గీత ఒక సామాన్య ఐటీ ఉద్యోగిని.. తనకో హాబీ ఉంది. ప్రతిరోజూ సాయంత్రం ఐదు కాగానే సూపర్ మార్కెట్ లోకి వెళ్లి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు, కొన్ని బటర్ మిల్క్ ప్యాకెట్లు, ఒక డజన్ అరటిపళ్ళు కొని నిమ్స్ హాస్పిటిల్ సమీపంలోని ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్ లో పెడుతుంది. ఇక ఏమీ ఎరుగనట్టు ఎదో బస్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా ఫ్రిడ్జ్ ని గమనిస్తూ ఉంటుంది. ఒక 50 సంవత్సరాల పెద్దాయన రెండు అరటిపళ్ళు, ఒక బటర్ ప్యాకెట్ తీసుకున్నారు, ఓ పాతిక సంవత్సరాల యువకుడు ఒక బిస్కెట్ తీసుకున్నారు. ఫుడ్ ఐటమ్స్ ఎవరు పెట్టారో ఆ ఇద్దరి వ్యక్తులకు తెలియదు, అవ్వి నేనే పెట్టాను అని చెప్పాలనే ఆశ కూడా ఇక్కడ గీతకు లేదు.. ఆకలితో ఉన్నవారికి నా వంతుగా ఎంతోకొంత సహాయం చేసి ఆకలి తీర్చగలిగాను అని ఇక్కడ గీతకు సంతోషానికి వేడి అశ్రువులు కూడా తోడయ్యాయి.. భోజనం పెట్టె మేఘంలా వర్షంలా కన్నీరు నేల జారింది.
ఫీడ్ ది నీడ్ అనేది ఒక్క గొప్ప కాన్సెప్ట్, పది మంది ఆకలి తీర్చడంతో పాటు సాటి మనుషుల పట్ల బాధ్యతను ప్రేమను పెంపొందిస్తుంది. నీలిమ గారు ఇంకా తన మిత్రులు కలిసి ఫీడ్ ది నీడ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ సమీపంలో, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, శిల్పారామం పరిసరాలల్లో ఏర్పాటుచేశారు. ప్రతి ఒక్క ఫ్రిడ్జ్ దగ్గర ఒక ఉద్యోగస్థుడిని నియమించారు. ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోవడం, ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ కాకుండా అందరికి సమానంగా ఆకలిగా ఉన్న వారికి పంచివ్వడం ఈ ఉద్యోగి బాధ్యత.



ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభమైన ఈ తరహా ప్రాజెక్టు బెంగళూరు చెన్నై లో ఇదివరకే నిర్వహిస్తున్నారు. దీని గురుంచి నీలిమ గారు తెలుసుకున్నారు.. "అరే చాలా మంచి ఆలోచన.. ఇలాంటిది మన సిటీలో కూడా కొన్ని చోట్ల పెడితే చాలా బాగుంటుంది, రోజుకు టన్నుల్లో వ్యర్ధమయ్యే ఆహారంలో కొంతైనా కడుపునింపుతుంది" అని అనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ అక్కడ అంతగా సక్సెస్ కాలేదు. మంచి ఆలోచన కానీ సక్సెస్ కాలేదని సుమారు ఆరు నెలల పాటు విపరీతంగా రీసెర్చ్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ అవసరం ఎక్కువగా ఉంటుంది, అలాగే రెస్టారెంట్ల వారితో ప్రత్యేకంగా చర్చించి వారినీ ఇందులో భాగస్వామ్యం చేశారు. ఫ్రిడ్జ్ దగ్గర ఒక ఉద్యోగి ఖచ్చితంగా ఉండాలి లేదంటే పదార్ధాలు పాడవ్వడమో, ఆహార పదార్ధాలన్ని ఒకరిద్దరే తీసుకునే అవకాశం ఉందని ప్రతి నెల జీతంతో ఉద్యోగిని నియమించారు.



హైదరాబాద్ లో ప్రతి పది కిలోమీటర్ కు ఒక ఫీడ్ ది నీడ్ ఫ్రిడ్జ్ ఉండాలనేది నీలిమ గారి సంకల్పం. ఇందులో నాన్ వెజ్, వెజ్ ఇంకా అన్ని రకాల ఆహార పదార్ధాలను ఎవ్వరైనా ఆహారం పెట్టవచ్చు, తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్కో ఫ్రిడ్జ్ యాభై మంది ఆకలిని తీరుస్తుంది.


