చిన్నప్పుడు, అంటే కాలేజీలున్నప్పుడు "ఫిదా" అనేడ్ది మనకు ఊత పదముండె. గప్పట్ల "కహో నా ప్యార్ హై" హ్రితిక్ రోషనానికి అర్పిత మస్తు ఫిదా అన్నట్లు.ఇగో..గిప్పుడు నా ఏజ్ లెక్కవెెట్టుడాపుండ్రి.అస్సల్ ముచ్చటకొద్దాం.
సినిమా మంచిగుంది అననీకె మనసొస్తలేదు. అసలు నా మనసు నా దగ్గరుంటె కదా. బన్సువాడలో భాను దగ్గర ఇడ్షిపెట్టిన నా మనసుని. ఆమె తన కన్నీళ్ళతో స్నానం చేపిచ్చింది నా మనసుకి.తన నవ్వులతో , అమాయకత్వంతో నా మనసుకి రంగులద్దింది. తన డాన్సులతో నా మనసుకి చిందులు నేర్పింది. నా మనసును గింత అందంగా తయారుచేసిన భానుకి రిటర్న్ గిఫ్టుగా ఏమివ్వల్నో తెల్వక నా మనసే ఇచ్చేసా పదిలంగ ఉంచుకోమని. భానూ...బంగారం..నీ గురించి ఎంత చెప్పినా తక్వే. నువ్వొక్కటే పీస్. నీకు నేను ఫిదా పో.
సినిమాలో కథేమీ లేదు.కధనం మాత్రం జబర్దస్తుగున్నది. కొద్దిసేపు గుండె బరువెక్కించి ఎక్కి ఎక్కి ఏడ్చేటట్టు చేస్తరు. మల్ల మరి కొద్దిసేపట్లనే నవ్విచ్చి గుండెల లగేజిని హల్కగా చేస్తరు. సినిమాలో ఎవరో ఆక్టర్లను చూసినట్టస్సలనిపియ్యలేదు. మనోళ్లని , మనూళ్లని చూసినట్టే అనిపించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మనం మనింటికి పోతె ఎట్లుంటదో గట్లనిపించింది మొత్తం సిన్మా.
శేఖర్ కమ్ముల సార్ యాప్పీడేస్ సినిమా రెండో సీక్వెల్ గిట్ల తీసిండేమో అని జర్రంత గుబులైంది కానీ గింత ట్రెండ్ సెట్టింగ్ సిన్మా తీస్తడనుకోలేదు. చెప్పడానికి కథ లేకున్నా చెప్పుకోవడానికి , పంచుకోవడానికి, నెమరువేసుకోవడానికి ఎన్నో ఎమోషన్స్ ఇచ్చిండు శేఖర్ సార్. అప్పగింతల సీను చూసి ఏడ్వనోడు మనిషే కాదు పో. " అశ్లీలత లేకుండా కూడా మాంఛి సినిమాలు తియ్యొచ్చు..జనాలను థియేటర్లకు రప్పించొచ్చురా జఫ్ఫాస్ !" అని మైకు మళ్లీ పట్టుకుని మరీ తన తోటి దర్శకుల గూబలు గుయ్మనిపించిండు. శేఖరం సార్..మా ఇంటి పిల్లగాడు నానితో కూడా మీరొక మాంచి సిన్మా తీస్తె చూడాలని చిన్న ఆశ.ఆ సిన్మాలో హీరోయిన్ కోసం వెతకే పనేలేదు. మన భానూ ఉండనే ఉందిగా!
చిట్ట చివరకు నేన్జెప్పొచ్చేదేందంటే గీ సిన్మా చూడకుంటె లైఫుల మంచి అనుభూతిని కోల్పోయినట్టే.