మన ఇంటికి ఎన్నోసార్లు న్యూస్ పేపర్లు వస్తాయి, మ్యాగజీన్స్ వస్తుంటాయి కొన్నిరోజులకు వాటిని పడేస్తాం. కాని పవిత్రమైన భగవద్గీత, బైబుల్, ఖురాన్ లాంటి పుస్తకాలను మాత్రం ఎప్పటికి మన దగ్గరే ఉంచుకుంటాం. అలాగే ఇప్పటికి వేల సినిమాలు చూసినా కాని మన మదిలో గొప్ప సినిమాలకే ఎప్పటికి స్థానం ఉంటుంది అలాంటి గొప్ప సినిమాలలో ఒకటి సాగర సంగమం.. గంగ, గోదావరి లాంటి జీవనదులు ఒకచోట పుట్టి నేను ఎక్కడికి కదలను ఇక్కడే ఉంటానంటే ఎందరో దాహంతో అల్లల్లాడి చనిపోతారు అలాగే నేర్చుకున్న కళను మరొకరికి నేర్పకుండా తమ వద్దే నిరుపయోగంగా ఉండకూడదు అది నిరంతరాయంగా ఒకరి నుండి మరొకరికి ప్రవహించాలనే అద్భుత సందేశంతో ఈ సాగర సంగమం సినిమా పూర్తవుతుంది. ఇందులో ప్రతి ఒక్క సీన్ ఒక అద్భుతమనే చెప్పాలి. ఏ సీన్ కూడా కథలో నుండి బయటకు వచ్చేలా ఉండదు, ప్రతి సన్నివేశం కూడా మరొక సన్నివేశాన్ని కలుపుతూ, ప్రతి సన్నివేశం సినిమాకు అవసరమనే విధంగా సాగుతుంది.
(కొన్ని సీన్లు నిశితంగా వర్ణించాలి, మరికొన్ని పైపైన వర్ణించి వాటిని మీ ఊహకే ఒదిలేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్నాను)
కథానాయకుని ఆగమనం: నేను చాలా సినిమాలు చూశాను కాని ఇలాంటి సీన్ మాత్రం ఏ సినిమాలోను చూడలేదు. హీరో ఇంట్రడక్షన్ అంటే అతన్ని ఎలివేట్ చేయడానికి ఒక ఫైట్. ఒకపాట లేదంటే ఆయనను వర్ణిస్తూ అతని చుట్టు ఉండే చెంచగాళ్ళ భజన, లేదంటే పూల వర్షంతో ఎంట్రీ ఉంటుంది కాని సాగరసంగమంలో బాలు(కమల్ హాసన్) ఎంట్రీ సీన్ అలా ఉండదు. "బాలు మీద ఓ రిక్షా అతను చెప్పులు వేస్తాడు" ఇక్కడే బాలు మనకు మొదటిసారి కనిపిస్తాడు.
పంచ భూతాలు అంటే దయ్యాలు కాదు: వీడో పచ్చి తాగుబోతు వెదవ. వీడికి నాట్యం ఏం తెలుసని శైలజ కోప్పడుతుంది, నాకు కాబోయే భార్య మీద పేపర్ లో ఇలా కించపరుస్తూ రాశాడని శైలజ ప్రియుడు 'బాస్టర్డ్' అని బాలుని దూషిస్తాడు. కాని బాలు వారిలాగే అక్కడ ఆవేశపడడు. ఒకవేళ అతనిలో నిజమైన టాలెంట్ లేకుంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. వాళ్ళకి ఎలా సమాధానం చెబితే అర్ధం అవుతుందో అలాగే సమాధానం చెబుతాడు, ఎక్కడ తొక్కాలో అక్కడే తొక్కుతాడు. ఇక్కడ చాలా ప్రశ్నలకు బాలు సమాధానం చెబుతాడు.. పంచభూతాలు అంటే ఏమిటి.? దానికి నువ్వు ఎలా నర్తించాలి అని శైలజకు వివిధ సాంప్రదాయాలలో నాట్యం చేసి చూపిస్తారు, ఇలా చేసి చూపించడంతో శైలజపై నేను రాసిన వ్యాసం కరెక్ట్ యే అని, ఈ వ్యాసం రాయడానికి నాకు అర్హత ఉందని, అలాగే ఆడియేన్స్ కు కూడా ఒక అనుమానం తీరుస్తాడు నేను ఇంతలా తాగుతున్నా నాలో ఇప్పటికి టాలెంట్ తగ్గలేదని ఇప్పటికి నేను మరొకరికి నేర్పించగలననే ఒక సందేశం చేరుస్తాడు. చివరిగా బాస్టర్డ్ అన్న వాడి చెంప పగులగొట్టడంతో ఆ సీన్ అక్కడితో ముగుస్తుంది.
