జరిగిన కథ – రాధే గోవింద, GREP01, GREP02, GREP03, GREP04, GREP05, GREP06
హరిశ్చంద్ర వేదిక అని చెప్పగానే తాతగారు అదేం పేరురా అనట్టు చూసారు కాని, కాటికి ఏ పేరైతే ఏమిలే అనట్టు దాని గురించి పెద్దగా చర్చలేమి జరగలేదు. రంగడు ఆకలితో రంకేలేయడంతో తాతగారి దగ్గరి నుండి, రంగడి దగ్గరకు వచ్చి, ఆయన ఆకలి సెగకు ఎండుగడ్డి సమర్పిస్తూ కూర్చున్నాను. రంగా, ఇంకో మూడు రోజులలో రాధమ్మ పుట్టిన రోజు రా అని చెప్పగానే, నీది ఆ రోజేగా అనట్టు చూస్తున్నాడు రంగడు. అదేలే, నాది ఆ రోజే అనుకో, అమ్మ వాళ్ళు నన్ను వదిలి వెళ్ళింది కూడా అదే రోజు కదా. అమ్మా, నాన్న గారు మీరు వెళ్ళిన తర్వాత నుండి రాధమ్మకు పుట్టిన రోజు వేడుకలే జరపలేదు, మీరున్నప్పుడు రాధమ్మ పుట్టిన రోజు ఎంత ఘనంగా జరిగేవో కదా అనుకుంటూ శూన్యంలోకి చూస్తూన్న గోవిందు కళ్ళ ముందు దృశ్యం మొత్తం మారిపోయింది.
ఇంటి వరండాలో పదమూడేళ్ళ అబ్బాయిని పట్టుకోడానికి ఏడేళ్ళ పాప పరిగేడుతుంది. "ఏంట్రా ఈ గోల, గోవిందా నువ్వైనా ఆగొచ్చు కదా నాన్నా" అంటూ గోవిందు వాళ్ళ తాత గారు. "ఇప్పుడే ఇంతలా పరిగేత్తిస్తుంది, రేపు పెళ్ళయ్యాక నా కొడుకు పరిస్తితి ఏమిటో" అంటూ గోవిందు వాళ్ళ అమ్మ గారు. "ఆ మాత్రం గడుసుతనం లేకపోతే మీ అబ్బాయితో కష్టం లే వదినా" అంటూ రాధమ్మ వాళ్ళ అమ్మ గారు. "అంజయ్య అప్పన్న పొలానికి ఎరువులు, మంగమ్మ ఇంటికి బియ్యం, రాజయ్యకు డబ్బులు పంపించావా ? పదండి, పదండి... ఆలస్యం అవుతుంది. గోవిందా పరిగెత్తింది చాలు, ఇక రా. రాధమ్మ నువ్వు మాతో వస్తావా ?" అంటూ గోవిందు వాళ్ళ నాన్న గారు. "జరగండి, జరగండి..." పూ పూ అని హార్న్ కొడుతూ వచ్చి వీళ్ళ ముందు కార్ ఆపిన రాధమ్మ వాళ్ళ నాన్న గారు. గోవింద్ వాళ్ళ అమ్మ, నాన్న, రాధమ్మ వాళ్ళ అమ్మ, నాన్న ఎక్కి కూర్చున్నాక కారులో ఇంకొకరికి మాత్రమే సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. రాధమ్మ తను ఎక్కుతాను అంది, గోవిందు సరే నేను వెనుక తాతగారితో జట్కాలో ఎంచక్కా వస్తాను అని అనగానే, నేను జట్కాలోనే వస్తాను అని పరిగెత్తి వెళ్లి వెనకున్న జట్కాలో తాతగారి పక్కన కూర్చుంది రాధమ్మ. గోవిందు వెళ్లి రాధమ్మ పక్కనే కూర్చున్నాడు. కారు మొదలవ్వడానికి కొద్దిగా మొరాయించింది, కాసేపటికి గాడిలో పడింది. కారు మొదలవ్వగానే గౌరి(ఆవు) వింతగా