జరిగిన కథ – రాధే గోవింద, GREP01, GREP02, GREP03, GREP04, GREP05
రాధమ్మకు వయసు పెరుగుతుంది. ఓ రెండు నెలలు గడిస్తే పద్దెనిమిది నిండుతాయి. తాతగారు, ఎందుకో నాతో మాట్లాడాలి అని పిలిచారు. మా మామిడి తోట చివర ఉన్న స్థలం వరకు నడుచుకుంటు వెళ్లాం. అక్కడ ఓ గట్టు మీద కూర్చొని, నా వైపు తీక్షణంగా చూస్తున్నారు తాతగారు. ఏమైందండీ ? అని అడిగాను నేను. "గోవిందా... రాధమ్మకు పద్దెనిమిది నిండబోతున్నాయి, ఒకవేళ తను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెపితే ఏం చేస్తావ్ రా ?". ఏ మాత్రం ఆలోచించకుండా, ఏముందండి రాధమ్మను ప్రాణంగా చూసుకునే వాడ్ని వెతికి దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తాను. "అదేంట్రా, అంత సులువుగా చెప్పేసావ్." అమ్మకు భద్రంగా చూసుకుంటాను అని మాటిచ్చాను కాని, భార్యగా చేసుకుంటాను అని కాదు కదండీ. రాధమ్మ ఎవరిని కోరితే వాళ్లతో పెళ్లి జరిపిస్తాను, అది నేనైనా కావచ్చు కాని, నేనే అని కాదుగా. దీనికోసమా ఇంత దూరం తీసుకొచ్చారు. "కాదు రా, ఊరిలో ఈ మధ్య వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఊరి మొదట్లో ఉన్న చిన్న స్మశానం సరిపోయేలా లేదు. శవాలను సరిగ్గా దహనం చేయకుంటే, ఊహించని రోగాలు వచ్చే ప్రమాదం ఉందని మొన్నెప్పుడో వైద్యుడు చెప్తున్నాడు." ఔనండి! నాకు అదే ఆందోళనగా ఉంది. వైద్యుడు వచ్చిన కొత్తలో వైద్య సమస్యలు తగ్గినట్టు అనిపించినా, ప్రస్తుతం పాత స్థితికే వచ్చింది. "అందుకే, ఈ రెండు ఎకరాలు స్మశానంగా వాడుకోమని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావ్ ?". అయ్యో! మీ ఇష్టం తాతగారు. నన్ను అడుగుతారేంటండి వింతగా.
"దాని గురించి అందరికి చెప్పు మరి, నేను అలా వెంకయ్య పొలం వరకు వెళ్ళొస్తాను" అంటూ తాతగారు వెళ్లిపోయారు. నన్ను వెతుకుతూ రంగడు వచ్చాడు. వాడితో... తాతగారికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో కాని, చాల గొప్ప ఆలోచనరా రంగ. రెండెకరాలు స్మశానంగా మార్చడానికి మరో కారణం, ఆ భూమిలో పంటలు పండింది లేదు. ప్రతీ వర్షాకాలం నీటితో నిండిపోయి పెద్ద చెరువులా మారిపోయేది. మాకు ఎలానో ఉపయోగపడడం లేదు, కనీసం ప్రజల ఆరోగ్యానికైన ఉపయోగపడుతుందని, వర్షా కాలం అయిపోయిన తర్వాత నుండి స్మశానంలా వాడుకోమని చెప్పారు తాత గారు. ఊర్లో ఈ మధ్య జబ్బు వలన చనిపోయే వారి సంఖ్య పెరిగిపోయింది. పక్క ఊర్ల నుండి వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా చనిపోయినా, మా ఊర్లోనే దహనం చేస్తున్నారు. అలా కుదరదు, వెళ్లి మీ ఊర్లో దహనసంస్కారాలు జరిపించండని పుట్టెడు దుఖం లో ఉన్నవాళ్లకు చెప్పలేక మేము ఊరుకున్నం. నేనిలా రంగడితో మాట్లాడుతుంటే, మనసులో ఏవేవో ఆలోచనలు. స్మశానంగా మార్చబోతున్న ఆ రెండు ఎకరాలు చూస్తుంటే, ఏదో పెను ప్రమాదం జరగబోతున్న సంకేతాలు. ఆ ప్రదేశంలో ఎవరో ఉనట్టు, నాతో ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు, వేరే ప్రపంచం నుండి నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుండేది ఆ ప్రదేశానికి వెళ్ళిన ప్రతీసారి. అలా అనిపించిన ప్రతీసారి, విపరీతమైన తలనొప్పి రావడం మొదలైంది. ఆ తర్వాత ఏమి జరుగుతుందో అర్ధమయ్యేది కాదు, తిరిగి సోయలోకి వచ్చేప్పటికి తెల్లారిపోయేది. ఎందుకో, ఇదంతా ఎవరికీ చెప్పాలనిపించలేదు. ముఖ్యంగా రాధమ్మకు చెప్పి అనవసరపు ఆందోళన గురిచేయడం నాకు ఇష్టం లేదు. త్వరలోనే చనిపోతానేమో అని మట్టుకు గట్టిగా అనిపిస్తూ ఉండేది.
చావు గురించి ఆలోచన మొదలైన తర్వాత రాధమ్మతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని నిశ్చయించుకున్నాను. రేయ్! రంగడు, ఇక నుండి రాధమ్మకు ఏ కోరికున్నా తీర్చేయ్యాలి రా. కొన్ని భయాల వలన ఇప్పటివరకు వద్దన్న వాటిని, తనకు ఇక మీద రాబోయే ప్రతీ కోరిక తీర్చాలి రా రంగ. ఏంట్రా, అలా చూస్తున్నావ్ ? చిన్నప్పటి నుండి తనకు ఊరి దగ్గరలో ఉన్న జలపాతం కింద స్నానం చెయ్యాలని ఎంతో కోరిక, తనకేదైనా అవుతుందేమో అనే భయంతో ఎప్పుడూ వెళ్లనిచ్చే వాడిని కాదు. చదువన్నా, పుస్తకాలన్నా ఎంతో ఆసక్తి రాధమ్మకు. వేరు వేరు కారణాల వలన తాత గారు తనకి చదువు వద్దన్నారు. నాకు చదువంటే పెద్దగా ఆసక్తి లేదు, బహుశ నేను చదువుకోకుండా తను చదివితే ఏమైనా సమస్యలు ఎదురవుతాయేమోనని భయపడినట్టున్నారు. పుట్టినరోజు ఓ అద్భుతంలా జరుపుకోవాలని ఎంతో ఆశ, కానీ అమ్మ వాళ్ళు చనిపోయింది ఆ రోజేగా. ఇలా ఏదోక కారణంగా, తన కోరికలు తనలో ఉంచుకోవాల్సి వచ్చింది. ఇక తీర్చేయ్యాలి రా, సమయం లేదు. రేపటి నుండి మొదలు. ఇవన్నీ చేస్తున్నాం అని రాధమ్మకు చెప్పకురోయ్. రంగడు అలానే అనట్టు తల, తోక ఊపాడు. ఆ తర్వాతి రోజు, సూర్యోదయం కంటే ముందే రాధమ్మ గది వద్దకు వెళ్లి, తనని లేపాను. "ఏంటి బావా, కోడి కూతకు ముందే లేపావ్?". మాట్లాడకు అనట్టు సైగ చేసి, ఓ జత బట్టలు తీసుకొమ్మని చెప్పి, సైకిల్ పైన జలపాతం దగ్గరికి