Contributed By: Girish Raman
పొలిమేరలో పందిరేసి మరి పరిచారు, నిగ నిగ లాడే నాగు లాగుంటాది, నాగు పాములా బుస కొడ్తది, దాని నిండా విషం వుంటది. ఆడికొచ్చినవాళ్లు అందరు సుట్టాలే. ఆడున్న సుట్టలు సక్కని సుట్టాలే. సక్కని సుట్ట చక్కని చుక్క. ఆ ఊరిలో ఓ రైతు వున్నాడు. వాడి భూమి కి నీటి శాతం తక్కువ, వాడి శరీరంలో రక్తశాతం తక్కువ. వాడికో చంటోడు. చంటోడికి ఇంకా గింజ అరగదు ఊహా ఎరుగదు. పెళ్ళాం అమాయకురాలు. పొలంకు పోతు పలుమార్లు పొలిమేరలో వున్నా పాము పుట్టని సుసాడు. పగలంతా పని చేస్తాడు రాత్రంతా కలలు కంటాడు. ప్రతి రేతిరి ఎన్నో కలలు మొలిచాయి వాడి కనురెప్పల మీద, ఎన్నో చమట చుక్కలు రాల్చిన ఒక్క మొక్క రాలేదు వాడి భూమి మీద. ఎన్నో కన్నీళ్లు పారాయి వాడి గరుకు చెంప మీద. ఓ పౌర్ణమి నాడు ఆ వెన్నల వెలుగుకి గాలి సోకింది వాడికి వాడి చంటి బిడ్డ వెండి ఊగిన్ని అమ్మి, నగదు పట్టుకొని నాగ పాము పుట్టలో దూరాడు. వాడి కంటి పాపలాంటి పోలంకి పోయిన, సుక్కల్ని చూస్తూ సుక్కేసి ఆడే కూలిపోయాడు. అక్కడినుండి ప్రతి రేయి అమావాస్యే. ఇంట్లో కంది పప్పు లేదు, జమిందార్ దెగ్గర అప్పు వుంది . నీటి కరువు వుంది, పంటకి ఎరువు లేదు. ఐన ప్రతి రాతిరి ఓ సారాయి సీసా కొన్నాడు. చాలా సార్లు పడిపోయాడు. పాడైపోయాడు. రోజుకో కష్టం వచ్చేది, రాత్రికో సీసా పగిలేది. పొలం దున్నెప్పుడూ పూటకో గాజు పెంకు వాడి కాలికి గుచ్చుకునేది, గాయం ఎంతో లోతుకు దిగేది. ఆ సారం లేని భూమి వాడి నెత్తురు ఎంతో త్రాగింది. ఐన సరైన చెప్పులు కొనలేదు, మరో మందు సీసా ఎక్కువ కొన్నాడు. నెలకి ముప్పై అమావాస్యలు! గాజు సీసాలో ఇరుక్కున్న గాజు పురుగు వాడు. అప్పుకి వడ్డీ ఎక్కువైంది, ఒంటికి పుండ్లు ఎక్కువయ్యాయి, ఆ ఇంటికి కష్టాలు ఎక్కువయ్యాయి . ఓ నాడు , కలుపు పీకడానికిపోయి అలుపొచ్చి పడిపోయాడు. ఇంటికి మోసే లోపే నురుజు కక్కుకొని సచ్చాడు. పాము కాటేసింది. "ఏ పామో మరి ?" రెండేళ్ళ బుడ్డోడు కుండా మోసి కొరివి పెట్టాడు. ఈసారి ఏకంగా పుడమి వాడినే మిగింది,వాడి అస్తికలు పొలం లో పూడ్చారు. కొన్నాల్టికి వాడి సమాధిపై ఓ మొక్క పుట్టుకొచ్చింది .