ఈ సాంప్రదాయం రావడానికి కారణం:
తరతరాలుగా వస్తున్న కొన్ని సాంప్రదాయాలు సమాజానికి ఎంతో మేలుచేస్తున్నాయి. అలాంటి సాంప్రదాయాలు ప్రతి ఊరిలోనూ ఉండి తమ బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాయి. కర్నూలు జిల్లా గంజహళ్లి అనే గ్రామంలో పూర్వం మహాత్మ బడే సాహెబ్ అనే ఆధ్యాత్మిక గురువు ఉండేవారు. తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి సూక్తుల రూపంలో వివరించేవారు. ఆయన అన్నా, ఆయన చెప్పే మహత్తరమైన మాటలన్నా ఆ చుట్టు ప్రక్కలున్న గ్రామాల ప్రజలకు ఎంతో గౌరవం. ఓ రోజు మహాత్మ బడే సాహెబ్ గారి కొడుకును పాలు తీసుకురమ్మని సూచించాడట.
అదే సమయంలో ఊరిలో వివిధ అనారోగ్య కారణాల వల్ల చాలా పశువులు మరణించాయి. పాలు లేక వట్టి చేతులతో ఈ సంఘటనను బడే సాహెబ్ గారికి వివరించాడట. ఆ ఊరిలో ఒక ఆవు బ్రతికేఉంది, ఆ ఇంటి నుండి పాలు తీసుకురా అని కుమారుడికి సాహెబ్ గారు చెబితే అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్లి చుస్తే ఆ ఆవు కూడా మరణాన్ని చేరుకునే చివరిదశలో ఉంది. గత్యంతరం లేక కుమారుడు అదే ఆవునుండి పాలు తీసుకుంటాడు.
ఈ సంఘటన బడే సాహెబ్ గారి మనసును ఎంతగానో కలిచివేసింది. "గోవు కూడా మన తల్లి వంటిది, అమ్మ మనకు కొంతకాలం వరకు పాలు ఇస్తే గోమాత జీవితాంతం ఇస్తుంది, గోమాతను మనం కాపాడుకోవాలి.. అప్పటినుండి ఏ ఇంటివారు పాలు అమ్మకూడదు అని సూచించారట. అప్పటినుండి పిల్లలకోసం ఎవరు అడిగినా గంజహళ్లి, కడిమెట్ల గ్రామ ప్రజలు ఉచితంగా పాలను అందిస్తారు.
పెద్దలమాటను తూచా తప్పకుండా నేటికి తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని ఈ రెండు గ్రామ ప్రజలు పాటిస్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు గ్రామాలలో వ్యవసాయం అంతగా లాభసాటిగా సాగదు, అందుకోసం గేదెలు, ఆవులను కొనుగోలు చేసి చాలా కుటుంబాలు చిన్నపాటి పాడి పరిశ్రమను నడిపిస్తున్నాయి. పిల్లలకు ఉచితంగా పాలను అందించడమనే ఈ సాంప్రదాయం కుల మతాలకు అతీతంగా కొనసాగించడం ఎంతో శ్రేయస్కరం, అందరికి కాకపోయినా కనీసం పిల్లలకయిన ఉచితంగా ప్రతి ఊరి ప్రజలు అందిస్తే పోషకాహార లోపం భారినపడకుండా కొందరినైనా రక్షించగలిగిన వారమవుతాము..