బ్రతకడానికి తింటారు కొంతమంది, తినటానికే బ్రతుకుతారు మరికొంతమంది. తినటానికే బ్రతికేవారికి కొత్తగా రుచి చూపించాల్సిన పని లేదు గాని బ్రతకడానికి తినేవారిని ఈ గోవింద్ దోసలోని దోసాని ఒక్కసారి రుచి చూపిస్తే ఇక అంతే.. ఎప్పుడు దోశ తినాలనిపించిన గోవింద్ దోశ సెంటర్ లోనే తినాలని ఉవ్విల్లూరుతారు. చార్మినార్ లోని గోవింద్ కి బండి దోశ బెస్ట్ Ingredients వాడితే ఆ ఫుడ్ లోని పరిమళం మనల్ని రారా అని పిలుస్తుంటుంది.
ఒక్కసారి చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నామంటే అడ్రెస్ ఎక్కడో తెలుసుకోవడానికి ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు ఆ టిఫిన్స్ పరిమళం చాలు దానిని అనుసరిస్తూ అలా చేరుకోవచ్చు. చార్మినార్ లో ఉండే ఈ ఫుడ్ ప్లేస్ కోసం ఉప్పల్, మియాపూర్ లాంటి దూరప్రాంతాల నుండి ట్రాఫిక్ దాటుకుని మరి వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కారం పొడి గురించి. కొన్ని ప్రత్యేకమైన వాటితో దీనిని రంగరిస్తారు ఆ ఫార్ములా చాలా సీక్రెట్, ఎందుకంటే అదేకదా సక్సెస్ సీక్రెట్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ ఐన బటర్ దోశ కూడా గోవింద్ గారు సృష్టించిందే.
గోవింద్ దోశ అంటే దోశలకు మాత్రమే ఫేమస్ కాదు. ఇడ్లీలో పది వెరైటీలు, దోశలో 16 వెరైటీలు, మైసూర్ బజ్జిలో 6 వెరైటీలు, ఉప్మాలో పది వెరైటీలు, వడలో ఎనిమిది వెరైటీలు.. అందుకే ఎప్పుడూ ఒకేరకమైన తినేవారికి ఇక్కడి మెన్యూ మరింత పసందుగా కనిపిస్తుంటుంది. హైదరాబాద్ అన్నీటికి ఫేమస్.. చారిత్రకంగా టూరిస్ట్ ప్లేసెస్ లో, ఐటి కంపెనీలకు, సినిమాల పరంగా అలాగే ఫుడ్ పరంగా కూడా అందుకే ఇక్కడ స్టార్ హోటెల్స్ ఎంత ఫేమస్సో రోడ్డు పక్కన బండ్లు కూడా అంతే ఫేమస్. ఆ రుచిని అందుకోవడం కోసం ఫైవ్ స్టార్ హోటెల్ లో తినేవారు సైతం బెంజ్ కార్ లో ఛార్మినర్ ప్రాంతంలోని గోవింద్ కి బండి దగ్గరికి వస్తుంటారు.
ఉదయం సూర్యుడు ఉదయించక ముందు నుండే ఇక్కడ ఫుడ్ లవర్స్ తో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం హిమాయత్ నగర్ లో గోవింద్ దోశ ఓ బిల్డింగ్ లో స్టార్ట్ చేశారు కాని దాదాపు 33 సంవత్సరాల నుండి కూడా చార్మినర్ ప్రాంతంలో ఓ బండి మీద టిఫిన్స్ అమ్ముతున్నారు. 33 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులను బట్టి సాధారణ టిఫిన్స్ తయారుచేస్తున్నా గాని కొత్త రుచులను కోరుకునే భోజనప్రియుల కోసం బటర్ దోశ, చీజ్ దోశ, స్పాట్ ఉప్మా, ఇడ్లీ ఫ్రై, పిజ్జా దోశ లాంటి రకరకాల కొత్తరకమైన రుచులను పరిచయం చేస్తూ హైదరాబాద్ చుట్టు ప్రక్కల బాగా ఫేమస్ అయ్యారు. హైదరాబాద్ లో ఉంటూ గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం లాంటి వాటిని చూడకపోతే ఎంత మిస్ అవుతామో ఫుడ్ విషయంలో గోవింద్ కి బండి లోని టిఫిన్స్ టేస్ట్ చేయకపోవడం కూడా అంతే అని ఫుడ్ లవర్స్ చెప్పుకుంటుంటారు, వాళ్ళకెందుకండి ఆ అవకాశం ఇవ్వడం.. ఒక్కసారి చూసేద్దాం పదండి.