మాధవి సర్ ప్రైజెస్: మాధవి, బాలు ల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. మాధవి బాలును దాదాపు ఎప్పుడు కలిసినా కాని ఏదో ఒక సర్ ప్రైజ్ తో అతనిని ఆనందంలో ముంచేస్తుంది.
గణేషుని ముందు నాట్యం: బాలు ఏనాడు కూడా కష్టపడి నేర్చుకున్న నాట్యాన్ని కేవలం డబ్బుకోసమో లేదంటే తన స్వార్ధ ప్రయోజనాల కోసమో ప్రదర్శించలేదు. ఒకరోజు మిత్రుడు ఫోర్స్ చేయడం వల్ల ఒక సినిమాలో డాన్స్ మాస్టర్ కు అసిస్టెంట్ గా చేరుతాడు. అందులో మంచి సాహిత్య నేపద్యం ఉన్న పాటని అద్భుతంగా నర్తించి చేసి చూపిస్తే దానికి వారు హేళనగా మాట్లాడతారు, సాంప్రదాయ నృత్యం నేర్చుకున్నవాడు సినిమాలకు పనికిరాడు అంటూ దూషిస్తారు. అంతే కాకుండా కళను పవిత్రంగా భావించే బాలుతో అలా అసభ్యంగా డాన్స్ చేయమనడం, తలవంచి తను చేయడంతో బాలు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి తానో పెద్ద తప్పు చేశానని గుర్తిస్తాడు. చేసిన తప్పును ప్రక్షాళన చేసుకోవడానికి సిద్ధిని, బుద్ధిని, క్రమశిక్షణను అందించే గణేషుని ప్రతిమ మందు తనకు తెలిసిన నాట్యంతోనే క్షమాపణ చెప్పి మరల ఇలాంటివి చేయకూడదని బలంగా నిర్ణయించుకుంటాడు.
అమ్మ మరణం, దహన సంస్కారాలకు అమ్మనే డబ్బు ఇవ్వడం: ఇది కేవలం బాలు జీవితంలో మాత్రమే కాదు చాలామంది కళాకారుల జీవితంలో ఎదురయ్యే అత్యంత కఠినమైన పరిస్థితి. కాని ఇక్కడ మాత్రం సన్నివేశం మరింత హృదయ విదారకమైనది. అప్పుడే ఢిల్లీలో జరిగే నాట్య ప్రదర్శన ద్వారా తన జీవితం మారబోతుందని భావిస్తాడు బాలు. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ పోటీలకు వెళ్ళకపోవడం, ఆ తర్వాత తల్లి మరణం. బాలు అమ్మకూడా తన కొడుకు దగ్గర డబ్బులుంటాయో ఉండవో, నాకోసం ఇబ్బంది పడకూడదని ముందుగానే తన దహనసంస్కారాలకు డబ్బు దాచుకుని చనిపోయేటప్పుడు తన చీరకొంగులో దాచుకున్న డబ్బును అందిస్తూ చనిపోవడం అత్యంత కలిచివేసే సన్నివేశం.