ప్రవర్తించడం మొదలెట్టింది, ఓ మోస్తరుగా గాలి రావడం మొదలైంది, దుమ్ము రావడంతో గేటు దగ్గర నిల్చున్న పని వాళ్ళు తుమ్మారు. తాతాగారు కాసేపు ఆగి వెళ్దాం అన్నది కారు ఇంజెను శబ్దానికి వినపడలేదు గోవిందు వాళ్ళ నాన్న వాళ్లకు. కార్లో ఉన్నవాళ్ళు అవేమి పట్టించుకోకుండా బయలుదేరగానే, వెనుక జట్కా కూడా వెళ్ళింది. అక్కడ మొదలైన కారు శబ్దం, ఏడు కొండల సామి కోవెల ముందు వచ్చాక ఆగిపోయింది. వీళ్ళు వెళ్ళే సమయానికి హారతి జరుగుతుంది, గోవిందు, రాధమ్మ, తాత గారు హారితి తీసుకొన్న తర్వాత మిగిలిన వాళ్ళు తీసుకునే లోపు హారతి ఆరిపోయింది. తాతగారికి ఏదో కీడు జరగబోతుందన్న భయం చిన్నగా మొదలైంది. కొద్దిసేపటి తర్వాత బయలుదేరుదాం అనగానే, కొద్ది సేపు దైవ సన్నిదిలో ఉండి వెళ్దాం అని తాతగారు అందరిని ఆపేశారు. "వర్షం పడేలా ఉందండి, త్వరగా వెళ్తే మంచిదేమో" అని గోవిందు వాళ్ళ నాన్నగారు చెప్తున్నా వినలేదు తాతగారు. ఓ పది నిమిషాల తర్వాత పదండి వెళ్దాం అన్నారు తాతగారు. కార్ లో వాళ్ళు ముందు వెళ్దాం అనుకుంటే, మీరు మా వెనుకే రండి అని జట్కా ముందుగా కదిలించారు తాతగారు. వీళ్ళు జట్కాలో వెళ్తుండగా కార్ లో మంటలు రావడం, అందరు బయటకు దూకేస్తూ పెద్దగా అరవడంతో మళ్ళీ రంగడు పక్కన కూర్చున్న చోటికి వచ్చేసింది గోవిందు ఆలోచన. అదే సమయంలో రాధమ్మ గడ్డి తీసుకొచ్చి రంగడు ముందు వేస్తుంది.
నేను వేసాను కదా రాధమ్మ అని తనని చూస్తూ అడగగానే, "నువ్వు వేసింది ఎప్పుడో అయిపొయింది బావ. పాపం అడిగి, అడిగీ రంగడి గొంతు పోతుందేమో అని, నువ్ కదిలేలా లేకపోయేప్పటికి నేను తేవాల్సి వచ్చింది. అంత పరధ్యానం దేని మీదనో ?". (చిన్నగా నవ్వి) రా ఇక్కడ కూర్చో. "ఏంటి బావా ?" రాధమ్మ, నీ పుట్టిన రోజు వేడుకలా జరుపుకోవడం నీకు ఇష్టమేనా ? ". నాది కాదు, నీ పుట్టిన రోజు నాడు నేను పుట్టాను. నీకు వేడుక జరిగితే నాకు జరిగినట్టే గా బావ." నాకు వేడుకలు ఇష్టం లేదు రాధమ్మ. "నాకు ఇష్టం లేదు బావ". ఎందుకు ?. "నీకు ఎందుకు ఇష్టం లేదు." అమ్మ వాళ్ళు మనల్ని వదిలివెల్లిపోయిన రోజును సంబరంలా జరుపుకోగాలనా! "వాళ్ళు నీకెంతో, నాకు అంతే కద బావా. మరి నేనెలా జరుపుకోగలను" అంటూ రాధమ్మ వెళ్ళిపోయింది. రాధమ్మ వైపు చూస్తూ, రాధమ్మ ఎంత పెద్ధదైపోయిందో చూడు రా రంగ. అవును అనట్టు తలాడించాడు రంగడు.
