పెద్ద నష్టాలు రావడంతో పొలాలు అమ్మేయవలసిన పరిస్థితి కలిగింది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉండటానికి సత్యనారాయణ తెగ ఇబ్బంది పడి ఎక్కడికైనా మరో ఊరికి కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంకా ఆ ప్రాంతం నుండి ఇండస్ట్రీలో ఎక్కువ వారు ఉండటం వారికి దక్కే గుర్తింపు గౌరవాలను తనకు తన ప్రతిభకు కూడా దక్కాలనే బలమైన తలంపుతో సినీ రంగంలో అవకాశాల కోసం వేట మొదలుపెట్టారు. మొదట మహా దర్శకులు జంధ్యాల దగ్గర అసిస్టెంట్ డైరైక్టర్ గా ప్రయాణం కొనసాగించి దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత హాస్య చిత్రాలకు మెగాస్టార్ అయిన రాజేంద్రప్రసాద్ తో 'చెవిలో పువ్వు' తీశారు కాని అది ఫ్లాప్ అవ్వడంతో ఎవ్వరూ తనతో తీయడానికి ముందుకు రాలేదు ఇక నా పని అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో మూవి మొగల్ డా. డి.రామానాయుడు బ్యానర్ లో లోబడ్జెట్ తో 'ప్రేమ ఖైది' తెరకెక్కించారు ఆ సినిమా ఘన విజయం సాధించింది, ఇక అప్పటి నుండి తన ప్రయాణం వేగం పుంజుకుంది జంధ్యాల తర్వాతి స్థానాన్ని ఇ.వి.వి భర్తి చేశారు
జంధ్యాల హాస్య రసాన్ని మించి కొంత ఘాటైన కామేడినే సినిమాలలో ఒలికించి ప్రేక్షకులకు ఒక కొత్తరకమైన అనుభూతిని అందించారు. ఎవ్వరూ పరిచయం చేయలేనటువంటి కొత్తరకమయిన కథలతో జంబలకిడిపంబ, ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, తొట్టి గ్యాంగ్, మా అల్లుడు వెరీ గుడ్, ఎవడి గోల వాడిదే, కితకితలు, బెండు అప్పారావు, హలో బ్రదర్ లాంటి పూర్తిస్థాయి హాస్యాన్ని అందిస్తూనే మరొక పక్క కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు తీయడంలో ఆయనకు సాటి. ఆయన ఒక పక్క వినోదాన్ని అందిస్తూనే ఆలోచనత్మకంగా సమాజాన్ని మేలుకొలుపేలా ఆయన సాగించిన సినీ ప్రస్థానంలో ఏమండి ఆవిడ వచ్చింది, అబ్బాయి గారు, ఆమె, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఆయనకు ఇద్దరు, తాళి, మా నాన్నకు పెళ్ళి, మావిడాకులు, కన్యధానం, నేటి గాంధీ, అమ్మో ఒకటో తారీఖు, పెళ్ళైంది కాని సినిమాలు ముఖ్యమైనవి.
తీసింది 51 సినిమాలు అయినా తెలుగు అగ్ర నటులందరితో చిరంజీవి(అల్లుడా మజాకా) బాలకృష్ణ(గొప్పింటి అల్లుడు) నాగార్జున(హలో బ్రదర్, ఆవిడా మా ఆవిడే) వెంకటేష్(ఇంట్లోఇల్లాలువంటిట్లో ప్రియురాలు) వీళ్ళతో మాత్రమే కాకుండా భారతదేశం గర్వించ తగ్గ నటుడు అమితాబ్ బచ్చన్ తో హింది సూర్యవంశాన్ని తెరకెక్కించారు.పని చేసిన అందరితో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. తన మరపురాని హాస్యంతో మనల్ని ఎంతగానో నవ్వించి మంచి చిత్రాలను మనకు ఒదిలేసి 2011 లో క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు.