దాదాపు ఐదు సంవత్సరాల క్రితం(2013) నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామానికి చెందిన రాకేశ్, హరికృష్ణలిద్దరూ వివిధ రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయారు. వీరిద్దరూ కూడా 20 సంవత్సరాల వయసున్న యువకులే.. అమ్మానాన్నల ఆశలు, రాకేశ్ హరికృష్ణ ల లక్ష్యాలు కేవలం ఒకే ఒక్క తప్పిదం వల్ల బూడిదలో కలిసిపోయాయి. వారిద్దరి బందువులతో సహా ఆ గ్రామమందరు కన్నీరు పెట్టుకున్నారు. ఇక్కడ వారిలో బాధ మాత్రమే కాదు, భవిషత్తులో మాకు జరిగే అవకాశం ఉంది అన్న భయంతో కూడా.. ఈ పరిస్థితే హెల్మెట్ వాడకపోవడం వల్ల ఎంతటి ప్రమాదమో తెలియజేసింది.
నగేష్ ఆ గ్రామానికే చెందిన యువకుడు పది సంవత్సరాల నుండి గల్ఫ్ లోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగేష్ ను ఈ సంఘటన కదిపింది. కమ్మర్ పల్లి గ్రామానికి రాగానే హెల్మెట్స్ మీద అవగాహన కల్పించాడు. అవగాహన ఐతే కల్పించాడు కాని గ్రామస్థులలో కొంతమందికి వాటిని కొనే స్థోమత లేదు. వారికి రక్షణ ఇస్తూనే ఇబ్బంది పెట్టకూడదని నగేష్ ఇంకా ఇతర గ్రామస్థుల సహాయంతో 40 హెల్మెట్లను కొన్నారు.

ఈ హెల్మట్లను గ్రామ ప్రవేశ మార్గంలో కస్తూరి గంగారాం కిరాణా షాప్ లో పెట్టారు. గ్రామస్థులు ఎవరైతే మెయిన్ రోడ్ మీదుగా వెళతారో వారు ఈ హెల్మెట్లను పెట్టుకుని తిరిగి గ్రామంలోకి వచ్చేటప్పుడు మళ్ళి వాటిని అదే షాప్ లో ఉంచుతారు. ముందుగా కాస్త ఇబ్బంది పడినా తర్వాతి కాలంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ గ్రామం వారే కాదు చుట్టు పక్కల వారు కూడా హెల్మెట్లను ఉపయోగపడుతుంది.

ఈ పద్దతి చాలా బాగుంది కదా.. ఇలా ప్రతి ఒక్క గ్రామంలోని యువకులు ముందుకు వస్తే రక్షణతో పాటు ఐక్యత కూడా పెరుగుతుంది.