"హలో, దేవుడేనా మాట్లాడేది??"
"అవును సారు.. "
"ఏరా ఈరోజు చిన్నిని ఆసుపత్రి కి తీసుకురాలేదు?"
"సారు.. ఈరోజు గ్రహణం కదా సారు... పిల్లల్ని బయటకి తీసుకొస్తే చెడు జరుగుతుంది అంట... మా జ్యోతిష్యుడు చెప్పాడు.. "
"ఈ కాలం లో కూడా ఏందిరా ఇవన్నీ.. ?? చిట్టికి రోజు టీకా వెయ్యకపోతే దాని ప్రాణానికే ప్రమాదం"
"సారు గ్రహణం సమయం లో ఏ మందు వేసిన, మెతుకు అన్నం ముట్టిన విషం అయిపోద్ది అంట సారు.."
"అరేయ్ పిచ్చోడిలా మాట్లాడకు.."
"సారు.. మీ డాక్టర్లు అందరు డబ్బుకోసం ఏమన్నా చెప్తారు అంట కదా సారు.. సైన్స్ ఇపుడు పుట్టింది కానీ ఆచారాలు, కట్టుబాట్లు ఎన్నో యేండ్ల నుండి వస్తున్నాయి.."
"అవి ఆచారాలు కాదు రా మూఢనమ్మకాలు. కొందరు మనుషులు డబ్బుకోసం వాడుకుంటున్న నమ్మకాలు"
"తప్పు సారు. మా జ్యోతిష్యుడు చిట్టి ఆరోగ్యం కోసం ఎన్నో యాగాలు, ధర్మాలు చేయిద్దాం అన్నారు. మీ డాక్టర్ లు నయం చేయలేనిది చేసి చూపిస్తా అన్నారు."
" అరేయ్.. ఇంకా వారిని ఎలా నమ్ముతున్నావురా?? టీవీ లో చుడట్లా ఎంత మంది దొంగ బాబాలు, జ్యోతిష్యులు తప్పు అని చూపిస్తున్నారు."
"సారు వారందరు మా మతం మీద, కులం మీద కక్ష తో ఇలా చేస్తున్నారు అంట సారు. మాకు అన్ని తెలుసు"
"అరేయ్ ఈ వాదన అంత కాదు.. చిట్టి గురించి ఆలోచించారా.. దాని ప్రాణానికే ప్రమాదం రా"
"నెలరోజుల నుండి చూస్తున్నాం సారు, మీ సైన్స్ దానిని ఏమి బాగుచేయలేక పోయింది. ఇక మమ్మల్ని వొదిలెయ్యండి."
"అరేయ్ నీకు అర్ధం కావట్లేదు ఫిట్స్ వస్తే తన ప్రాణానికే ప్రమాదం."
"మీరు ఏమి అనుకోకండి సారు.. ఇంకా మమ్మల్ని దండుకోవటం ఆపేయండి"
"దేవుడు.. దేవుడు ..."
******
"ఎవరయ్యా ఫోను ?"
"డాక్టర్ సారు.."
"ఇంకో పారు ఆలోచించరాదు. ఈ జ్యోతిష్యులని నమ్మి ఆసుపత్రికి పోవకపోవటం అవసరమా.."
"పిచ్చి పిచ్చి గా ఉందా.. పోయి అన్నం వడ్డించు పో .. "
అర్ధరాత్రి
"అయ్యా ... అయ్యా.. చిట్టికి ఫిట్స్ ఒచ్చాయే మళ్ళీ... నాకు చాల భయంగా ఉంది"
"దొర బాబు ఇచ్చిన తాయిత్తు తీసి కట్టు.. అంత సర్దుకుంటుంది.."
ఉదయం
"అయ్యా.. అయ్యా.. "
"ఏందే నీ గోల.. ఓఓఓ ... "
"చిట్టి లేవట్లే అయ్యా.. "
"ఇంత పొద్దునే లేపితే ఎందుకు లేస్తదే.. పాడుకొనియ్యి"
"అయ్యా.. నోటి దగ్గర నురుగు ఉందయ్యా.. నాకు ఏదో భయం గా ఉంది .. వచ్చి సూడయ్యా.."
"నువ్వు నీ భయాలు.. పడుకోనియ్యవు కదా అసలా .."
****
"చిట్టి... చిట్టి ... "
"ఏమయిందయ్యా దానికి ఉలుకు పలుకు లేకుండా ఉంది"
"నువ్వు ఆ ఏడుపు ఆపి సత్తి గాడిని బండి కట్టమను ఆసుపత్రి కి తీసుకుపోదాం.. "
ఆసుపత్రి లో
"దేవుడు.. చిట్టి ఇంకా మనతో లేదు.. నువ్వు నమ్మిన ఆ నమ్మకమే నువ్వు అల్లారుముద్దుగా పెంచుకున్న నీ కూతుర్ని దూరం చేసింది. గ్రహణం పట్టింది చంద్రుడికి కాదయ్యా మీకు.. మందులు, మెతుకులు కాదయ్యా మీ మనసులు ఆలోచనలకు విషం పట్టింది"
"ఏందయ్యా మీరు చెప్పేది... ?? "
"చిట్టి చచ్చిపోయింది.."