తీసుకొచ్చాను. ఎందుకు, ఏమిటి అనేం అడగకుండా... సరాసరి నీళ్ళలో దిగి ఈతకొట్టడం మొదలెట్టింది. తన ముఖంలో ఆనందం చూస్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. నన్ను కూడా రమ్మంది, తను ఈత కొడుతునప్పుడు చూడడమే తప్పు, అలాంటిది తనతో కలిసి ఈత కొట్టడమా ?! తనని కానివ్వమని సైగ చేసాను. ఇలా దాదాపు ప్రతీ రోజు తనని జలపాతం దగ్గరికి తీసుకెళ్ళే వాడిని. రోజులానే, ఈత కొట్టి, బట్టలు మార్చుకుంటున్న రాధమ్మకు వ్యతిరేక దిశలో నిల్చొని చూస్తున్నాను నేను. అప్పుడు అక్కడికి ఎవరో వచ్చినట్టుగా శబ్దం వినిపించింది. చుట్టూ చూసాను ఎవరు లేరనుకొని వెళ్ళేప్పుడు ఓ చెట్టు వెనుక నక్కి నక్కి చూస్తున్నాడు ఒక వ్యక్తి. ఎవరది అని అరవబోయాను కాని, రాధమ్మ కంగారు పడుతుందని ఆగిపోయాను. నేను చూస్తున్నది తెలీక అతను చిన్నగా ముందుకు కదిలాడు. అప్పుడు తెలిసింది, అతడు మరెవరో కాదు వైద్యుడని. అతను చూస్తున్నది మరెవరినో కాదు రాధమ్మను. నాకు విపరీతమైన కోపం వచ్చేసింది, తన్ని తరిమేయ్యలనిపించింది కానీ, ఊరిని బాగు చేస్తున్నాడనే ఒకే ఒక్క కారణంతో ఏమి అనకుండా తెలీనట్టుగా వెళ్ళిపోయాను.
ఇలా రోజులు గడిచిపోతుండగా, ఓ రోజు మా ఇంటికి ఎదురుగా సైకిల్ మీద నిల్చొని చూస్తున్నాడు వైద్యుడు. మన సహనాన్ని అసమర్ధత గా తీసుకునే అవకాశం ఇవ్వకూడదని, వైద్యుడికి చిన్న హెచ్చరిక ఇవ్వాలని వెళ్లాను. ఏంటండీ! ఇట్టా వచ్చారు ? "ఏం లేదు రాజు గారు. ఎవరికో ఆరోగ్యం బాలేదంటే చూద్దామని వచ్చాను." అలానా, ఎవరికి ? "అది... అది..." పేరు చెప్పండి, నేను దారి చూపిస్తాను. మీరు దారితప్పినట్టున్నారు కదా. "అది... పేరు మర్చిపోయాను రాజు గారు". మీరు మర్చిపోవాల్సింది పేరు కాదండీ, మీరు చేసే కొన్ని పనులు. అర్ధం అవ్వనట్టు విచిత్రంగా చూస్తున్నాడు వైద్యుడు. మీకో విషయం చెప్పాలండి... "చెప్పండి రాజు గారు". మనం ప్రాణంగా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోగలగటం విజయం, మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు మనని ప్రేమించటం అదృష్టం. విజయం గర్వాన్ని పుట్టిస్తే, అదృష్టం సంతోషాన్ని సృష్టిస్తుంది. గర్వం తెగింపుని పరిచయం చేస్తే, సంతోషం ధైర్యన్ని దగ్గర చేస్తుంది. నేను గర్వం ఇచ్చే తెగింపు కోసం ఎదురుచూస్తున్న వాడిని, మీకు ధైర్యం రావాలని కోరుకుంటున్నా. సూటిగా చెప్పాలంటే రాధ నాది, ఇకపై రాధకై మా వీధి వైపు రారని ఆశిస్తున్నా. అలా కాదు అంటే చెప్పండి, రాధ పేరు కలలో వినిపించినా భయపడేలా ఇప్పుడే ఓ పీడకల చూపించి వెళ్తాను మరి. మీకు తెలీదు కదా, నా పేరు రాజు కాదు, గోవిందరాజులు. వైద్యుడి కళ్ళలో చిన్న భయం, కాళ్లలో వణుకు కనిపించింది, ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
