Suggestion Gouse Pasha)
ఏదైనా ఎలా వాడాలి అని మాత్రమే కాదు దానిని సరిగ్గా ఎలా ఉపయోగించాలి అని కూడా తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఫేస్ బుక్ అంటే కేవలం టైం పాస్ కోసమే అనుకుంటారు చాలామంది, మిత్రులతో టచ్ లో ఉండడం అనుకుంటారు కొంతమంది. నిజమే కావచ్చు కాని ఫేస్ బుక్ స్థాయి అంతవరకు మాత్రమే పరిమితం కాదు ఒక జీవితాన్ని మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని మార్చే శక్తి కూడా సోషల్ మీడియాకు ఉంది. ప్రస్తుతం ఒక అమ్మ జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసుకుందాం..
ఈ అమ్మ పేరు గౌరక్క. చాలా బీదవారు. భర్త రాజలింగు, ఇంకా పుట్టుకతోనే మతి స్థిమితంతో పాటు కళ్ళు కనిపించని కూతురితో జగిత్యాల జిల్లా రాజారం అనే చిన్న గ్రామంలో గట్టిగా తుఫాను వస్తే కొట్టుకుపోయే ఒక చిన్న గుడారంలో బ్రతుకుతున్నారు. వృద్దాప్యంతో శరీరంలో శక్తి తగ్గడంతో వారి పనులే వారు చేసుకోవడం కష్టతరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. భర్త రాజలింగు గారికి వచ్చే 1,000రూపాయల పెన్షన్ తోనే ఆ ముగ్గరు బ్రతుకుతున్నారు.
కొన్ని రోజల తర్వాత భర్త చనిపోవడంతో వారికి వచ్చే ఆ వెయ్యి రూపాయల పెన్షన్ కూడా రావడం ఆగిపోయింది. ఇక మరణమే వారికి ఆసరా ఇచ్చి ఆ దీన కష్టాల నుండి విముక్తులను చేస్తుంది అన్న సమయంలో.. "సాటి మనిషికి సహాయం చేయడానికి భగవంతుడుని నిందించాల్సిన పని లేదు, ఇంకా మానవత్వం ఈ భూమి మీద బ్రతికే ఉందని బలంగా నమ్మి రమేష్(ఇతనే మొదట అప్ లోడ్ చేశారు అని పూర్తిగా తెలియదు) అనే వ్యక్తి వారి ఫొటోలు తీసి, వారి కథను వివరిస్తూ ఒక పోస్ట్ ను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు".
అందులో గొప్ప లక్ష్యం ఉండడంతో చేరవలసిన మంచి మనుషులను చేరుకున్నది ఆ పోస్ట్.. ఆ అమ్మలో వారి కన్నతల్లిని చూసుకున్నారు కాబోలు మిత్రులందరూ కలిసి ఏకంగా లక్షా ఇరవై వేలకు పైగా డబ్బును సేకరించి ఆ అమ్మ, కూతురు ఉండడానికి ఒక మంచి ఇంటిని నిర్మించారు. ఇంతకు ముందు గుడారంలో సూర్యుడి ద్వారా మాత్రమే వెలుగు వచ్చే ప్రదేశం నుండి ఇప్పుడు పవర్ సప్లై, ఫ్యాన్ సదుపాయాలతో రెండు గదులున్న ఇంటిలోకి ఆ కుటుంబం వచ్చేసింది. అంతే కాదు ఎస్పి గారు కూడా నిండు మనసుతో ముందుకు వచ్చి 2,00,000 రూపాయలను గౌరక్క గారి పేరు మీద బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేయబోతున్నారు.
ఈ సంఘటన నిజమైన మానవత్వానికి ప్రతీక.. ఇలానే మరిన్ని ఎన్నో గొప్ప కార్యక్రమాలు సోషల్ మీడియా వేదిక మీద జరగాలి.. అందులో మనం కూడా మనకు తోచినంత సహాయాన్ని అందించడానికి ముందుకు సాగాలి.. మానవత్వం వర్ధిల్లాలి.