నేను మొదటిసారి గౌతమ్ గురించి, అతను తోటి మనుషులకు చేసే సేవ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. అసలు ఈ ఆర్టికల్ ఎలా ప్రారంభించాలి, ఎలా కొనసాగించాలి, ఎలా పూర్తిచేయాలో నాకు ఆ ఆనందంలో తెలియలేదు.. ఆ ఆనందం నుండి బయటపడడం నా వల్ల కాలేదు, అందుకే అదే ఆనందంలో ఈ ఆర్టికల్ కొనసాగిస్తున్నాను..
కొన్ని సంవత్సరాల క్రితం గౌతమ్ ఇంకా అతని టీం సభ్యులు ఒక కాలనీకి వెళుతుండగా ఒక చెత్తకుండి పక్కన ఒక వ్యక్తి పడుకుని ఉండడం గమనించారు. అతని దగ్గరికి వెళ్తుంటే 50ఫీట్ల దూరం నుండే విపరీతమైన వాసన వస్తుంది. బహుశా టాయిలెట్ చేసుకున్నాడేమో అని అతని దగ్గరికి అతికష్టం మీద వెళ్ళారు. నిండా దుప్పటి కప్పుకుని ఎముకలు స్పష్టంగా కనిపించే అతని శరీరాన్ని పరీశీలిస్తే అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. చనిపోయిన తర్వాత శరీరాన్ని తినే పురుగులు బ్రతికుండగానే అతనిని తింటున్నాయి. గౌతమ్ కి ఏడుపు కూడా రాలేదు.. ఈ ప్రపంచంలో ఉన్న జాలి, బాధ, వాత్సల్యం, ప్రేమ ఒక్కసారిగా అతని హృదయంలో నిండిపోయింది. దగ్గరికి రావడానికే భయపడే సంధర్భంలో ఉన్న ఆ ముసలి వ్యక్తిని గర్భగుడిలో ఉన్న దైవాన్ని శుభ్రపరిచినట్లు అతని శరీరాన్ని కడిగాడు. 5రోజులు కష్టపడి డాక్టర్ సహాయంతో ఆ పురుగులను తీసివేశాడు.. ఇంకో వారంలో చనిపోయే వ్యక్తిని లక్షా యాబైవేల రూపాయల(దాతల సాయం) తో ట్రీట్మెంట్ అందించి బ్రతికించాడు. అలా ఒక్కరిని కాదు దిక్కుమొక్కులేని 90ప్రాణాలను కాపాడిన మనిషి దేవుడు గౌతమ్(9550335994).
ఎవరు ఈ గౌతమ్ ?: గౌతమ్ తండ్రి దేశ సరిహద్దులో ఉంటు దేశ ప్రజలకు రక్షణ ఇచ్చే సైనికుడు. ఆర్ధిక పరిస్థితుల మూలంగా గౌతమ్ 10వ తరగతి వరకే చదువుకున్నాడు. ఇక అప్పటినుండి కుటుంబం కోసం ఉద్యోగం చేస్తూ ఓపెన్ యూనివర్సిటీలో ఎం.సి.ఏ వరకు చదివాడు. మాటలతో వర్ణించలేని అత్యంత బాధాకర సంఘటనలను చూసి చలించిపోయి ఒక సంస్థను ప్రారంభించాలనుకున్నాడు.. మనం మారితే ప్రపంచమే మారుతుంది, ఐతే మనం మారడంతో పాటు మనుషులను కూడా మనలాగే మార్చితే ఈ ప్రపంచం వేగంగా మారుతుంది అని గౌతమ్ బలంగా నమ్ముతాడు. గౌతమ్ మొదట Serve Needy(NGO) సంస్థను ప్రారంభించినప్పుడు అందరూ ఎగతాళి చేశారు.. ఫొటోలకు ఫోజులివ్వడానికే ఈ నటనంతా అని గేలి చేశారు, అది విని గౌతమ్ మనసు చాలా బాధపడింది. కాని ఎన్నిరకాల విమర్శలు రానీ.. మనం చేసే సేవలో ప్రేమ, నిజాయితీ ఉంటే ఎక్కడైన, ఏ రకంగానైన మనల్ని ఎవ్వరూ ఆపలేరు అని గౌతమ్ తన సేవలను కొనసాగించాడు. విమర్శించిన వారే ఇప్పుడు ఆత్మీయంగా ఈ సంస్థకు విరాళాలు అందిస్తున్నారు ఇంతకంటే వారిపైన నిజమైన గెలుపు ఉంటుందా..
అన్నదాత: మనలో చాలామందికి పేదవారికి సహాయం చేయాలని ఉంటుంది కాని టైం లేకపోవడం వల్లనో, లేదంటే మరే ఇతర కారణం వల్లనో చేయలేకపోతుంటాం.. ఇలాంటి వారికి Serve Needy ఒక వారధిగా పనిచేస్తుంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, రెస్టారెంట్లు మొదలైన అన్ని ప్రదేశాలలో కలిపి మన హైదరాబాద్ లో రోజుకు 2టన్నుల ఆహారం వృధా అవుతుంది, 2 టన్నులు అంటే 5లక్షలమంది ఆకలి తీర్చవచ్చు. ఆహారం ఇంకొకరిని కాపాడడానికి ఉపయోగించాలి ఇలా వృధా కాకూడదని ఫంక్షన్ హాల్, రెస్టారెంట్లను ప్రత్యేకంగా కలిసి "మిగిలిపోయిన ఆహారాన్ని మేము పేదలకు అందజేస్తాం, రోజుకు ఎంతోమంది పేదలు ఆకలితో పస్తులుంటున్నారని" వివరించి ఆహార భద్రత ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా ప్రతిరోజు హైదరాబాద్ లో 200 నుండి 500మంది వరకు ఆకలి తీరుస్తున్నారు, ఒక్కోసారి 5,000మంది ఆకలి తీర్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సిటీలో ఎక్కడా ఆహారం మిగిలిపోయినా ముందు Serve Needyకే ఫోన్ కాల్(9550335994) వస్తుంది, అది వారిపై ఉన్న నమ్మకం.
