అచ్చ తెలుగు కుటుంబ కథా చిత్రం గుండమ్మ కథ ఏం గుండక్కా ! అంతేగా...
కొన్ని సినిమాలు మొదలైన కొన్ని క్షణాలకే కంపరం తెప్పిస్తాయి, మరికొన్ని అప్పుడే అయిపోయిందా అనిపిస్తాయి. సినిమాల్లో హిట్టు, సూపర్ హిట్టు, ఫట్టు, చూడొచ్చు, రిపీట్ బొమ్మ...ఇలా కొన్ని వర్గీకరణలు ఉన్నాయి. ఐతే వచ్చిన ప్రతీ సినిమా ఈ వర్గీకరణ చట్రంలో ఇమడదు, కొన్ని అజరామర చిత్రాలు ఉంటాయి. వాటిని ఎప్పుడు చూసినా మన కథే అనిపించే అనుభూతినిస్తాయి. అలాంటి వాటిలో ఠీవిగా కూర్చునే అతికొద్ది సినిమాల్లో ఒకటి మా గుండక్క కథ.. అదే అదే గుండమ్మ కథ.
గుండమ్మ కథ అనే పేరులోనే సినిమాలో హీరో ఎవరో తెలిసిపోతుంది. ఒక పాత్ర గొప్పదనం ఎలా తెలుస్తుందంటే ఆ పాత్ర కి వాళ్ళు తప్ప ఇంకెవర్ని ఊహించలేనప్పుడు. ఇందులో గుండమ్మగా సూర్యకాంతమ్మ గారి నటనని పునఃసృష్టించే నటి దొరక్క ఎప్పుడో చేద్దాం అనుకున్న రీమేక్ ఇప్పటికీ పాత రీలుడబ్బాలలోనే ఎదురుచూస్తుంది. హీరో, హీరోయిన్స్ కాకుండా గుర్తుండిపోయే మరో పాత్ర ఘంటయ్య. అబ్బో! ఆ పాత్రని వాడుకొని, సందర్బం దొరికినప్పుడల్లా ఆ నాటి సమాజాన్ని దులిపి పారేశారు కామేశ్వరరావు గారు. ఇలా చెప్తూ పొతే... ఇప్పట్లో అవ్వదు... పాయింట్ కి వచ్చేదాం...
చిత్రీకరణ విషయాలు:
1. మన విజయ వాహిని వాళ్ళు తీసిన మొట్టమొదటి అనువాద కథరా ఇది. జానపద బ్రహ్మ విటలాచార్య గారి 'మనే తుంబిడ హెన్ను(1958)' అనే కన్నడ చిత్రం మన తెలుగు వాళ్ళకి నచ్చేలా చక్రపాణి గారు మార్పులు చేసారు.
2. విజయ వాహిని సంస్థ గురించి, మహానుభావులు చక్రపాణి, నాగిరెడ్డి గారి గురించి మనమేం చెప్పగలం. ఆ ఠీవీ, ఆ స్థాయి ఇప్పటి తరానికి ఎప్పటికి అర్ధం అవ్వాలి.
3. C. పుల్లయ్య, B.N.రెడ్డిగారిని దర్శకులుగా అనుకుంటే అవకాశం చివరకి పౌరాణిక చిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారికి దక్కింది. ఆయన ఈ సాధారణ కథని, అసాధారణ కథనంతో అత్యద్భుతంగా చిత్రీకరించారు.
4. ఇప్పుడయ్యుంటేనా #NTR100, #ANR99 tags facebook, twitter trends తో డంగయ్యిపోయేవి. ఈ సినిమా తమిళ్ వెర్షన్ తో #ANR100 అయిపొయింది.
5. విజయ సంస్థ ఆస్థాన కథారచయిత పింగళి నాగేంద్ర రావు గారు ఈ చిత్రానికి కేవలం సాహిత్యం మాత్రమే అందించారు. కథని చక్రపాణి గారు కూర్చితే, సంభాషణలు నరసరాజు గారు అందించారు. లేచింది నిద్ర లేచింది లో అప్పుడప్పుడే పైకి లేస్తున్న స్త్రీ సమానత్వం గురించి, ప్రేమ యాత్రలకు, అలిగిన వేలనే చూడాలి వంటి పాటలలో ప్రేమికుల భావాలను, మనిషి మారలేదు లో సమాజం పోకడ, సన్నగ వీచే చల్లగాలికి... అబ్బో... పింగళి గారు మీరు రచయితలలో కోహినూర్ అండి అంతే.
6. నరసరాజు గారి సంభాషణలలో హాస్యం, వెటకారం, ఆధిపత్యం, ఆత్మ గౌరవం, తత్త్వం, నీతులు ఇలా ఒక్కటి లేనిది లేదంటూ అన్నీ వినిపించాయి. ముఖ్యంగా ఘంటయ్యగా రమణారెడ్డి గారు పలికిన ఒక్కో మాటా ఆనాటి పరిస్తితులను ఎత్తి చూపడమే కాకుండా, విమర్శ, పరిష్కారం రెండు చూపించింది.
7. ఘంటసాల గారి సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలా గురు. ప్రేమయాత్రలకు, లేచింది నిద్ర లేచింది, మనిషి మారలేదు, కోలో కోలోయన్న వంటి ఆణిముత్యాలన్నీ ఈ చిత్రం కోసం స్వరపరిచినవే.
గుండమ్మ కథలో చమక్కున మెరిసిన కొన్ని...
ఓహో! ఇది ఇప్పటిది కాదన్న మాట, తరతరాలుగా సాగుతున్న తంతేనన్నమాట. ఘంటన్నా ఇప్పటికీ ఇలానే ఏడ్చాయ్ వార్తా పత్రికలు. ఎప్పటికీ మారవేమో !
సినిమాలో ఘంటన్న ఈ డైలాగ్ చెప్పే విధానం చూడాలి, ఆయన హావభావం, పద విరుపులు, స్వరాన్ని వాడిన తీరు... సినిమా కాదు మన ఎదురుగా నిల్చొని మాట్లాడుతున్నట్టు ఉంటుంది.
ఈ సామెతల వెనుక ఎంత గొప్ప అర్ధం ఉందో! ఏదైనా మాట జారేముందు ముందు వెనుకా చూసుకోవాలి, మనాళ్ళ మీద అందరి ముందు అరిచేస్తే అలుసయ్యేదెవరు !?
ఈ విషయం తెలీక చాలా చోట్ల దద్దమ్మలా వచ్చేస్తున్నాం ఘంటన్నా. ఈ సారి వాడదాం, మామూలుగా దివిటీలా కాదు మండుతున్న అగ్నిగోళంలా.
ఇలాంటి నీతులు, నిజాలు బోలెడు రాసారు పింగళి గారు. అర్ధం చేసుకోగలవారు పాటించండానికి ప్రయత్నించండి.
సన్నగ వీచే చల్ల గాలికి కనులు మూసినా... ఈ పాటని మాంచి సౌండింగ్ తో వినండి. ఘంటసాల గారు _/\_, పింగళి గారు ____(సాష్టాంగ నమస్కారం).
అద్గదీ మాటంటే! వెయ్యరా లక్ష వీరతాడ్లు.
కుదిరితే మీరు కూడా ఓ సారి గుండక్కని పలకరించండి.