వెయ్యి సంవత్సరాలకు పైగా వయసు ఉన్న ఖిల్లా.. ఎందరో మహా రాజుల రాజసానికి సమానమైన దర్పంతో తనలో ఆశ్రయం ఇచ్చిన కోట.. నాటి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి నేటి తరానికి తన చరిత్రను వివరిస్తున్న కోట. అదే ఖమ్మం నగరంలోని 'ఖమ్మం ఖిల్లా'. మొదట ఈ కోటను ఘనత వహించిన కాకతీయ రాజుల సామంతులైన లక్నా రెడ్డి, వెలమ రెడ్డి సోదరులు క్రీ.శ 950లో ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సుమారు 56 సంవత్సరాల పాటు (1006) ఈ కోట నిర్మాణం జరిగింది. ఈ కోటలోకి వచ్చే రాజుల కోసం ఒక పక్క రాజసంగా ఉంటూనే ఇంకో పక్క శత్రువుల నుండి రక్షణగా ఉండేలా అత్యంత పటిష్టంగా, పకడ్బంది ప్రణాళికతో నిర్మించారు. ఈ కోటను కాకతీయులు, శ్రీ కృష్ణ దేవరాయులు, ఒరిస్సా గజపతి రాజులు, వెలమ రాజులు, రెడ్డి రాజులు, నందపానులు, నిజాం రాజులు మొదలైన రాజులు పాలించారు.


ఈ కోట ఎక్కువ కాలం నిజాం రాజుల పాలనలో ఉంది. ఎప్పుడైతే నిజాం రాజుల చేతిలోకి ఈ కోట వచ్చిందో ఇక అప్పటి నుండి దీనిలో పటిష్టమైన నిర్మాణాత్మక మార్పులు తీసుకువచ్చారు. నిజాం రాజులు వీటిని ఆయా సమయానికి తగ్గట్టు కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటు పాలించారు. ఈ కోటను 12 బురుజులు, 10 రాతి దర్వాజలతో శత్రువుల నుండి రక్షణగా అత్యంత పటిష్టంగా నిర్మించారు. నిజాం రాజులు ఈ కోటలోని కొన్ని అతి ముఖ్యమైన గోడలను గ్రానైట్ రాయితో నిర్మించారు. యుద్ధ సమయంలో ఈ కోట చుట్టు 60 ఫిరంగులను ఏర్పాటు చేసుకునేంత వీలుంటుంది.



శత్రువుల నుండి ముందుజాగ్రత్త రక్షణ కోసం ఇప్పుడంటే సిసి కెమెరాలున్నాయి, అలార్మ్ లు ఉన్నాయి కాని టెక్నాలజీ అంతగా లేని ఆ కాలంలో కొన్ని ప్రత్యేక చర్యల ద్వారా రక్షణ మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడేవరైన శత్రువులు రహస్యంగా చొరబడితే సైనికుడు ఒక చోటికి వచ్చి అరిస్తే కోటంతటికి ప్రతిధ్వనించేలా కోటను నిర్మించారు. అంతే కాకుండా ఈ ఖమ్మం ఖిల్లా నుండి ఓరుగల్లుకు రహస్య సోరంగ మార్గం కూడా ఉందని చరిత్ర కారులు వివరిస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న అతి పురాతన కోటలలో ఈ కోట కూడా ప్రధానమైనది.