అలా వైద్యుడితో మాట్లాడడం చూసిన రాధమ్మ, గోవిందు ఇంట్లోకి రాగానే అడిగింది. "ఏమైంది బావా ? వైద్యుడికి ఏదో హిత భోధ చేసి వస్తున్నట్టున్నావు ? " ఏంలేదు రాధమ్మ. "నువ్వేం మాట్లాడావో నేను అర్ధం చేసుకోగలను బావా, లీలగా నాకు వినిపించింది. మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే కదా, మధ్యలో ఆ వైద్యుడి మనసులో ఏముందో తెలీకుండా భయపెట్టడం ఎందుకు బావా?". రాధమ్మా…కొన్ని విషయాలు నీకు అర్ధం అవ్వవు. వైద్యుడు ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. అతను నీ వైపు ఎలా చూస్తున్నాడో నీకు తెలీదు. నేను అతనికి సలహా మాత్రమే ఇచ్చాను భయపెట్టలేదు. సలహా ఇచ్చింది మన బంధం పై అనుమానంతో కాదు, అతని ప్రాణం పై గౌరవంతో. ఈ రోజు నేనలా చెప్పకపొతే…రేపు వాడు నిన్ను ఇబ్బందిపెట్టినట్టు తెలిసి అతని ప్రాణాలు ఎక్కడ తీస్తానో అన్న భయంతో. మన మనసులో కల్మషం లేనంత మాత్రాన ప్రపంచం అంతా అలానే ఉంటుంది అనుకోవటం అమాయకత్వం అవుతుంది. గుర్తుంచుకో…అమాయకత్వం అన్ని వేళలా మంచిది కాదు. అది విని, వైద్యుడి అంతరంగం తెలీని రాధమ్మ గోవిందు తప్పుగా ఆలోచిస్తున్నాడు అనుకోని కోపంగా వెళ్ళిపోయింది. రాధమ్మకు కోపం వచ్చినప్పుడల్లా, తనని శాంతపరచడం కోసం ఏదైనా కానుక ఇవ్వడం గోవిందుకు అలవాటు. ఈ సారి తనకు నచ్చిన గజ్జల పట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు. అవి చూసి రాధమ్మ మొదట బెట్టు చేసినా, తర్వత సంతోషంగా తీసుకుని, పెట్టుకొని, కొంచెం దూరం నడిచి "చాలా బరువున్నాయి బావా, కాని వినడానికి బావున్నాయి." నీకు ఇబ్బందనిపిస్తే తీసేయి రాధమ్మ, వేరేవి తెస్తానులే. "వద్దు బావా, నాకివి బాగా నచ్చాయి. ముఖ్యంగా వీటి శబ్దం బావుంది. పర్లేదు లే, నడిచిపోతాయి". బహుమతి భారంగా మారడం గోవిందుకు నచ్చలేదు, అలాని రాధమ్మకు నచ్చిన గజ్జెలు తీసెయ్యడం ఇష్టం లేదు. ఇద్దరికీ అనుకూలంగా, ఓ రోజు రాధమ్మ నిద్రపోతున్న వేళ, ఆ గజ్జలు తీసి, వాటిని పారేద్దాం అనుకున్నాడు. కానీ రాధమ్మకు ఆ గజ్జల చప్పుడు నచ్చడం మూలానా, వాటిని రాధమ్మకు ఉన్న ప్రతి ఒక్క పరికిణి చివర కుట్టాడు.
