This Guy Recollecting His Experience Of Watching Chandramukhi For First time & It's Super Relatable

Updated on
This Guy Recollecting His Experience Of Watching Chandramukhi For First time & It's Super Relatable

Contributed By Jayanth Deepala

చంద్రముఖి : ఆ పేరు వినగానే నిక్కర్ తడిసి పోయేది చిన్నప్పుడు , అర్ధ రాత్రులు అయితే ఇప్పటికీ అనుకోండి. నా జన్మలో నేను మొదటిసారి ఒక సినిమా గురించి భయపడింది ఇదే. "దెయ్యం" అనే పదం కూడా మొదటిసారి వినడం కావొచ్చు. మా నాన్న , ఆయన ఫ్రెండ్ కలిసి చాలానే సినిమాలు చూశారు , ఇంటికొచ్చి కథ చెప్పే వాడు కూడా. కానీ ఈ సినిమా మా " భుజంగ " లో చూసొచ్చాక " ఒక రెండు గంటలు డాడీ ఏం మాట్లాడలేదు రా" అని మమ్మీ చెప్తుంటే విని ఓ భయం మొదలైంది. నైట్ షో కదా సో అప్పుడు నాకు కథ వినే ఛాన్స్ లేదు , రాత్రి ఇంటికొచ్చాక అమ్మకైనా చెప్పడేమో అని అడిగితే అది సమాధానం.

అప్పటి నుంచి పారడైజ్ దగ్గర మా సంగీత్ సాగర్ కి ఎప్పుడు వెళ్ళినా అక్కడ కౌంటర్లో అంకుల్ని అడిగే వాడిని. వి.సి.డి ఇంకా విడుదల అవ్వలేదు అని చెప్పేవాడు. విడుదల అయిన తరవాత కొన్నా . మా నాన్న డబ్బులు కడుతుంటే నాకు ఆ సి.డి కవర్ మీద ఉన్న " చంద్రముఖి " అనే పదం ఎంబొస్సింగ్ ని తడుముతుంటేనే , ఓ విధమైన భయం మొదలైంది.

స్కూటర్ మీద ఇల్లు చేరెలోపు ఇది చూడకూడదు అనే భయం దాటి ఇది చూడాలి అని ఉత్సుకతను పెంచుకోవాలని రజినీకాంత్ పాత సినిమాలు గుర్తు తెచ్చుకున్నా , అప్పటికి నేను చూసినవి బాషా , నరసింహ , అరుణాచలం , బాబా. దాంట్లో మన సూపర్ స్టార్ దుమ్ము దులిపాడు కాబట్టి దీంట్లో దెయ్యం ఉన్న ఏం కాదు అని ఓ ధైర్యం తెచ్చుకున్నా.

సరే అని ఇంటికెళ్ళి చూస్తే మమ్మీ ఆల్రెడీ మూడ్ సెటప్ చేసి పెట్టింది. కర్టెన్స్ కపేసి మా ఇల్లంతా చీకటి చేసింది. తరవాత కనుకుంటే చెప్పింది , డాడీ ఫోన్ చేసి చెప్పాడు అంత వీడు అడిగి అడిగి చంపిన సినిమా సి.డి. దొరికింది అని.

ఇక మొదలు , నేను ఆల్రెడీ ఆ మ్యూజిక్ కి అలవాటు పడి ఉన్న కాబట్టి , రజినీకాంత్ థిం మ్యూజిక్ ని యమ ఎంజాయ్ చేశా , అప్పట్నుంచి మొదలు పెడితే , ఫస్ట్ ఫైట్ , ఇంట్లో డిస్కషన్ దాకా ఎంజాయ్ చేసా , అంతే. అదే లాస్ట్. ఆ లైబ్రరీ సీన్ నుంచి ఇక చూస్కోండి , ఆ " రాజ మహల్ " , ఆ చంద్రముఖి చిత్ర పటం చూడగానే ఔట్. దానికి తగ్గ ఆ భయంకరమైన శాస్త్రీయ సంగీతం కడుపులో భయవీణ వాయించింది.

కాస్త వడివేలు నవ్వించేలోపు , స్ స్ స్ స్ అని పడిపోయే సీన్. గుండె గొంతులోకి వచ్చినట్టు ఉండేది కొన్ని సార్లు. చెప్పిన మాట వినకుండా పైకి వెళ్ళినప్పుడు ఆ గంగని ఎన్ని తిట్టుకున్నానో , అలా వంకరగా ఆ మెట్ల వైపు చూసి ఆ చైన్ లాగినప్పుడే ఎవరో పిలవడం వల్ల కదులుతున్న ఆకు అలా ఆగిపోవడం పిచ్చెకించింది. అన్ని సెట్ చేస్కొని పైకి పోతుంటే తాళం చేసిన తాత చచ్చాడు అనే వార్త వెన్నులో వణుకు పుట్టించింది.

ఇంతా చేసి గది తెరిస్తే ఏమైన బంగారం దొరికిందా లేదు భూతం దొరికింది. అప్పటి నుండి జరిగే ప్రతి సంఘటన ప్రశ్నార్ధకమే. భయం రేటింపు చేసేది కానీ డోస్ మాత్రం తగ్గేది కాదు. అన్ని జరిగి ఒక పిచ్చిలో ఉన్నప్పుడు దిగుతాడు నా దేవుడు " రజినీకాంత్ " , పేరులో కూడా ఆ శివుని అనుగ్రహమే " ఈశ్వర్ ". ఆ వచ్చిన రోజే దీనికి దుర్గకీ ఏం సంబంధం లేదని తెల్చుకొని. ఆ గదిలోకి గంగను తీసుకెళ్లినప్పుడు తన గొంతుకే భయమేసి కళ్ళు మూసుకున్నాను.