నిజమైన స్నేహానికి ప్రతీక: రఘు, బాలు ప్రాణ స్నేహితులు. బాలు గొప్పవాడు కాబోతున్నాడు అని బలంగా నమ్మిన మొదటి వ్యక్తి. కాని బాలు పరిస్థితుల మూలంగా తాగుడుకు బానిసై నెమ్మదిగా నాశనమైనా కూడా తన స్నేహాన్ని వదులుకోడు. బాలు నుండి మరేదైనా ఆశించి ఉండేదుంటే రఘు ఏనాడో విడిచివెళ్ళేవాడు కాని రఘు కోరుకున్నది బాలు సంతోషాన్ని మాత్రమే.
ప్రేమ త్యాగం: జిడ్డు కృష్ణమూర్తి ఒక మాట చెబుతారు 'ఒక వ్యక్తిని మనం మనస్పూర్తిగా ప్రేమిస్తే వారి ఆనందం తప్పా వారి నుండి ఇంకేమి కోరుకోకూడదు, చివరికి తిరిగి ప్రేమించాలనే కోరికతో సహా". బాలు మాధవిని గౌరవంతో, గాడంగా ప్రేమిస్తాడు మాధవి కూడా బాలును అంతే ప్రేమిస్తుంది. కాని మాధవికి అప్పటికే పెళ్ళి జరిగిందని తన తండ్రి ద్వారా తెలుసుకున్న బాలు మాధవిని భర్త ని ఇద్దరిని ఒక్కటి చేస్తాడు. ఇది నిజమైన ప్రేమకు మరొక ఉదాహరణగా నిలిచిపోయింది. ఇక్కడి నుండే బాలు పతనం మొదలవుతుంది.. మొదట అమ్మ, తర్వాత ప్రేమ, ఆ తర్వాత తన పంచ ప్రాణమైన నాట్యం. ఈ మూడు అతనికి దూరమవడంతో ఇక కోల్పోయేది ఏది లేక నెమ్మదిగా సర్వ నాశనం అవుతాడు.
ఆ ఒక్కరోజు కోసమే: (రఘు మాధవితో..) "మీ దంపతులు కలిసిన రోజు, మీ కాపురం నిలబడిన రోజు వాడికో పండుగ. ప్రతిరోజు ఎంత తాగినా, ఎలా తిరిగినా, సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రం పవిత్రంగా, ప్రతి గుడికి వెళ్ళి మీ దంపతుల పేరు మీద అర్చన చేయిస్తాడు.. మాధవి గారు 364 రోజులు బ్రతికేది ఈ ఒక్కరోజు కోసమే". జంధ్యాల గారు రాసిన ఈ మాటల గురుంచి, అసలు ఈ సీన్ గురించి ఏమని వర్ణించగలం, ఎంతని వివరించగలం.?!
జన్మకు అర్ధం: టైం దగ్గరపడుతుంది. తనలో ఉన్న కొద్దిపాటి శక్తి పూర్తిగా నశించేలోపే తనలోని కళను మరొకరికి దానం చేయాలని బాలు విపరీతంగా తాపత్రయ పడతాడు. డాక్టర్లు వద్దని విశ్రాంతి తీసుకోవాలని ఎంత నచ్చచెప్పినా కాని తన సంకల్పాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి, తనే ఆశ్ఛర్యపడేంతలా విజయం సాధిస్తారు..
క్లైమాక్స్: ఇక్కడ బాలు చనిపోయాడా లేదంటే హాస్పిటల్ కు తీసుకుపోతున్నారా అనే విషయాన్ని ఆడియెన్స్ కు స్పష్టంగా తెలియజేయకుండా వారి ఆలోచనలకే, వారి ఊహకే దర్శకుడు వదిలేశారు. ఇలాంటి క్లైమాక్స్ కొన్ని సినిమాలకు మాత్రమే అతికినట్టు సరిపోతుంది. ఇలాంటి సీన్ మరొకరు సృష్టించలేరు. ఇది విశ్వనాథ్ గారి మార్క్.