రాధమ్మ పుట్టిన రోజునాడు సూర్యోదయానికి గంట ముందుగా రాధమ్మ గది దగ్గరికి వెళ్లి తనని నిద్ర లేపి, సైకిల్ పై వరి చేను మధ్యలో ఉన్న మంచె దగ్గరకు తీసుకొచ్చాడు గోవిందు. వాళ్ళిద్దరి జీవితంలో మొదటిసారి అంత సుందరమైన సూర్యోదయం చూసారు. కాషాయ కిరణాలతో ఆకాశాన్ని పట్టిన చీకటి తెరను చీల్చుతూ వస్తున్నాడు సూర్యుడు. ఒకే సారి రెండు ఆకాశాలు, ఇద్దరు సూర్యులను చూసి ఆశ్చర్యపోయింది రాధమ్మ. ఆకాశ ప్రతిబింబం ఆ పక్కనే ఉన్న చెరువులో మరో ఆకాశాన్ని తలపిస్తుంది. సూర్యుడి ప్రతిబింబంలో తిరుగుతున్న బాతులు చూడముచ్చటగా ఉన్నాయి. అలాంటి సుమనోహర సమయం లో రాధమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు గోవిందు, వెంటనే రాధమ్మ కూడా గోవిందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. ఆ క్షణం వాళ్ళిద్దరి జీవితాల్లో ఓ అద్భుతమైన జ్ఞాపకంలా మిగిలిపోయింది.
ఆ రోజు మధ్యానం ఊరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపిన తర్వాత, రాధమ్మ, గోవిందుని ఆయన గదిలోకి పిలిచారు తాతగారు. ఇద్దరిని కూర్చోపెట్టి, "నువ్వు కోరినట్టుగానే ఇంతకాలం ఆగాం. ఇంకా నువ్వు సాకులు చెప్పడానికి లేదు, చెప్పినా వినే వయసు నాది కాదు. పెళ్లి మూహుర్తం పెట్టిస్తున్నా అని సమాచారం ఇవ్వడానికి పిలిచాను" అని తాతగారు చెప్తుండగా "మీరు తొందరపడకండి తాతగారు" అంటూ గోవిందు ఆపాడు. తాతగారు, రాధమ్మ గోవిందుని చూస్తున్నారు. "నా అభిప్రాయం తో మీకు పని లేదని నాకు తెలుసు, కాని రాధమ్మ అభిప్రాయం తెలుసుకోకుండా ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. రాధమ్మ,నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా అనే విషయాన్నీ బాగా ఆలోచించుకొని చెప్పు." అని గోవిందు చెప్పగానే. "దాని అభిప్రాయం కొత్తగా ఈ రోజు తెలుసుకోవడం ఏమిటి .." అంటూ తాత గారు ఇంకేదో అనబోతుంటే, "లేదు తాతగారు, తన అభిప్రాయం అడగకుండా చేసుకోవడం పధ్ధతి కాదు." అని గోవిందు ఆపాడు. "ఎప్పుడో ఎందుకు,ఇప్పుడే చెప్తాను బావా" అని రాధమ్మ అనగానే, "లేదు, బాగా ఆలోచించుకొని రేపు చెప్పు రాధమ్మ" అని గోవిందు చెప్పాడు. తాతగారికి ఏమి అర్ధం అవ్వలేదు. తర్వాత రోజు, బావను చేసుకోవడం తనకు ఇష్టమే అని చెప్పింది రాధమ్మ, కాని తానో షరతు పెట్టింది. "నాకు ఇష్టమో కాదో తెలుసుకున్నారు