ఆ తర్వాత రోజు తాతగారికి స్తబ్దుగా ఉందని, వైద్యుడిని తీసుకొచ్చారు. ఇంట్లో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, వైద్యుడు ఇంటికి వచ్చేవాడు. అప్పుడు వాడి చూపులన్నీ రాధమ్మ మీదనే ఉండేవి. ఆ విషయం రాధమ్మకు తెలిసేది కాదు. గోవిందు వాడిని గమనిస్తున్న విషయం వైద్యుడికి తెలిసేది కాదు. రాధమ్మను మరోసారి చూడాలనే ఉద్దేశ్యంతో వైద్యుడు మందులు తయారు చేయాలి, ఇంటిదగ్గరకు వచ్చి తీసుకెళ్లామని చెప్తుండేవాడు. మందుల కోసం వైద్యుడి ఇంటికి గోవిందుతోపాటు అప్పుడప్పుడు రాధమ్మ కూడా వెళ్తుండేది. రాధమ్మకు వైద్యుడి ఇంటి ముందు ఉన్న గేటుతో ఆడుకోవడం అంటే భలే సరదా. గేటుపట్టుకు నిల్చొంటే ఊయలల ముందుకు, వెనక్కు గోవిందు గేటును తోస్తుంటే చిన్నపిల్లలా ఎంతో సంతోశపడేది రాధమ్మ. రాధమ్మకు చదువంటే ఎంతో ఆసక్తి, కానీ తతాగారు ఆడపిల్లకు చదువెందుకని బడికి వెళ్ళనివ్వలేదు. ఊరికి దగ్గరలో ఎక్కడ సంచార గ్రంధాలయం పెట్టినా వెళ్లి చూసేది. తనిలా ఇబ్బందిపడడం నచ్చక, గోవిందే ఊరిలో ఓ గ్రంధాలయం ప్రారంభించాలి అనుకున్నాడు. అదే సమయంలో, వైద్యుడు కూడా గ్రంధాలయం ఉంటె బావుంటుంది అనే ఆసక్తి వ్యక్తం చేయడంతో గ్రంధాలయానికి అవసరమైన ధనాన్ని తాతగారి ద్వారా వైద్యుడికి అందేలా చేసాడు గోవిందు. రాధమ్మ తనకెవరైన చదువు నేర్పిస్తే బావుండు అనుకునే సమయంలో, వైద్యుడి ఇంట్లో గ్రంధాలయం ఏర్పాటు పూర్తయ్యింది. వైద్యుడి ఉద్దేశం గోవిందుకు తెలియనిది కాదు, కాని రాధమ్మకు ఇబ్బంది కలగనంత వరకు వైద్యుడిని ఇబ్బంది పెట్టడలుచుకోలేదు గోవిందు. ఆ గ్రంధాలయాన్ని ప్రారంభించాల్సిందిగా తాతగారిని కోరినా, గోవింద్ రాధమ్మల చేతులమీదుగా జరపమని చెప్పారు ఆయన. ప్రారంభం తర్వాత, గ్రంధాలయంలో కొత్తగా చేయించిన ఓ టేకు కుర్చీలో రాధమ్మ ఠీవిగా కూర్చొని ఉంటె, ఆమె వెనుక రాజసంగా నిల్చొని ఉన్న గోవిందును, ఆ సమయాన్ని, వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని, ఆ మరుపురాని క్షణాన్ని ఓ పెయింటింగ్ గా చిరకాలం నిలిచిపోయేలా గీయించాడు వైద్యుడు. గ్రంధాలయం ప్రారంభమైన తర్వాత దాదాపు ప్రతీ రోజు గ్రంధాలయానికి వచ్చేది రాధమ్మ. ఆ వైద్యుడి దగ్గరే రాయడం, చదవడం అతి తక్కువ సమయంలోనే నేర్చేసుకుంది. ఓ పుస్తకంలో ప్రతి రోజు జరిగే విషయాలు రాయడం మొదలెట్టింది.
