Contributed By: సౌమ్య ఉరిటి
మార్చ్ 2059 అలారం మోగుతుంది. ప్రకాష్ నిద్ర లేచి అలారం ఆఫ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న జిం ఏరియాకి వెళ్ళి కాస్త వర్కవుట్ చేశాక ఓ రెండు చుక్కల నీరు తాగి ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ప్రవళ్ళిక (ప్రకాష్ భార్య): టిఫిన్ రెడీ చేశాను తినేసి వెళ్ళండి. ప్రకాష్ ఓ రెండు తోస్టులు తిని ఓ రెండు చుక్కల నీటిని నోట్లో వేసుకున్నాడు. ప్రకాష్: ఆఫీస్ కి లేట్ అవుతుంది నేనింక స్టార్ట్ అవుతా. నా ఆక్సీజన్ బ్యాక్ ప్యాక్ తెచ్చివ్వవూ.
ప్రవళ్ళిక(ఆకీజన్ బ్యాక్ ప్యాక్ ని అందిస్తూ):ప్రకాష్! మార్కెట్ లోకి కత్తగా ఆక్సీజన్ మాస్క్స్ వచ్చాయట. 24 అవర్స్ డ్యూరబిలిటి ఉందంట. సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురండి. ఈ బ్యాక్ ప్యాక్స్ కి బదులు వాడి చూద్దాం. ప్రకష్: సరే ఈవినింగ్ ఓసారి నాకు కాల్ చేసి గుర్తు చేయు. సరేనా బై. కార్ బయటకు తీసి రోడ్ మీదకి పోనిచ్చాడు ప్రకాష్. దారి పొడవునా దట్టమైన పొగ. అది చలి కాలం కాదు. వేకువ ఝాము పొగ మంచు కాదు. సిటీ రోడ్ అంతా ఇసుమంత ఖాళీ కూడా లేకుండా నిండి ఉన్న వాహనాల నుండి వస్తున్న పొగ...కాలుష్యపు పొగ. ప్రకాష్ తన ఆక్సీజన్ బ్యాక్ ప్యాక్ లో ఆక్సీజన్ కాన్సట్రేషన్ కొంచెం పెంచి ఆ ట్రాఫిక్ లో ముందుకి కదిలాడు. ఓ గంటలో ఆఫీస్ కి చేరుకున్నాడు.
సమయం మధ్యాహ్నం 1:30 ప్రకాష్ ఫోన్ పదే పదే మోగుతుంది. ప్రవళ్ళిక నుండి ఆ ఫోన్ కాల్. వర్క్ టెన్షన్ లో ఉన్న ప్రకాష్ విసుగుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ప్రకాష్: ఆ ప్రవళ్లికా! నాకు గుర్తుంది. ఈవినింగ్ వచ్చేటప్పుడు తెస్తానని చెప్పా కదా. నేను బిజీగా ఉన్నాను. ప్రవళ్ళిక: అది కాదు ప్రకాష్...మీరు త్వరగా ఇంటికి రండి వెంటనే. ప్రకాష్: ఏమైంది ప్రవళ్ళిక? హలో హలో...
ఫోన్ పెట్టేసింది ప్రవళ్లిక. ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఏమైందో అని టెన్షన్ పడుతూ ఆఫీస్ లో పర్మీషన్ తీసుకొని ఇంటికి బయల్దేరాడు. ఇంటి దగ్గర నాలుగు మీడియా వెహికల్స్ ను చూసి ప్రకాష్ హార్ట్ బీట్ పెరిగింది. కంగారుగా మెట్లెక్కి పైకి వెళ్తున్నాడు. మధ్యలోనే ఓ నలుగురు మైకులు మరో నలుగురు కేమెరాలు పట్టుకొని వచ్చి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.
రిపోర్టర్: సార్! దీనిపై మీరెలా స్పందిస్తున్నారు? ఎప్పుడో ఓ నాలుగు దశాబ్ధాల క్రితం ఇలాంటివి జరిగుంటాయి. ఇప్పుడు మీకు మీ ఇంట్లో జరగడం ఎలా అనిపిస్తుంది? ప్రకాష్: వన్ సెకెండ్ ప్లీజ్. ప్రవళ్ళిక కోసం వెతుకుతున్నాడు ప్రకాష్.