కదా, మరి బావకు నేనంటే ఇష్టమని తెలుసు కాని ఆయన మాటల్లో చెప్పమనండి" అని తాతగారితో చెప్పింది రాధమ్మ. "నేను చెప్పలేను రాధమ్మ". "నేను చెప్పినప్పుడు, మీరు చెప్పాలి బావ". "నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా రాధమ్మ". "మరి మీ మీద నా ప్రేమ గురించి అభిప్రాయం అడగడం ఎందుకు బావా ?". "నువ్వు ఇప్పుడు చదువుకున్నావ్, నీ ఆలోచనల్లో ఏదైనా మార్పు వచ్చిందేమో అని". "నీ ఆలోచన ఏమైనా, నా మీద నీకెంత ప్రేమున్నా, ఈ రోజు చెప్పాల్సిందే. నేను చెప్పాను కదా, నువ్వు చెప్పాల్సిందే. లేకపోతె నా మీద ఒట్టే!". అంత పెద్ద మాట ఎందుకులే రాధమ్మ, సరే చెప్తాను. నువ్వు పుట్టకముందు నుండే మా అమ్మ చెపుతుండేది, నాకోసం ఒక దేవత రాబోతుంది అని. నాకు అమ్మే దేవత ఇంకో దేవత ఎందుకూ అనిపించేది. నవ్వు పుట్టావ్, అప్పుడు నాకు ఏడేళ్ళు. అందరూ నీ పెళ్ళాం పుట్టింది రా అన్నారు. ఆ మాట నాకు అర్ధం అవ్వలేదు, వాళ్ళ ఆనందానికి కారణం తెలీలేదు. నీ ఆరవ పుట్టిన రోజు నాడు దీవెనలకోసం ఏడుకొండల సామి కోవెలకు వెళ్ళాం. తిరిగి వస్తున్నా వేళ కారులో మంటలు రావడంతో మీ అమ్మ, నాన్న, మా నాన్న అక్కడే చనిపోయారు. మా అమ్మను వైద్యశాలాలో చేర్పించాం. తను నాతొ అన్న చివరి మాటలు “గోవిందా…బావంటే బాధ్యత తీసుకునేవాడు, బాధ పెట్టనివాడు, భరోసా ఇచ్చేవాడు, భయం పోగొట్టేవాడు, భద్రంగా చూసుకునేవాడు. నువ్వు రాధకు బావవి తనని బరువు అనుకోకు ఎప్పటికీ” అని. పదమూడేళ్ళ కుర్రాడికి ఆ మాటల్లో లోతు, ఆ క్షణంలో తీవ్రత, ఆ సమయంలో ఆవేదన, తన తల్లి చివరి కోరిక అవగతం అవ్వకపోయినా ఆ సన్నివేశం మనసులో ధృడంగా నాటుకుపోయింది. అమ్మే లేకపోతె ఎందుకు బతకాలి అనిపించింది కాని…నాకు దేవత మా అమ్మ, తనే నిన్ను దేవత అని చెప్పి నాకు అప్పగించి తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు నిర్ణయించుకున్నాను నేను బతికున్నంత వరకు నీకు బాధంటే తెలీకూడదు, నువ్వు బాధపడిన రోజున నేను బతికుండకూడదు అని. నేను బతుకుతున్నదే నీకోసం రాధమ్మ…ఆ బతుక్కి ఓ పేరు కావాలంటే అదే ప్రేమ. ఇక మీ అభిప్రాయ సేకరణలు ఐపోయినట్టేగా అంటూ ఆ వెంటనే తాతగారు పురోహితుడిని పిలిచి, ఊర్లో పెద్ద మనుషులు వైద్యుడితో సహా అందరి ముందు కార్తిక మాసం ఎనిమిదవ రోజున దివ్యమైన మూహూర్తం ఉందంటే అది కరారు చేసారు.
