అక్షయ్ రెడ్డి గారు సాయిబాబా భక్తులు.. ఒకరోజు పుస్తకం చదువుతుండగా పుస్తకం మొదటిపేజీలలో కొన్ని అద్భుతమైన వాక్యాలు ఇలా రాసి ఉన్నాయి.. "కేవలం మనం ప్రతిరోజు భోజనం చేస్తున్నట్టుగా, ప్రతిరోజు జీవిస్తున్నట్టుగా, ప్రతిరోజు ఊపిరి తీసుకుంటున్నట్టుగా, మనలోని దయా, దాన గుణాన్ని ఇతరులపై చూపించాలి. నన్ను నమ్మండి.. దీనికి ఏమంత పెద్ద ఖర్చు అవ్వదు, కేవలం మీ హృదయం విశాలంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మనం ప్రతిఒక్కరం కనీసం ఒక్కపూట భోజనాన్ని త్యాగంచేసినా లేదంటే వారానికి ఒక్కపూట భోజనం త్యాగంచేసినా లక్షలాది అభాగ్యుల కడుపునిండుతుంది."


రెస్టారెంట్ నుండే: ఎప్పుడైతే పుస్తకంలోని ఈ విలువైన పదాలు చదివారో అంతకుముందే అక్షయ్ గారిలో ఉన్న దయా గుణానికి మరింత బలం చేకూరినట్టుగా తెలిసింది. అక్షయ్ గారు సైన్మా అనే రెస్టారెంట్ ను కొంపల్లి ప్రాంతంలో నడిపిస్తున్నారు.. వలస కార్మికులకు, పేదవారికి భోజనం పెట్టాలన్న సంకల్పానికి పార్ట్నర్ సందీప్ గారు తోడవడంతో ప్రస్తుతం ప్రతిరోజు వారి రెస్టారెంట్లోనే 1600 ప్యాకెట్ల భోజనం పేద వలస కార్మికులకు, కమ్మని 1,000 పెరుగు అన్నాన్ని మూగ జీవాలకు దాదాపు 36 రోజులుగా ప్రతిరోజు వండి వడ్డిస్తున్నారు.


మంచి క్వాలిటీ గల భోజనం: ఏ పనిచేసినా మనసా వాచా కర్మణా చెయ్యడం వారి లక్షణం. అక్షయ్, సందీప్ ఒక రెస్టారెంట్ ఓనర్లు.. మిగిలిన NGO వారు గ్రాసరి ఇవ్వగలరు కానీ వీరు భోజనం వండి నేరుగా ఇవ్వవచ్చు. చాలామంది ఈ భోజనంతోనే ఒకరోజంతా సరిపెట్టుకుంటున్నారు. అందుకే క్వాలిటీ, న్యూట్రీషన్ విషయంలో ఎలాంటి రాజీపడడం లేదు. ప్రతి మీల్ కోసం దాదాపు 40రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 750గ్రాముల రైస్ తో వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్ పలవ్, టొమాటో బ్రింజి, ఆలూ కుర్మా, దానితో పాటుగా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద అరటిపండు ఇస్తున్నారు. భోజనం పెట్టడమే ఎక్కువ అందులోనూ క్వాలిటీ చూసుకోవాలా.? వీది కుక్కలకు పెరుగన్నం అంత చిక్కగా ఎందుకు? అవ్వేమైన టేస్ట్ చూసి గూగుల్ లో రేటింగ్ ఇస్తాయా? పెరుగులో బాగా నీళ్లు పోసి పల్చగా పెట్టండి సరిపోతుంది.. అని కొంతమంది వారికి ఉచిత సలహాలు ఇచ్చినా రాజీపడని దృఢమైన శ్రేష్ఠమైన మనస్తత్వం వారిది.



లాక్ డౌన్ నేపథ్యంలోనే కాదు, మాములు రోజుల్లో కూడా మూగజీవాల పట్ల తన దయా గుణాన్ని చూపుతారు. అక్షయ్ గారి కారులో పార్లేజి బిస్కెట్ ప్యాకెట్లు ఎన్నో పెట్టుకుని తను వెళ్లే మార్గంలో ఏ కుక్క ఐన కనిపిస్తే వాటికి బిస్కెట్లు పెడతారు. ప్రస్తుతం ఎండాకాలం, ఈ వాతావరణంలో పెరుగన్నం(ప్రతి ప్లేట్ కోసం 28 రూపాయల వరకు ఖర్చుపెడుతున్నారు.) అవసరం. దీనికోసం ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కనుక సహాయం అడగకముందే వస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, ఐపీఎస్ తేజ్ దీప్ కౌర్ గారు(రిటైర్డ్) అక్షయ్, సందీప్ చేస్తున్న సహాయ కార్యక్రమాలకు అండగా ముందుకు వచ్చారు. అలాగే రాబిన్ హుడ్ NGO, పీపుల్స్ ఫర్ యానిమాల్స్ NGO, అమెరికాలో, హైదరాబాద్ లో ఉన్న మిత్రులు కూడా ఈ కష్టతరమైన సమయంలో అన్ని రకాల సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తున్నారు.

ఒకసారి ఇలాగే భూదేవి నగర్ స్లమ్, బోయిన్ పల్లి, ఓల్డేజ్ హోమ్స్ లో భోజనం ఇవ్వడం మొదలుపెట్టారు. డిన్నర్ కోసం భోజనాన్ని సిద్ధం చేస్తుంటే ఒక బాధాకర సంఘటన చోటుచేసుకుంది.. కొన్ని కుటుంబాలకు అదే ఫస్ట్ మీల్, ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేదు, లంచ్ లేదు. ఆరోజు భోజనం అందించకుంటే కనుక అక్కడి పేదలకు ఆకలితోనే ఆరోజు ముగిసిపోయేది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నారు.. ఇలాంటి సందర్భంలో భోజనాన్ని ఆపగిలిగే శక్తి వారికి ఉంటుందా.? దాదాపు 36 రోజులుగా నిర్విరామంగా ఈ అద్భుతమైన కార్యక్రమం కొనసాగుతుంది, దీనికి మీ వంతు సహకారాన్ని అందజేస్తే మరిన్ని రోజులు నిర్విఘ్నంగా పూర్తిచేయగలుగుతారు.

ఈ క్రింది అకౌంట్ ద్వారా మీ సహాయాన్ని అందించవచ్చు.. PH: 9700605555 (Akshay Reddy) Account for Donations: Village Foods and Beverages Account No. 180705500624 IFSC code ICIC0001807 ICICI BANK Kompally Branch. Hyderabad.