రిపోర్టర్: ఎవరూ ఊహించని వింత జరిగింది మీ ఇంట్లో. ఇప్పటి తరం ఆ పేరు వినడం తప్ప చూసుండరు. మీరు ఈ పరిణామాన్ని ప్రోత్సహించబోతున్నారా? జరిగిన దాని గురించి మాకు కొంచెం వివరణ ఇవ్వగలరా? ప్రకాష్: ప్లీజ్...అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?
వాళ్లను దాటి ఇంట్లోకి వెళ్తున్న ప్రకాష్ కి టెర్రస్ మెట్ల వైపుగా మరో రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తూ కనపడింది. "ఓ ముప్పై నలభై సంవత్సరాలకు ముందు ఇలా జరిగేవట. కాల క్రమేణా పర్యావరణ మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు జరగడం ఆగిపోయిందనీ చుట్టుపక్కల ఉన్న అనుభవం గల పెద్దవారు చెబుతున్నారు."అంటూ రిపోర్ట్ చేస్తుంది.
ప్రకాష్ కి ఏమి అర్ధం కావట్లేదు.పిల్లలూ పెద్దలూ ముసలివాళ్లూ అందరూ ప్రకాష్ ఇంటి టెర్రస్ పైకి పోటీ పడుతూ వెళ్తున్నారు. “పైన ఏం జరిగుంటుంది?అసలు ఈ ప్రవళ్లిక ఏది? “ పజ్జల్డ్ మైండ్ తో టెర్రస్ మీదకి వెళ్ళాడు ప్రకాష్.
జనమంతా ఓ మూల గుమిగూడి ఉన్నారు. క్షణ క్షణం కంగారు పెరుగుతుంది ప్రకాష్ కి. అందరినీ తోసుకుంటూ ముందుకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అప్పుడు కనిపించింది ప్రవళ్లిక. కొంచెం కుదుట పడ్డాడు ప్రకాష్. కానీ ఏం చేస్తుంది అక్కడ. ఆ గందరగోలం లో అక్కడ ఏం జరిగిందో తెలియడం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్లి ప్రవళ్లిక ని పిలిచాడు. ప్రకాష్ ని చూసి ప్రవళ్ళిక ఏదో చెప్పబోతున్నట్టు ఆత్రుతగా వచ్చింది.
ప్రవళ్ళిక: మీరు వచ్చేసారా? ప్రకాష్: ఏంటిదంతా? అసలేం జరిగింది? ఈ జనమంతా ఏంటి? నన్నెందుకు వెంటనే రమ్మన్నావ్? త్వరగ చెప్పు ప్రవళ్ళిక: మీరు నాతో రండి. మీకే తెలుస్తుంది.
ప్రకాష్ చేతులు పట్టుకొని జన్నాన్ని దాటి గోడ ముందుకి తీసుకెళ్ళింది ప్రవళ్ళిక. మీడియా వాళ్లతో పాటు అందరూ తమ కేమెరాలను జూం చేసి మరీ ఫోటోలు తీస్తున్నారు ఆ గోడ దగ్గర. అసలా గోడ దగ్గర ఏంజరిగుంటుందని గోడంతా పరికించి చూశాడు ప్రకాష్.
ప్రవళ్లిక: (గోడ మూలకు తన చూపుడు వేలిని చూపిస్తూ) దీనిని నా చిన్నప్పుడు మా తాతయ్య ఫోటోలో చూపించాడండి. పక్కింటి బామ్మగారు చెప్పారూ మనం పుస్తకాలలో చదివామే ఒకప్పుడు మొక్కలూ చెట్లూ ఉండేవని వాటిలో ఒక రకమైన, చిన్నగా మొలిచిన రావి చెట్టట ఇది. తరువాత రోజు ఆ చిన్న మొక్క ఫోటో పేపర్ లో, సోషల్ మీడియా సైట్స్ లో పడింది. రెండవ రోజు వాటికి మంచి లైక్స్, కామెంట్స్, షేర్స్ పడ్డాయి. మూడవ రోజు ఆ మొక్క పెకిలించబడి గార్బేజ్ లో పడింది.