అలా రాధమ్మ వైద్యుడి దగ్గర చదువు నేర్చుకుంటున్న రోజుల్లో ఓ సారి ఏదో గొడవలో కొద్దిగా దెబ్బలు తగిలి, రాధమ్మ తప్పదని హుకుం జారిచేయడంతో మందు వేయించుకోడానికి వైద్యుడి దగ్గరకు వెళ్లాడు గోవిందు. ఏంటండీ! ఎలా ఉన్నారు ? "బానే ఉన్నాను రాజు గారు. క్షమించండి, గోవిందరాజులు గారు." ఈ మధ్య మీ మీద కాస్త దృష్టి పెట్టడం తగ్గించాను, ఏమనుకోకండి. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయిగా? "అందులో ఎటువంటి లోపం లేదు, మీరేంటి ఇలా వచ్చారు ?" చిన్న దెబ్బ తగిలిందండి, రక్తం కారిపోతుంది. "చిన్న దెబ్బ అంటారేంటి రాజు గారు, చిప్ప లేచిపోయినంత పనైతే. అలా కూర్చోండి." అంటూ ఏవేవో మందులు పూసి, రెండు గుళికలు నోట్లో వేసి, పెద్ద కట్టు వేసాడు. "ఉండండి, కొద్దిగా మజ్జిగ తీసుకొని వెల్దురు" పర్లేదండీ! "లేదు, తెస్తాను ఉండండి." వైద్యుడు మజ్జిగ తెచ్చి, తాగమని ఇచ్చేలోపు ఓ పిల్లి దూకడంతో అది నేలపాలయిపోయింది. మజ్జిగ ఇస్తున్నప్పుడు తత్తరపాటుగా చూస్తున్న వైద్యుడి కళ్ళు, వణుకుతున్న చేతులు, ఆనందాన్ని దాచేస్తున్న ముఖం కాస్త... మజ్జిగ నేల పాలు అవ్వగానే ఏదో అసహనం కనిపించింది అతనిలో. అక్కడి నుండి బయటకు వస్తుండగా, మా వాళ్ళ చావుకు నువ్వే కారణం అంటూ వైద్యుడ్ని తిట్టిపోస్తూ, శపిస్తూ, రోదిస్తున్నారు కొంతమంది. జబ్బు నయం చేయగలడు కాని, ప్రాణం పోయగాలడా ? ఏదో అతనికి తెలిసింది చేస్తూ మనల్ని కాపాడుతున్నాడు. వదిలెయ్యండి, దేవుడు చేసినదానికి అతన్ని ఎందుకు నిందించడం అంటూ వాళ్ళను ఓదార్చి పంపించాడు గోవిందు. కానీ, వైద్యుడు ఏదో తప్పు చేస్తున్నట్టు అనిపించింది గోవిందుకు.
కానీ రాధమ్మకు వైద్యుడు ఓ మంచి గురువులా చదువు నేర్పుతున్నాడు కనుక ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు గోవిందు. ఓ రోజు ఎందుకు అడిగిందో తెలీదు కాని, నీ దృష్టిలో ప్రేమంటే ఏమిటని అడిగింది రాధమ్మ. ఏమాత్రం ఆలోచించుకోకుండా, ఏమాత్రం తడబడకుండా ఇది చెప్పాడు గోవిందు... అర్ధాన్ని విడమర్చి చెప్పటానికి అదేం సిద్ధాంతం కాదు,అర్ధం చేసుకోలేం అని వదిలేయటానికి వేదాంతము కాదు, ఒక మనసు మరో మనసు కోసం తపించే అద్భుతమైన అనుభూతి. మాటల్లో చెప్పేది, పదాల్లో రాసేది, చిత్రంలా గీసేది కాదు కనుకే దానికి అంత గర్వం బలుపు పొగరు.ప్రేమంటే అంతులేని స్వార్ధం, అణిచేయలేని బలుపు, విజయ గర్వం, భయపెట్టలేని ధైర్యం, తప్పుకాని కోరిక, రాసివ్వని అధికారం, నేరం కాని తప్పు, శిక్ష లేని నేరం, సంతోషం వేసే సంకెళ్ళు, పట్టుకోలేని ఆనందం, కారణంలేని కోపం, స్వచ్చమైన స్వేచ్చ, నిర్మలమైన ఈర్ష, వీడిపోని భయం, ఆపలేని ఆత్రం. తెలివికి చిక్కని, ఆలోచనకు అందని, మెదడుకు దొరకని, తలపుని వదలని మనసుకు మాత్రమే అర్ధమయ్యే భాష ప్రేమంటే. కాని నాకు మట్టుకు ప్రేమంటే నువ్వు(అంటే నేను) అంతే. అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పేసాను. ఆ తర్వాత ఏదో అద్భుతాన్ని చూసినట్టుగా రాధమ్మ నావైపు చూసిన చూపును మట్టుకు మర్చిపోలేను ఎప్పటికి.
