పేషేంట్స్ ఆరోగ్యకారణాలతో, వారి కోసం వచ్చే బంధువులు బాధతో వస్తుంటారు. ఎక్కడ ఉన్న లేకపోయినా హాస్పిటల్స్ మాత్రం ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. హాస్పిటల్ లో క్యాంటీన్లు చాలా తక్కువ చోట్ల ఉంటాయి. ఒకవేళ ఉన్నా అందులోని భోజనం ఖరీదు చాలా ఎక్కువ. డబ్బు ఉంటే ట్రీట్మెంట్ కు అవసరమవుతుంది, వృధా కాకూడదు అని చాలామంది వారి భోజనాలను త్యాగం చేస్తుంటారు. ఇదిగో ఈ పరిస్థితిలోనే సేవా కిచెన్ వారు మానవత్వం అనే బంధుత్వంతో రుచికరమైన భోజనాన్ని అన్ని ప్రముఖ హాస్పిటల్స్ లో అందిస్తున్నారు.

సేవా కిచెన్ మొదట నాగ్ పూర్ లో ప్రారంభమయింది. పోషాకుష్రు నాన్న గారు క్యాన్సర్ వ్యాధితో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కుటుంబ సభ్యులు, దూరపు బంధువులు, మిత్రులు చాలా మంది వచ్చేవారు. సరైన భోజన సాధుపాయాలు లేకపోవడం, డబ్బులేకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. పోషాకుష్రు కు ఇది వ్యక్తిగతంగా బాధ కలిగించినా, నాన్నను వదిలి ఉండలేని పరిస్థితి. కొంతకాలానికి నాన్న మరణించారు. నాన్న బ్రతికున్నప్పుడు వచ్చిన బంధువులు లానే ప్రతి హాస్పిటల్ లో, ప్రతి పేషేంట్ బంధువులు ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందిని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశ్యంతో స్థాపించిందే ఈ సేవా కిచెన్.

పోషాకుష్రు సేవా కిచెన్ కార్యక్రమాలను పరిశీలించిన మన హైదరాబాద్ కు చెందిన జీ.ఎస్టీ కమిషనర్ శ్రీలీల, మరియు బండి ఉషా నందిని, అనీలా, శిరీష, స్వాతి, శైల, రాధిక, దుర్గ, శాంతి వసుధ, శాంతా జాన్ మొదలైన అన్నపూర్ణమ్మలు మన హైదరాబాద్ లో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ధనవంతుడు అని ఒక నిర్ణయానికి రాలేము. ఆరోగ్య శ్రీ రావడం వల్ల ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలా గవర్నమెంట్ హాస్పిటల్ అనే కాకుండా ప్రతి ప్రముఖ హాస్పిటల్ కు కూడా వెళ్తుంది సేవా కిచెన్.

మొదట బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ లో 50 మందికి అన్నదానంతో ప్రయాణం మొదలుపెట్టారు. వడ్డించే భోజనం ఎక్కడో హోటల్ నుండి కొనడం, లేదంటే మిగిలిపోయిన ఫుడ్ ఇవ్వడం లాంటివి చెయ్యకుండా స్వయంగా మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొని మరి అందరూ కలిసి వంట చేస్తారు. హాస్పిటల్స్ కు వెళ్లిన ప్రతిసారి సుమారు 500 మందికి సరిపడ భోజనాన్ని స్వయంగా వడ్డిస్తారు. వీటితో పాటు పేషేంట్స్ కు బలాన్ని ఇచ్చే ఎగ్స్, పండ్లు, బిస్కెట్స్ కూడా ఆత్మీయంగా ఇస్తారు.

అంతే కాదు ఎక్కడ ప్రక్రుతి వైపరీత్యాలు జరిగిన, తమ అవసరం ఉందని అర్ధమైన వెంటనే అక్కడికి చేరుకుంటారు. వరద బీభత్సంలో చిక్కుకుపోయిన కేరళకు కూడా టన్నుల కొద్దీ ఆహార పదార్ధాలను చేరవేస్తున్నారు. అభాగ్యులు ఎక్కడ ఉంటె అక్కడికి సేవా కిచెన్ చేరుకుంటుందనేదానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహారణ.


