అవి వెంకట్ 6వ తరగతి చదువుతున్న రోజులు.. ఒకరోజు వెంకట్ ఫ్రెండ్ బాగా కండలు తిరిగిన సూపర్ మ్యాన్ బొమ్మ ఒకటి క్లాస్ లోకి తీసుకుని వచ్చాడు. ఆ బొమ్మ వెంకట్ కు ఎంతగానో నచ్చింది. మూడో కన్నుకు తెలియకుండా ఆ బొమ్మను కాజేసి ఇంటికి తీసుకొచ్చి నాన్నకు చూపిస్తూ "నాన్న చూస్తూ ఉండూ ఇదిగో ఏదో ఒకరోజు నేను కూడా ఇలా కండలు పెంచుతాను చూడు" అన్నాడట. దానికి నాన్న నవ్వి తేలిగ్గా తీసుకున్నారు. కట్ చేస్తే అనుకున్నట్టుగానే వెంకట్ కండలు పెంచేశారు. మామూలుగా కాదు సెలెబ్రేటీస్ కే ట్రైనింగ్ ఇచ్చేంతలా.. సామాన్యులకు సమయం వారి చేతులలో ఉండదు.. అందుకే ఉదయాన్నే నిద్రలేవలేరు, చేయాల్సిన పనులన్నీ వాయిదా వేసుకుంటారు. విజేతలకు అలా కాదు.. సమయం వారి చేతుల్లోనే ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేవగలరు, రన్నింగ్ చేయగలరు, క్రితం రోజు అనుకున్న పనులన్నీ, లక్ష్యాలన్నీ సాధంచగలరు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కూడా అలా సమయాన్ని తన గుప్పెట్లో దాచుకున్న ఓ విజేత కథ.
కూలి పనే మొదటి వ్యాయామం:
కృష్ణా జిల్లా గుడివాడలో నివసించే వెంకట్ ది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న స్టేట్ బ్యాంక్ చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా కాని ఆర్ధికంగా ఆ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కునేది. ఆ పరిస్థితుల నుండి కుటుంబాన్ని బయటపడేయడం కోసం వెంకట్ పోలం పనుల దగ్గరి నుండి, తాపి పని, గోడలకు పేయింటింగ్స్ ఇలా రకరకాల పనులుచేశారు. ఆ పనులలోనే మొదట తన ఫిట్ నెస్ ను మెరుగుపరుచుకున్నారు.
ప్రొఫేషనల్ ట్రైనర్ గా..
వెంకట్ చిన్నతనం నుండి వేయిట్ లిఫ్టర్ గానో, కండలు పెంచి బాడీ బిల్డర్ అవ్వాలనీ అనుకోలేదు. ఫిట్ గా ఉంటూ ఫిట్ నెస్ ట్రైనర్ అవ్వాలనే అనుకున్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత (అప్పటికే వెంకట్ నాలుగు సంవత్సరాలుగా జిమ్ కు వెళ్తున్నారు). సెలబ్రెటీలకు ట్రైనింగ్ ఇచ్చే అరవింద్ విజయవాడకు ఓ ప్రత్యేక పనిమీద వచ్చారు. తన జిమ్ లో కోచ్ ల కోసం ఇంటర్వూ చేస్తున్న సమయంలోనే వెంకట్ ను చూడడం జరిగింది. మంచి ఫిజిక్ తో ఉన్న వెంకట్ ను చూడగానే ఒక డెసిషన్ కు వచ్చేశారు. అలా మొదటిసారి 2005లో బంజారా హిల్స్ లోని ఓ జిమ్ లో ట్రైనర్ గా ఎంపికయ్యారు.
ట్రైనింగ్ స్టైల్:
మనకు సరైన గైడెన్స్ ఇస్తూ లక్ష్యానికి చేరువచేసేందుకు సహాయపడే వక్తే అసలైన కోచ్. వెంకట్ కు ఈ వృత్తిలో డబ్బులు సంపాదించడం కన్నా ట్రైనింగ్ ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందపడతారు. కోచింగ్ ఇవ్వబోయే వ్యక్తి శరీరాన్ని చూసి అతను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వర్కౌట్స్ చేయాలి లాంటివి కూడా ప్రతి ఒక్కరిని తన టీమ్ తో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు.
మన తెలుగువారికి కూడా ఫిట్ నెస్ అంటే ఇష్టమున్నా కాని మంచి ట్రైనర్లు దొరకడం కష్టంగా మారింది. పోని యూట్యూబ్ లో ఐనా చూసి నేర్చుకుందామనంటే అక్కడ ట్రైనర్ల భాష విషయంలో కాని, వారి జిమ్ ఎక్విప్ మెంట్ మనకు చాలా తేడా ఉండడం వల్ల రకరకాల అపోహలుంటాయి. వెంకట్ యూట్యూబ్ లో కూడా ట్రైనింగ్ క్లాసులు చెప్పడం, ఆహారం విషయంలో కూడా మనకు లోకల్ గా దొరికే వాటినే సజెస్ట్ చేయడం వల్ల ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుని జీవితంలో వారి లక్ష్యలలో ముందుకు సాగిపోతున్నారు.