"ఈ జన్మమే రుచి చూడడానికి వేదిక" అని ఓ రచయిత ఓ సినిమా పాటలో చెబుతారు. నిజమే ఎంత కష్టపడ్డా గాని చివరికి రుచికరమైన భోజనం కోసమే కదా.. బతకడం కోసం తినాలి అని కొంతమంది అంటే తిండి కోసమే బ్రతుకు అని భోజన ప్రియులు సరదాగా చెబుతుంటారు. మిగిలిన వంటల కన్నా స్వీట్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత ఉన్న స్వీట్స్ లో మరింత ప్రత్యేకమైనది గంగరాజు గారి పాలకోవ. ఇది మన రాజమండ్రి లోనే ఉండి ప్రపంచమంతటికి తన రుచులను పంచుతున్నది.
ఓ పూల తోట దగ్గరికి వెళ్తే వాటి పరిమళాలు ఎలా ఐతే చుట్టూ వ్యాప్తిస్తాయో రాజమండ్రి టి.నగర్ లో ఉన్న "గంగరాజు డైయిరి" ప్రాంతానికి చేరుకోగానే అక్కడి కమ్మని పాలకోవ పరిమళం మనల్ని అంతే తాకుతుంది. గంగరాజు గారి డైయిరి ఈనాటిది కాదు 60 సంవత్సరాల క్రితం గంగరాజు గారు స్థాపించారు(ప్రస్తుతం వారి కుమారుడు గోవింద్ గారు దీనిని నడిపిస్తున్నారు). ఈ మధ్యనే ఇక్కడ చేసే స్వచ్చమైన పాలకోవకు పేరు వచ్చింది కాని మొదట గంగరాజ గారు పాల వ్యాపారం చేసేవారు. రాజమండ్రి పరిసర గ్రామాలలో రైతుల నుండి పాలను సేకరించి వాటిని రాజమండ్రి లోని హోటళ్ళకు అమ్మేవారు.
నిజాయితీగా చేయడంతో ఈ వ్యాపారం మంచి సక్సెస్ అయ్యింది. ఐతే ప్రతిరోజు హోటళ్ళకు అమ్మగా కొన్ని పాలు మిగిలిపోతూ ఉండేవి. ఆ పాలతో గంగరాజు గారి భార్య సత్యవతి గారు పాలకోవాలు చేయడం మొదలుపెట్టారు. ఏదో మిగిలిపోయిన పాలు వృధా కాకుండా చేద్దామని ప్రయత్నిస్తే ఆ పాలకోవాలకు మంచి డిమాండ్ పెరిగిపోయింది.
కేవలం పాలకోవ మాత్రమే కాదు నెయ్యి, వెన్న, పన్నీర్ ఇలా మొదలైనవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. స్వచ్చమైన నిజమైన పాలకోవ రుచి చూడాలంటే ఇక్కడికే రావాలని చెప్పి కొంతమంది ప్రత్యేకంగా పాలకోవాల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చే వారుంటారు. రాజమండ్రి ఇంకా దాని పరిసర ప్రాంతాల నుండే కాకుండా లండన్, అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు కూడా గంగరాజు గారి పాలకోవ చేరుకుంటున్నది.