ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రాణికి బ్రతికే హక్కు ఉందని అంటారు గౌతమ బుద్దుడు. సాధారణంగా పామును చూడగానే చాలామంది చంపడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే అవ్వి విషపూరితమైనవి అని అంటారు కాని నిజానికి పాములు వాటిని అవి కాపాడుకోవడానికి ఆయుధంగా విషాన్ని కలిగి ఉంటాయి తప్ప కనపడ్డ ప్రతి ప్రాణాన్ని చంపడానికి కాదు, చాలా రకాల పాములు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటాయి. పాముల వల్ల కూడా మనకు చాలా ఉపయోగాలున్నాయి, ఆ ఉపయోగాలను వివరిస్తూనే ఇంట్లోకి వచ్చిన పాముల్ని జాగ్రత్తగా పట్టుకుని అడవిలో వదిలిపెడుతున్నారు Friends Of Snakes Society సభ్యులు.
Friends Of Snakes Society (Ph:8374233366): తన చిన్నతనంలో పాములను కిరాతకంగా చంపటాన్ని చూసి చలించిపోయిన రాజ్ కుమార్ కానూరి పాములను కాపాడడం మాత్రమే కాదు ప్రకృతికి కూడా వీటి అవసరం ఉందని మరికొంతమందితో ఈ సొసైటీని 1995లో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత దీనిని రిజిస్టర్ చేయించి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసిపనిచేస్తున్నారు. మొదట కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభించారు, ఇప్పుడు వాలంటీర్ల సంఖ్య 150కి పైగా చేరుకుంది. ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది, ఏదైనా నిదానంగా ప్రారంభమవుతుంది అన్నట్టుగా 1995లో ప్రారంభించినప్పుడు "పాములు పట్టుకోండి అని వీరికి చాలా తక్కువ సంఖ్యలో కాల్స్ వచ్చేవి కాని ప్రస్తుతం రోజుకు 400కాల్స్ వరకు వీరు అందుకుంటున్నారు" (ఒక్క హైదరాబాద్ జిల్లా నుండే రోజుకు 100కాల్స్ వస్తుంటాయి). మొదట కేవలం రంగారెడ్డి జిల్లాకే పరిమితమైన వీరి సేవలు ఇప్పుడు అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరించాయి, రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాలలోని పాములను కాపాడబోతున్నారు.
పాములపై ప్రేమ: కాపాడిన పాములను వారం రోజలపాటు సైనిక్ పూరిలోని షెల్టర్ లో ఉంచి వాటి ఆరోగ్యాన్ని పరిశీలిస్తారు, ఆ తర్వాత అడవిలో వదలిపెడతారు. ఇలా వదిలి పెట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ వదలరు.. ఆ పాము తీసుకునే ఆహారం ఆ అడవిలో దొరుకుతుందా, అక్కడి వాతావరణం ఆ పాముకు అనుకూలమైనదేనా అని గమనించి అప్పుడు వదులుతారు. పాములను వేటాడే వారిపై కూడా నిఘా పెట్టి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి చెప్పడం, పాముల మీద పరిశోధనలు చెయ్యడం.. ఇలా అన్ని రకాలుగా పూర్తిగా పాములను కాపాడడం కోసమే ఈ సంస్థ పనిచేస్తుంది.
సమాజంలో అవగాహన పెంచడం: కేవలం పాములను పట్టుకోవడం అడవిలో వదిలేయడం మాత్రమే కాదు.. కాలేజీలు, స్కూల్స్, కాలనీలలో సమావేశాలను ఏర్పాటుచేసి పాముల వల్ల ప్రకృతికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, పాము కరిస్తే ఎలాంటి ఫస్ట్ ఏయిడ్ చేయాలి లాంటి వన్నీ వివరించి అవగాహన కల్పిస్తారు. ఇలా సంవత్సరానికి 250 సమావేశాలు నిర్వహిస్తారు. ఒక్కనెహ్రూ జూలాజికల్ పార్క్ లోనే ప్రతి ఆదివారం మూడు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తారు.
వాలంటీర్ గా చేరాలనుకుంటే: ఈ సొసైటీ లో చేరాలనుకుని వచ్చే ప్రతి ఒక్కరిని కూడా వాలంటీర్లుగా వీళ్ళు తీసుకోరు. కొత్తగా వచ్చేవారికి పాములపై నిజంగా ప్రేమ ఉందా లేదంటే స్టైల్ గా ఫోజులు ఇవ్వడానికి వస్తున్నారా, లేదంటే ఇందులో చేరి పాములను రహస్యంగా అమ్మడం కోసం వస్తున్నారా అని ముందుగానే ఆ వచ్చేవారిని రెండు వారాలు పరిశీలిస్తారు.. అన్ని విధాలా నచ్చినప్పుడు మాత్రమే కొత్త సభ్యులగా తీసుకుంటారు, ఆ తర్వాత 7నెలలు శిక్షణ ఇస్తారు. ఇప్పటికి రెండు దశాబ్ధాలుగా నడిపిస్తున్న ఈ సంస్థలో ఎన్నో పాములను కాపాడారు కాని ఒక్క వాలంటీర్ కూడా పాముకాటు గురి అయ్యి చనిపోలేదు.. వారి శిక్షణ ఆ స్థాయిది.