పిల్లల చదువులు, లక్ష్యం: 25మంది పిల్లలను Serve Needy పోషిస్తుంది. వీరి చదువులు, ఆరోగ్యం మిగిలిన బాధ్యతలన్ని Serve Needy చూసుకుంటుంది. హైదరాబాద్ ఖార్కానాలో ఉంటున్న వీరిని కలవడానికి వెళ్ళి "పెద్దయ్యాక మీరు ఏం అవుతారంటే ఏ ఇంజనీర్ అనో, డాక్టర్, పోలీస్ అని కాదు గౌతమ్ అన్నలా ఈ సమాజానికి సేవ చేస్తా అంటారు". అవును.. ఇదే వారి జీవిత లక్ష్యం, నేను మాత్రమే కాదు నాలాంటి వారు మరింతమంది ఈ దేశానికి అవసరం అంటూ మరో 25మంది పిల్లలను చిన్నతనం నుండే సేవాభావాలతో పోషిస్తున్నాడు. ఈ పిల్లలు ఇప్పటినుండే సేవ చేయడం మొదలు పెట్టారు. వారు ఎంతబాగా చదువుతారో అంతే బాగా వంట చేస్తారు.. వారు ఎంత క్రమశిక్షణతో ఉంటారే అంతే ప్రేమ సమాజం పట్ల ఉంటారు. ఏదైనా ఒకరోజు స్కూల్ కి సెలవు వస్తే ఏ సినిమాకో, ఏ టూరిస్ట్ ప్లేస్ కో కాదు "అన్నా.. సెలవు దొరికింది పేదవారికి అన్నం పెడదాం పదా అన్నా" అంటారు వాళ్ళు. ఇంత చిన్న వయసులో ఆ పిల్లలు చేసే సేవకు తోటి పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా స్పూర్తి పొందుతున్నారు.
వృద్ధాశ్రమం, అంత్యక్రియలు: Serve Needy ఒడిలో 25మంది వృద్ధులు ఉన్నారు, వీరి అన్ని రకాల భాద్యతలను ఒక కన్న కొడుకులా గౌతమ్ చూసుకుంటాడు.. అది కాక ఇప్పటికి 100కి పైగా అనాధల అంత్యక్రియలను ఈ Serve Needy జరిపించింది. అంత్యక్రియలు అంటే కేవలం ఏదోరకంగా ఆ ఒక్కరోజు వరకు మాత్రమే అని కాకుండా వారి మత సాంప్రదాయాలకు అనుగూనంగా దహనసంస్కారాలు చేయిస్తారు. వారి బుడిదను పవిత్రమైన నదిలో కలిపి వారి ఆత్మకు శాంతి కలిగేలా పూజలు నిర్వహిస్తారు. బ్రతికున్నంత వరకు మాత్రమే కాదు చనిపోయాక ఆత్మగా కూడా ఆ వ్యకి అనాధ కాదు, ఈ భూమి మీద వారి కోసం మేము ఉన్నాము అని తెలియజేయడమే ఇక్కడ వారి ఉద్దేశం, ఇది మానవత్వానికి మించిన స్థాయి.
ప్రస్తుతం Serve Needy 14రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది. వాడని టాబ్లెట్స్ ను ఉపయోగించుకోవడానికి మెడికల్ బ్యాంక్, పేదలకు బట్టల బ్యాంక్, పిల్లలకు టాయ్స్ బ్యాంక్, క్యాన్సర్, ఏయిడ్స్ లాంటి ప్రాణాంతకమైన పేషెంట్స్ కోసం షెల్టర్, ఆహారం, వైద్యం, వారి తీరని కోరికలను నెరవేర్చడం మొదలైనవి చేస్తుంటారు. ఇలాంటి గొప్ప పనులు చేయడానికి దాతల సహాయం చాలా అవసరం Serve Needy ద్వారా సహాయం చేసే ప్రతిఒక్కరికి వారి డబ్బు, వస్తువులను ఎలా పేదలకు అందజేశారో ఫొటో, వీడియోల ద్వారా చూపిస్తారు. దాతల సహాయం ద్వారా పేదలు ఎలా ఆనందం పొందుతున్నారో అని చూస్తూ దాతలు ఎంతో ఆనందం పొంది, సేవలో ఇంత ఆనందం ఉంటుందా అని మరింత సేవచేయడానికి ముందుకొస్తుంటారు.
గౌతమ్ లక్ష్యం ఏంటి అంటే ఒక్కటే.. ఈ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఏ ప్రాణి ఆకలితో చనిపోకూడదు, ఏ ఒక్కరూ అనాధగా బ్రతకకూడదు, చావకూడదు అంతవరకు తన ప్రయాణం కొనసాగుతుంది.. అప్పటి వరకు దాతల ప్రేమను పేదలకు అందించడానికి అతని చేయి ఎప్పుడు నిజాయితీతో సిద్ధంగా ఉంటుంది.