గౌతమ్ కొన్ని సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. చాలామంది లాగే తనకి కూడా అమెరికా ప్రయాణం, సాఫ్ట్ వేర్ జాబ్స్ చేయడం అంతగా నచ్చలేదు, అంతేకాక చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ తర్వాత మంచి Job Opportunities వచ్చినా కాని సున్నితంగా తిరస్కరించారు. ఇంజనీరింగ్ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. ముందుగా అగ్రికల్చర్ కి సంబంధించిన లేటెస్ట్ మిషనరీ, విడిభాగాలు తయారుచేసే కంపెనీ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఆ ఆలోచనలోనే గౌతమ్ కి డైరీ ఫామ్ మీద ఆసక్తి పెరిగింది.
రీసెర్చ్: డైరీ ఫామ్ అనగానే ఓ నాలుగు గేదెలు కొనేసి షెల్టర్ కడితే ఐపోతుంది కదా అని అంతవరకే ఆలోచించలేదు. పాల ఉత్పత్తిలో ఏ రకమైన ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయి.? ఏ ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది.? ఏ రకమైన ఆవులు వివిధ రకాల వ్యాధులను, వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి అని 6 నెలల పాటు చాలా రీసెర్చ్ చేశారు.
దేశీయ ఆవులు: మిగిలిన అన్ని రకాలైన ఆవుల కంటే మన దేశీయ ఆవుల పాలే ఆరోగ్యానికి చాలా మంచిదని (ముఖ్యంగా షుగర్, క్యాన్సర్ బాధితులకు) వారి పరిశోధనలో తేలింది.. దేశీయ ఆవుల పాలనే ఏ2 రకం పాలుగా పరిగనిస్తారు. (ఏ1 పాలు ఆరోగ్యానికి ప్రమాదకరం) అలా ముందు గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి 30 "స్వదేశి గిరి" ఆవులను కొన్నారు. నిశితమైన పరిశోధన, ఇంకా పటిష్టమైన ప్రణాళికల వల్ల ఊహించినట్టుగానే మంచి సక్సెస్ సాధించారు. ఆ వెంటనే మరో 20 ఆవులను కొనుగోలు చేశారు.
ఆవుల కోసం ఆహారం: మన తెలంగాణాలోనే అత్యధికంగా వెనుకబడిన జిల్లాలలో మహబూబ్ నగర్ ఒకటి, ఇక్కడ వర్షాలు కూడా అతి తక్కువ శాతంలో కురుస్తాయి. నీటి సమస్య చాలా ఎక్కవ. ఇదే జిల్లాలో డైరీ ఫామ్ నడిపిస్తున్న గౌతమ్ మాత్రం ఈ సమస్యను టెక్నాలజీతో అదిగమించారు. ఇందు కోసం ఫామ్ పక్కనే హైడ్రో ఫోనిక్స్ విధానంతో పశుగ్రాసం పండించడం మొదలుపెట్టారు. మిగిలిన విధానం కన్నా ఇందులో 50% తక్కువ పెట్టుబడితో పంటను పండించవచ్చు. ఇందులో 35 ఎకరాలలో పండించే పంటను కేవలం ఒక 120 గజాలలో రోజుకు 2 టన్నుల పంటను పండిస్తున్నారు. ప్రతిరోజు ఆవులకు మంచి ప్రొటీన్స్ ఉన్న బార్లీ, వరి గడ్డి, మొక్క జొన్న, గోధుమ పొట్టు ఇలా మొదలైన ఆహారాన్ని అందిస్తారు. ఇదంతా కూడా ఏ పెస్టిసైడ్స్ ఉపయోగించకుండా పూర్తిగా సాంప్రదాయ ఎరువులతో పండిస్తున్నారు.
ప్రతి ఇంటికి హోమ్ డెలవరి: గౌతమ్ ఫామ్ లో ప్రస్తుతానికి 170(మిగిలినవి మరో 50) వరకు పాలు ఇచ్చే ఆవులున్నాయి. వీటి నుండి వచ్చే పాలను సాధారణ కంపెనీలకు కాకుండా నేరుగా(మహబూబ్ నగర్ నుండి) హైదరాబాద్ కు వచ్చి ప్రతి ఇంటికి వచ్చి హోమ్ డెలవరీ చేస్తారు. ఇందుకోసం ఆరుగురు ఉద్యోగులు పనిచేస్తారు, ఫామ్ లో మరో ఆరుగురు పనిచేస్తారు. పాలు మంచి నాణ్యతగా ఉండడం, సర్వీస్ కూడా ఉన్నతంగా ఉండడంతో డైరీ ఫామ్ గౌతమ్ ఊహించిన దానికన్నా ఎక్కువ సక్సెస్ అవుతుంది.