పెళ్లి పనులు ఇంట్లో జరుగుతుండగా, ఊర్లో జబ్బు చేసి చనిపోయేవారి సంఖ్యా బాగా పెరిగిపోయింది. ఊరి మొదట్లో ఉన్న స్మశానం శవాలతో నిండిపోయింది. తాతగారు హరిశ్చంద్ర వేదిక చుట్టూ కంచె వేయించామన్నారు గోవిందుని. చాలా కాలం తర్వాత ఆ పొలం దగ్గరికి వెళ్ళారు గోవిందు, రంగడు. ఆ ఏడాది వర్షాలు సరిగా లేవు, అక్కడక్కడ చిన్న మడుగులు తప్ప పెద్దగా నీళ్ళు ఆగలేదు. దహన కార్యక్రమాలకు వీలుగానే ఉంది. సరిహద్దులు తెలియాలని చుట్టూ కంచె వేయించారు. మామిడి తోట వెనుక నుండి దాదాపు రెండు పర్లాంగుల దూరం నడిస్తే, హరిశ్చంద్ర వేదిక అని కనిపించేల పెద్ద కమాను కట్టించి, ఇనుప గేటు అమర్చారు. ఆ గేటు వెనుకాలే, కాపరి మల్లన్న కోరడంతో అతని కోసం ఆ కమాను ని ఆనుకొనే లోపలగా ఓ పెద్ద గది కట్టించారు. ఇదంతా ఓ కొలిక్కి వచ్చేప్పటికి దాదాపు ఓ వారం రోజులు పట్టింది. ఈ లోపు తతాగారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడం మొదలయ్యింది. ఒక రోజు ఎవరి గురించో కనుక్కోడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళారు తాతగారు, ఆ రోజు తర్వాత నుండి ఆయన ఆరోగ్యంలో స్పష్టమైన మార్పు రావడం మొదలైంది. దిట్టంగా ఉన్న మనిషి ఒరిగిపోవడం మొదలెట్టారు, కొన్ని రోజులకు లేచి నిలబడడానికే శక్తి సరిపోలేదు. ఆయన ఆరోగ్యం బాలేదని బాధలో ఉండగా, ఎవరో పెద్దావిడ మరో ఇద్దరు పెద్దవాళ్ళతో వచ్చింది. "మేము రాధ చుట్టాలం, వరసకు మేనత్త అవుతాను. రా అమ్మ, ఇక్కడో కూర్చో." గోవిందు ఏమి మాట్లాడకుండా చూస్తున్నాడు, రాధమ్మ బయటకు వెళ్ళిపొండి అనట్టు చూస్తుంది, తాతగారు వాళ్ళని గుర్తుపట్టే పరిస్తితుల్లో లేరు. "మామయ్య గారికి ఆరోగ్యం బాలేదని తెలిసి చూసి వెళ్దామని వచ్చాం" "మంచిది, వచ్చారు, చూసారు కదా ఇక బయలుదేరండి" అని రాధమ్మ కసురుగా అనగానే, తప్పు అలా అనకూడదు అనట్టు వారించాడు గోవిందు. "మావయ్య గారు ఉనప్పుడే ఆస్తుల గురించి ఓ మాట అనేసుకుంటే సరిపోతుందని, రాధమ్మను ఎలాగో మా పెద్దోడికి ఇచ్చి చెయ్యాలని అది పుట్టాక ముందే మా అన్నయ్య నాకు మాట ఇచ్చారు. మావయ్య ఉనప్పుడే ఆ తతంగం జరిపించి, ఆస్తి లో ఎలాగో సగం వాట మా అన్నయ్య దే కనుక అది మా పెద్దోడి పేరు మీద రాస్తే సంతోశిస్తాం." రాధమ్మ "వీళ్ళతో మాటలేంటి బావా, అంజయ్య వీళ్ళను బయటకు తన్ని తరిమెయ్యి" అని అంటుంటే ఆపుతూ...