ఆ తర్వాత రంగడితో చెరువు గట్టు దగ్గర కూర్చొని, రేయ్! రంగా... ప్రేమంటే ఏంటో తెలుసారా....? భయంగా మొదలై, బలంగా మారి, బలహీనతగా మిగిలేదేరా ప్రేమంటే. రాధమ్మే నా బలం, నా బలగం, నా భయం, నా బలహీనత. రాధమ్మకు ఇదెలా తెలిసేదిరా రంగా!! అలా రంగాడితో మాట్లాడుతుండగా, బాబు అంటూ ఆర్తిగా అరుస్తూ వచ్చాడు సాంబడు. "పట్నం నుండి ఎవరో వచ్చారు బాబు. వాళ్ళు చెప్పిన ధరకు పొలం అమ్మకపొతే ప్రాణం తీసేస్తాం అని బెదిరిస్తున్నారు. మన ఊరిలో కొంతమంది వాళ్లకు సాయం చేస్తున్నారు బాబు. మీరు తప్ప నాకెవరు దిక్కు లేదు, నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆ భూమి. తిండిపెట్టే తల్లిని అమ్ముకునేంత కర్మ పట్టలేదు, అంత దౌర్భాగ్యుడిని కాదు బాబు. నువ్వే ఏదోటి చెయ్యాలి బాబు." అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అడిగాడు. అతనలా అడిగేసరికి, నిజమో కాదో అని తెలుసుకోకుండా పరిష్కారం కోసం బయలుదేరాడు గోవిందు. సాంబడి పొలంలో... పట్నం నుండి వచ్చిన వాళ్ళలో దిట్టంగా పెహల్వాన్ లా ఉన్నవాడు ఎదురొచ్చి, "రాజు గారు, వీడు మాకు బాకీ ఉన్నాడు. ఆ అప్పు తీర్చే విధంగా కనిపించడం లేదు. అందుకనే, ఈ భూమిని అమ్ముతున్నాం. ఇందులో మేము ఎటువంటి తప్పు చేయడం లేదు. మీరు అనవసరంగా తల పెట్టకండి." నిజమేనా అనట్టు సాంబడి వైపు సైగ చేసాడు గోవిందు. "నిజమే బాబు, కాని అప్పుకి మూడు రెట్లు వడ్డీ లెక్క కట్టారు. ఇప్పటికే అసలుకు సరిపడ వడ్డి కట్టాను బాబు. అసలు ఇవ్వమని ఇప్పుడు అడిగితె ఎక్కడినుండి తెచ్చివాలి" అంటూ ఏడవడం మొదలెట్టాడు సాంబడు. మీరేమంటారు అనట్టు ఆ పెహల్వాన్ వైపు చూసాడు గోవిందు. "వడ్డీతో సహా ఇప్పుడు ఇచ్చేస్తే, ఇటు నుండి ఇటే వెళ్ళిపోతాం!". సరే, ఆ డబ్బుకు నాది హామీ. ఇంటికి రండి, ఇచ్చి పంపిస్తాను అని భరోసా ఇచ్చాడు గోవిందు. ఆ పెహల్వాన్ ఒప్పుకున్నా కూడా, వెనుక నవ్వారు మంచం పైన కూర్చున్న బక్కపలచటి వ్యక్తి మాత్రం ఒప్పుకోలేదు. "వడ్డీ డబ్బులు ఇచ్చినా వదిలేదు లేదు, ఈ భూమి నాకు కావాలి. భూమి పాత్రల మీద వాడి పేరు తీసి నా పేరు పెట్టాలని వచ్చాము, మీ తల తీసేలా చెయ్యకండి