హీరో కొడుకు హీరో అవ్వాలనుకుంటున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు ఇలా దాదాపు అందరూ అనుకుంటున్నారు.. రైతు మాత్రమే ఎందుకు తన కొడుకును రైతుగా చూడదలుచుకోవడం లేదు. ఇది నాకు ఎంతో బాధ కలిగించే విషయం.. - ఫణీంధ్ర కుమార్
వేదం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ఇల్లు కట్టెటోడికి ఇల్లుంటుందా..? చెప్పులు కుట్టేటోనికి చెప్పులుంటాయా..? బట్టలు నేసేటోడికి బట్టలుంటాయా..? అని.. ఈ డైలాగ్ ను ఇంకా పొడిగించాలి "బురద నుండి బువ్వ తీసే రైతన్న కు బువ్వ ఉంటుందా.."? ఒకడి బాధ వందశాతం తెలియాలంటే వాడి బాధ అనుభవిస్తే తప్ప తెలియదు. ప్రస్తుత ప్రపంచం దృష్టిలో దురదృష్టం అనుకోవాలో అతని దృష్టిలో అదృష్టమని అనుకోవాలో కాని ఫణీంధ్ర కుమార్ ఓ రైతుకు కుటుంబంలోనే పుట్టాడు. చిన్నతనం నుండి ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఎదిగినంత వరకు కూడా నాన్నకు వ్యవసాయంలో సాయం చేస్తూనే ఉంటాడు.
మిగిలిన ఉద్యోగులకు ఫలానా సమయంలో జీతం వస్తుంది. రైతన్నకు మాత్రం ఒరిజినల్ విత్తనాల కొనుగోలు దగ్గరి నుండి అన్ని ఆటుపోట్లు తట్టుకుని పంట చేతికందినా మార్కెట్ సమస్యలు దాటుకుని మంచి ధర వస్తే తప్ప రైతుకు లాభం చేకూరదు. మిగిలిన అన్ని ఉద్యోగాలు, వ్యాపారాల కన్నా అత్యంత రిస్క్ తో, అత్యంత కష్టతరమైనది వ్యవసాయం మాత్రమే. అందుకే తమ సుఖాలను త్యాగం చేసే తల్లిదండ్రులు వారి పిల్లలను రైతుగా చూడదలుచుకోవడం లేదు. "నాన్న నేను కూడా వ్యవసాయం చేస్తాను నీతోపాటు" అని ఫణీంధ్ర కుమార్ అంటే నాన్న "నువ్వు హైదరాబాద్ లో తాపీ పని ఐనా చేసుకో గాని వ్యవసాయం మాత్రం చేయకు" అని ఖరాకండిగా చెప్పేశారట.
ప్రతి ఉత్పత్తిదారునికి తాను తయారుచేసిన వస్తువులకు ధర నిర్ణయించే అధికారం ఉంటుంది కాని రైతుకు మాత్రమే ఈ అవకాశం లేదు. వర్షాలు సరైన సమయంలో పడకపోవడం, అతివృష్టి, సమస్యలు మన చేతులలో లేకపోయినా మన చేయగలిగినంత చేసి రైతును రాజును చెయ్యాలి. "పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి" అని దీనిపై ప్రభుత్వాలు స్పందించాలని ఫణీంధ్ర కుమార్ మన హైదరాబాద్ అసెంబ్లీ నుండి అమరావతి అసెంబ్లీ వరకు 325 కిలోమీటర్లు ఐదురోజులలో పరిగెడుతూ చేరుకున్నాడు.
కేవలం రోడ్డు మీదనే కాదు రోడ్డును దాటుకుని పక్కనున్న పొలాలకు సైతం ఫణీంధ్ర కుమార్ ప్రయాణం సాగింది. ఎంతోమంది రైతులను కలుసుకున్నాడు, రైతుగా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారంగా ఏం చేస్తే బాగుంటుందని వారినే అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కుంటున్న సమస్యలన్నీ కూడా పేపర్ డాక్యుమెంటరీ లో పొందుపరిచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అందజేశారు.