చూడండీ! రాధ చుట్టాలు అంటున్నారు, ఇప్పటివరకు మీరు ఉన్నారనే మాకు తెలీదు. ఐనప్పటికీ సంతోషం, ఇప్పటికైనా మీరున్నారని తెల్సినందుకు. ఆస్తి అంటారా నాకు చిల్లిగవ్వ కూడా వద్దు, అంతా రాధ ఇష్టం. కాని సమయం లో…కానికోరికలు కోరుతున్నారు… తప్పు. మొదటిసారి వచ్చారు భోజనం చేసి బయలుదేరండి. "చూడు బాబు, బయలుదేరడానికి ఇదేం మా బందువుల ఇల్లు కాదు. మా అన్నగారి ఇల్లు. మర్యాదగా ఇస్తే పట్టుకుపోతాం, కుదరదంటే లాక్కుపోవడం మాకు పెద్ద పనేం కాదు." "వీళ్ళతో మాటలేంటి రాజ్యం... నువ్వేవ్వడివిరా... ఎవడికి పుట్టావ్... " అంటూ రాధమ్మ వాళ్ళ అత్త వెంట వచ్చిన అతను గోవిందు మీద చేయి చేసుకున్నాడు. గోవిందు ఏమి మాట్లాడకుండా, కోపాన్ని కళ్ళలోకి రానివ్వకుండా, వాళ్ళ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. "మధ్యలో నీకేంటే నొప్పి, నీ యమ్మ ఆస్తి ఎందుకు ఇవ్వరే..." అంటూ అతను రాధమ్మ వైపు వెళ్తుండగా, అతన్ని ఆపి వెనక్కి నెట్టి నువ్వు రాధ కి మావయ్య అవుతావ్ అంటే నాకు బాబాయ్ అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు నాకంటే పెద్ద వారు, నాతో ఎదో ఒక బంధుత్వం ఉన్నవారు. మనవాళ్లు కదా అని మాటలతో చెపుతున్నాను బాబాయ్. వద్దు…అవసరం లేని చోట, అవసరం కాని వేళల్లో, అనవసరంగా ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు…కోపంతో ఉన్న నా కళ్ళనే చూసి తట్టుకోలేరు మీరు అలాంటిది నా కోపాన్ని చూడాలి అనే ఆలోచన రానివ్వద్దు. వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి అని గోవిందు హెచ్చరించగానే భయపడి "నీ అంతు చూస్తాం రా" అంటూ వెళ్ళిపోతుంటే, చాలా మంది చూడాలని వేచి చూస్తున్నారు బాబాయ్, నీకు ఒపిక ఉనట్టు కనిపించట్లే, కనీసం భోజనం కూడా చేయకుండానే వెళ్తున్నారు అన్నాడు గోవిందు.
తాతగారి ఆరోగ్యం మరీ క్షీణించి పోయింది. ఊరిలో వైద్యుడు సరిగ్గా చూడడం లేదేమో అని రాధమ్మ చెపితే, గోవిందు వేరే వైద్యుడిని తీసుకొచ్చాడు. ఆయన జబ్బేమిటో ఎవ్వరు తెలుసుకోలేకపోయారు. కూర్చుని తిన్నా తరగని ఆస్తి, ప్రాణం ఇచ్చే మనుషులు, ప్రాణం పెట్టుకున్న మనవడు మనవరాలు, వీళ్ళందరూ ఉన్నా తాతగారి ప్రాణం కాపాడలేకపోయారు. పెళ్ళికి రెండు వారాల ముందు తాతగారు కాలం చేసారు. యాదృశ్చికమో, దైవ నిర్ణయమో కాని, స్మశానం కోసం దానం చేసిన రెండు ఎకరాల హరిశ్చంద్ర వేదికలో మొదటి కర్మకాండ ఆయనదే అయ్యింది. తాత గారి మరణంతో గోవిందు బలం తగ్గిపోయినట్టుగా అనిపించింది. ఊర్లో, అప్పటివరకు తాతగారికి భయపడి దాక్కున్న వాళ్ళంతా గోవిందు మీద పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో మొదటి వాడు ఆయుర్వేద వైద్యుడు ప్రకాశం.
మిగిలిన కథ తర్వాతి భాగంలో 26 10 2016