రాజుగారు". గోవిందుకు ఆ మాట వినగానే పిడికిలి బిగిసింది కానీ, శాంతంగా పరిష్కరించాలని... అది కాదండీ! మరో సారి ఆలోచించుకోండి అని అడిగాడు. "ఎన్ని సార్లు ఆలోచించిన ఇదే మా అభిప్రాయం. నువ్వు పంచె దోపుకొని వచ్చినదారిన వెనక్కి చూడకుండా వెళ్తే, నీ ప్రాణానికి ఎంతో మంచిది." అది కాదండీ! మరో సారి ఆలోచించుకోండి. "ఏంట్రా! ఆలోచించేది, నువ్వేమన్నా పిస్తావా. వాడి భూమి వాడికిప్పిస్తావా. ఏం బెదిరిస్తున్నావా. నరుకుతా కొడకా" అంటూ గట్టిగా అరుస్తున్నాడు బక్కపలచని పట్నం వ్యక్తి. అది కాదండీ! నన్ను చంపటం వళ్ళ నీకేం లాభం రాదు, నేను బతికుండటం వళ్ళ నీకేం నష్టం కాదు, అందువల్ల ఈ గొడవకు అర్ధం లేదు. అలా కాదు పంచె ఎగ్గట్టాలి, నన్ను భయపెట్టాలి, చచ్చే వరకు కొట్టాలి, ఈ గొడవని ఇప్పుడే తెగ్గొట్టాలి అని నీ మనసులో గట్టిగా ఉంటె చెప్పండి…మిమ్మల్ని కొట్టి, మీ మనసులోని ఆ ఆలోచనని పాతి పెట్టి, ఇంకోసారి మా ఊరిలో కాలుపెట్టటానికి భయపడేలా చేయటానికి నాకేం ఇబ్బంది లేదు. ఇప్పటికీ డబ్బు కావాలంటే నా వెనుక రండి ఈ భూమి మీద చేసిన అప్పు తీరుస్తాను, భూమి కావాలంటే నా మీదకు రండి ఈ భూమిలోనే పాతేస్తాను. "నీ అంతు చూస్తాను రా..." అంటూ బక్కగా ఉన్న పట్నం అతను వచ్చిన బండిలోనే వెనక్కి చూడకుండా పారిపోయాడు.
ఆ తర్వాత ఊరిలో ఆరోగ్య పరిస్తితి మరీ దిగజారిపోయింది. వైద్యుడిని అడిగితే ఏదో కొత్త రకం వ్యాది సోకుతుంది, అది అందరికి వ్యాప్తి చెందకుండా, చనిపోయిన వారి ఇంట్లో ఉన్నవాల్లందరినీ, నగలు, బంగారం, సామాన్లు అన్నిటితో సహా పూడ్చేయడం కన్నా మరో మార్గం లేదు అని చెప్పాడు. అలా చేయడం గోవిందుకు నచ్చలేదు, కానీ ఊరిలో అతను చెప్పినట్టుగానే జరగడంతో ఒప్పుకోక తప్పలేదు. స్మశానం కోసం ఇచ్చిన పొలాన్ని ఆ పేరుతో పిలవడం ఇష్టం లేక, తాతగారు దానికి వేరే ఏదైనా పేరు పెడితే మంచి జరుగుతుందేమో అని గోవిందుని అడిగారు. అదే సమయంలో హరిశ్చంద్రుడి నాటకం వేస్తున్నారని దండోరా వినపడింది. స్మశానం అనడం కన్నా ఇలా పిలవడం బావుంటుందేమోనండి అని నేను అనగానే... "ఎలా ?" అని అడిగారు తాత. హరిశ్చంద్ర వేదిక.
మిగిలిన కథ తర్వాతి భాగంలో 23 10 2016