నీకు ధనవంతులు అంటే ఇష్టమా.? పేదవారు అంటే ఇష్టమా అని అడిగితే నేను "నాకు ధనవంతులు అంటేనే ఇష్టం అని నిర్మొహమాటంగా చెబుతా.. ఎందుకంటే డబ్బు సంపాదించడంలో పేదవారి కన్నా సంపన్నులకే ఎక్కువ మేధస్సు ఉంది కాబట్టి" -రాం గోపాల్ వర్మ.
నిజమే మనలో చాలామంది డబ్బు సంపాదించడం చేతకాక తమని తాము మంచివారమని డబ్బు సంపాదిస్తున్న వారంతా చెడ్డవారని సమర్ధించుకుంటూ ఎప్పటిలాగే సాధారణ జీవితం గడుపుతుంటారు. ఎవరన్నారు డబ్బు సంపాదించాలంటే అడ్డదారులు తొక్కాలని, ఇంకొకరిని మోసం చెయ్యాలని..? న్యాయంగా, ధర్మంగా వ్యాపారం చేస్తు అట్టడుగు స్థాయి నుండి అత్యన్నత స్థాయి వరకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో.. గ్రంధి మల్లికార్జున రావు గారు ఈ పేరు కన్నా GMR అంటే చాలు అతనెవరో తెలిసిపోతుంది మనకు. డబ్బు సంపాదించి వారసులకు ఆస్థిగా ఇవ్వడం మాత్రమే కాదు దేశ సేవకు కూడా ఎంతగానో ఉపయోగిస్తున్నారు. ఆయన మన తెలుగురాష్ట్రాలలోనే అత్యంత సంపన్నులు,10 క్లాస్ ఫెయిల్ ఐన విద్యార్ధి ఈ రోజు ప్రపంచం ఆశ్చర్య పోయేలా వేలకోట్ల బిజినెస్ చేస్తున్నారు ఆయన సాగిస్తున్న ప్రయాణం గురుంచి తెలుసుకుందాం.
టెన్త్ ఫేయిల్: మల్లికార్జున్ గారిది శ్రీకాకుళం జిల్లాలోని రాజం స్వగ్రామం. అమ్మనాన్నలు బంగారం వ్యాపారం చేసేవారు. ఏడుగురు అన్నదమ్ములలో ఆయన ఒకరు. చిన్నప్పటి నుండి మల్లికార్జున్ గారికి చదువు కన్నా ఆటలు, సినిమాలంటే ఇష్టం ఉండేది. దాని వల్లే టెన్త్ ఫేయిల్ అవ్వడం, ఆ తర్వాత నాన్న చేస్తున్న వ్యాపారం చూసుకున్నారు. కాని రెండు సంవత్సరాల తర్వాత "ఏ రంగంలోనైనా రాణించాలన్నా చదువు ఎంతో అవసరం" అని తెలుసుకుని మళ్ళి టెన్త్ పరీక్షలు రాసి పాసవ్వడం, ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం చకచకా జరిగిపోయాయి.
మొదటి జీతం రూ500: చదువు పూర్తికాగానే ముందుగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడదామని అనుకున్నా గాని నాన్న అందుకు ఏ మాత్రం ఒప్పుకోకపోవడంతో 500రూపాయల జీతంతో రాజమండ్రి పేపర్ మిల్ లో ఉద్యోగం మొదలుపెట్టారు. కాని తన స్థానం ఇది కాదని ఆ ఉద్యోగం ఎంతమూ నచ్చక మూడు నెలలోనే జాబ్ మానేశారు. ఆ తర్వాత మరో ఉద్యోగం చేసినా గాని అది కూడా ఏ మాత్రం నచ్చకపోవడంతో కొన్ని రోజులకే మానేశారు.
మొదటి వ్యాపారం: పేపర్ మిల్ లో పనిచేస్తుండగానే కొన్ని వ్యాపార మెళకువలు తెలుసుకోవడం, ఆనాటి పరిస్థితులకు ఇదే మంచి వ్యాపారం అని చెప్పి శ్రీకాకుళం జిల్లాలోని రైతుల దగ్గర కొని దానిని నాగ్ పూర్, చెన్నై లాంటి రాష్ట్రాలలో అమ్మేవారు. శ్రీకాకుళం చుట్టు ప్రక్కల ప్రాంతంలో 'జూట్' ఎక్కువ దొరుకుతుండేది కాని వీటిని ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదు. దీనిని గుర్తించిన మల్లికార్జున్ గారు 1978లో సుమారు 50లక్షల పెట్టుబడితో రాజాంలో జూట్ మిల్ ను స్థాపించారు. అది భయంకరమైన సక్సెస్.. అటు రైతులు ఇటు వ్యాపారస్తులు ఇద్దరికి లాభం వచ్చేసింది. దీనిలో వచ్చిన లాభాల వల్ల స్టీల్ రోలింగ్ మిల్, ఇంకో జూట్ మిల్ లాంటి ఎన్నో కంపెనీలను స్థాయించారు.
GMR Brand: ఇయర్ బడ్స్ నుండి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వరకు ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు. దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే GMR అంటే ఒక బలమైన నమ్మకాని ఏర్పరుచుకున్నారు. ప్రపంచంలో 349వ అత్యంత సంపన్నుడిగా, భారతదేశంలోనే 13వ సంపన్నుడిగా(సోర్స్:వికీ) వెలుగొందుతున్నారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సామాన్యులు ఇలా ఇంతలా ఎదగడం అనేది ఆయనలో వెలుగుతున్న శక్తికి నిదర్శనం.
వరలక్ష్మీ ఫౌండేషన్: "మనం ఏది సాదించినా గాని దానికి కారణం ఈ సమాజమే, మనల్ని ఇంత ఎదిగేలా చేసిన సమజానికి ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి - GMR.
డబ్బు సంపాదించడం అందరూ చేయగలుగుతారు కాని వాటిని ఖర్చుపెట్టడంలో ఉన్నతులు మాత్రమే సక్సెస్ అవుతారు. వివిధ వ్యాపారాలో మంచి లాభాలు రావడంతో వాటి ద్వారా కొత్త సంస్థలు స్థాపించడం మాత్రమే కాదు అర్ధాంగి వరలక్ష్మి గారి పేరు మీద "వరలక్ష్మీ ఫౌండేషన్" ను స్థాపించి దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ఉపాది శిక్షణ, అనాధలకు చదువునందించడం లాంటి ఎన్నో గొప్ప సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఊరిలో ఐతే తన సంస్థ ఉంటుందో ఆ ఊరిలో ఖచ్చితంగా తన ఫౌండేషన్ ద్వారా సేవలు అందించడం మొదలుపెట్టారు. బిజినెస్ లో సక్సెస్ సాధించడం వల్ల వచ్చే ఆనందం కన్నా తన వల్ల ఇంకొకరి జీవితం ఉన్నతంగా మారినప్పుడే మరింత ఎక్కువ ఆనందం ఆయనకు కలిగేది.