తనకి ఏదో అయింది అనిపించింది. అప్పుడే సిద్ధాంతి గారు వస్తారు. ఇక ఆయన మంత్రాలకు ఈశ్వర్కీ వార్ అనుకున్నా అప్పుడు. ఆయన పూజ చేస్తున్నపుడు సర్లే పూజేగా అని అమ్మ లేసి బాత్రూం వెళ్ళాలి అనుకునేలోపు ఈశ్వర్ " వేంకటపతి రాజు " ఎంట్రీ , ఇక కూర్చుండి పోయింది పాపం. అప్పట్లో తమిళ్ తెలీదు కాబట్టి ఆ పాము డోర్ వెనక నుంచి వచ్చే గొంతుకి పాస్ పోసుకొనే పరిస్థితి వచ్చి పాజ్ చేసి , కాస్త ధైర్యం తెచ్చుకుని మళ్లీ ప్లే చేసా. ఇవన్ని మా కష్టాలు , డాడీ కి ఇవన్నీ ముందే తెలుసుకాబట్టి ప్రిపెర్డ్ గా చెవులు , కళ్ళు మూసుకుంటున్నాడు. సినిమా మీద కాన్సెంట్రేషన్ వల్ల ఆయనని చూడట్లేదు ముందే తెలుసుకోడానికి.

ఆ తరవాత , ఈశ్వర్ కి జరిగే అవమానం చూసి రగిలిపోయాను. కరెక్ట్ గా అదే టైం కి మాకు నెగెటివ్ గా ఉన్న సిద్ధాంతి గారు ఈశ్వర్ గొప్పతనం గురించి చెప్తుంటే అదో పిచ్చి హై. సరే అని ఒక టీమ్ గా చేరి , గంగ ను టెస్ట్ చేద్దాం అని వెళ్ళినప్పుడు డైలాగ్స్ , తన కళ్ళు , ఆ మంచం లేపడం ఇప్పటికీ కళ్ళ ముందు ఉంది , చెవిలో మోగుతుంది. టెస్టింగ్ అయ్యాక ఏం చేద్దాం అన్న కైలాష్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం దాంట్లో కూడా గంగ వేసే కత్తి గాల్లో ఆగడం నాకు బాగా నచ్చింది. ఇంతా చెప్పాక ఈశ్వర్ బలికి సిద్ధం అవుతున్నాడనే ఆలోచనకే నాకు బాధ వేసింది. ఆ బాధలో కూడా రజినీ " విజయం మనదే " అన్నప్పుడు ధైర్యం పుట్టేసింది.

అప్పుడు మొదలైంది , నా జీవితానికి సరిపడా భయం ఇచ్చిన పాట. " వారాయి.. వారాయి.. " అని , మనిషి జాతి మొత్తం పాస్ పోసుకునే కళ్ళు , తన నలిగిపోయిన చీర , ఆ చెదిరిపోయిన జుట్టు , మేకప్. ఒక్కసారి స్క్రీన్ మీదకి దూకగానే గుండె ఆగినంత పని అయ్యింది. చాలా కష్టం మీద మొహం మీదున్న చేతుల వేళ్ళ సంద్దులోంచి చూసా ఆ పాట ని , ఆ అబ్బాయి కూడా కలిసి డాన్స్ చేస్తుంటే ఒక నిమిషానికి తేరుకొని , చేతులు తీసేసా . వేంకటపతి రాజా ఎంట్రీ ఆ సైగలు భయంతోనే కాసింత కోపం వచ్చింది. రజినీ అనే సంగతే మర్చిపోయా , అదేగా ఆయన మ్యాజికూ. తరవాత తను అరిచేది , ముగ్గులో కూర్చొని గజ్జలని కొట్టేది చూసి వణుకుకు మించింది ఏముందో అదే పుట్టింది. చివరికి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యి ఈశ్వర్ బతకడం చూసి తెగ ఆనంద పడిపోయా. సుఖాంతం.

సుఖాంతం అయింది సినిమానే , నా జీవితంలో ఎప్పటికీ సుఖం లేకుండా చేసిందీ సినిమా. ఆరు తరవాత గజ్జల సప్పుడు విన్నా , ఎక్కడైనా ఎప్పుడైనా ఆ పాట చూసినా అంతే సంగతులు , నా ప్రాణం గాల్లోకే.

ఇంత జరిగినా నాకు ఈ సినిమా అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. ఈ అద్భుతం వచ్చి పదిహేను ఏళ్లు అయ్యిందంటే అసలు నమ్మ బుద్దే అవట్లేదు.

అప్పటికీ , ఇప్పటికీ , ఎప్పటికైనా నా జీవితం లో " చంద్రముఖి " అనేది నాకు ఓ పాత్రో , సినిమానో కాదు , ఓ అనుభూతి.

సదా దానికి భయపడుతూ ఉండే , ఎనిమిది ఏళ్ల ఒక కుర్రాడు.