Contributed By: Raviteja Ayyagari
నిజం, అబద్ధం. వ్యతిరేక పదాలైనా, లిపి మాత్రం ఒక్కటే. నిజాన్ని పోల్చడానికి చేదు, నిప్పులని వాడితే, అబద్ధాన్ని పోల్చడానికి అందాన్ని వాడారు. నిజం చెప్పడం కష్టం. అబద్ధం చెప్పడం మనకే నష్టం. అబద్ధం చాలా సులువుగా పాకిపోతుంది. నిజం, అది తెలిసిన మనిషిలోనే దాగిపోతుంది. నిజం దాయటం కష్టమా? అని నాతో నాకే జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడిలాగా భగవద్గీతను బోధించటానికి కాలం రచించిందే ఈ కథ .
నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను గత 10 సంవత్సరాలుగా ఇంటి నుంచి పారిపోయాడు. యే ముహూర్తాన నన్ను కలిశాడా, నా ప్రాణ స్నేహితుడు అయిపోయాడు. ఒక రోజు పోస్ట్ ఆఫీస్ లో వాడి ఫొటోతో ఉన్న ఒక ప్రకటన చూసాం. వాళ్ళ అమ్మగారు ఇప్పటికి వాడి గురించి వెతుకుతున్నారు. అది చూసి వాడికి బాధేసింది. వెంటనే ఊరు బయలుదేరి అమ్మ దగ్గరకి వెళ్ళాలి అని చాలా ఆరాట పడ్డాడు. బైక్ ని వేగంగా నడుపుకుంటూ వెళ్ళాడు. బైక్ బాలన్స్ తప్పి కింద పడ్డాడు. వెనకాల కూర్చున్న నేను మట్టిలో పాడడం వాళ్ళ నాకు కొంత చర్మం లేచి ఊడిపోయింది. కానీ, వాడు అక్కడే ఉన్న కంకర రాళ్ళ మీద పడ్డాడు. తల కి బాగా దెబ్బలు తగిలాయి. కొన ఊపిరితో ఉన్న వాడి దగ్గర కి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాను.
"ఒరేయ్! నేను పోతున్నాను. అమ్మని జాగ్రత్తగా చుస్కో. ఆలా నాకు మాట ఇవ్వు!" అని నా చేత ఒట్టేయించుకున్నాడు. ఆవేదనలో ప్రమాణం చేశాను కానీ, వాళ్ళ అమ్మగారికి నిజం ఎలా చెప్పను అనే ఒక భయం. నిజం చెప్పడానికి ఎప్పుడు వెనకాడని నేను, ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఈ నిజాన్ని ఎలా చెప్పాలా అని కలిగిన ఆలోచన వల్ల భయంకరమైన పగటి కళలు కన్నాను. ఏదైతే అది అయ్యింది అని ధైర్యం చేసి, వాళ్ళ ఊరు వెళ్ళాను.
వాళ్ళ ఊరు వెళ్లి, వాళ్ళ అమ్మగారికి నన్ను ఆవిడా కొడుకు స్నేహితుడిగా పరిచయం చేసుకున్నాను. వాళ్ళ అబ్బాయి తనని తీసుకురమ్మన్నాడని, నాతో రమ్మని అడిగాను. ఆ మాట వినగానే ఆవిడలో పట్టలేనంత ఆనందం. చుట్టు పక్కల వాళ్ళకి ఆ విషయం చెప్తూ, ఒక్క సారిగా కుప్పకూలి పడిపోయారు. దగ్గరికి వెళ్లి చూస్తే, నాడి లేదు. ఊపిరి ఆగిపోయింది. మోహంలో మాత్రం చిరునవ్వు. కొడుకు బతికే ఉన్నాడు అన్న ఆ మాట వినడం కోసమే బతికి ఉన్నారేమో ఆవిడ.
అబద్ధం చెప్పి ఒక నిండు ప్రాణాన్ని బలి తీస్కున్నానా? లేక నిజం దాచి కొడుకు పోయాడు అనే బాధ తో జీవచ్ఛవం లా బ్రతికే కంటే ఆనందంగా శ్వాస వదిలారు అని నాకు నేను నచ్చచెప్పుకొన? ఆవిడ మోహంలో ఉన్న సంతోషం చూస్తే అర్థం అయ్యింది. నిజం దాయడం అప్పుడప్పుడు మేలే చేస్తుంది అని. నిజం దాయడం వల్ల, అబద్ధం చెప్పడం వల్ల, కొన్నిసార్లు ఆనందం పంచచ్చు.