మన పూర్వీకులు ప్రతి సాంప్రదాయాన్ని, వ్యవస్థను ప్రజల అభ్యున్నతి కోసం మొదలుపెట్టారు. కాని కొంతమంది నీచులు ఆ వ్యవస్థను తమ స్వార్ధానికి అనుగూనంగా ఉపయోగించుకుంటున్నారు. అలా పతనమైన వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ కూడా ఒకటి. నాయకుడు అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని గతంలోనో, సినిమాల్లోనో, లేదంటే కథల్లోనే చూస్తున్న ఈ కాలంలో గుంటూరు జిల్లా పెదకాకాని ఊరి సర్పంచ్ వీరరఘవమ్మ నిజమైన నాయకత్వానికి పరిపూర్ణ ఉదాహారణగా మన కాలంలో జీవిస్తున్నారు. 78సంవత్సరాల ఆ అమ్మ జీవితం, వ్యక్తిత్వం గురించి మరింత ప్రస్పుటంగా తెలుసుకుందాం.
భర్త అడుగుజాడల్లో...
వీర రఘవమ్మ భర్త దశరథ రామిరెడ్డి గారు కూడా ఇంతకుముందు పెదకాకానికి సర్పంచ్ గా సేవలందించారు. దశరథ రామిరెడ్డి గారు ఆ ఊరికి సర్పంచ్ గా ఎన్నిక కాకముందు ప్రజలు మంచినీటి కోసం విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కునేవారు. సర్పంచ్ గా ఎన్నిక కాగానే యుద్ధ ప్రాతిపదికన వాటర్ ట్యాంక్ ను నిర్మించి ప్రజలకు నిజమైన నాయకత్వానికి అర్ధాన్ని తెలియజేశారు. వీరరఘవమ్మ గారి వయసు(78) చూసి తనకు సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది అని అనుకుంటే పోరాపాటు పడ్డట్టే. రాఘవమ్మ గారు 2013లో పోటి చేసి ఆంధ్రప్రదేశ్ లోనే రెండో అతిపెద్ద మెజారిటీతో గెలుపొందారు.
అమ్మలాంటి అనురాగం:
పెదకాకాని ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక జనాబా(30,000+) ఉన్న పంచాయితీ. మెదటి ఎన్నికలోనే అంతటి మెజరిటీతో గెలుపొందారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ ఊరి ప్రజలు తనమీద ఎంతటి నమ్మకం పెట్టుకున్నారో అని. ఆ నమ్మకం స్థాయిని అందుకోవడం కాదు ప్రజల ఊహకుమించిన వ్యక్తిత్వంతో, ప్రేమతో సమస్యలను పరిష్కరించే తీరు నేటి నాయకులకు ఓ డిక్షనరీ అనే చెప్పుకోవాలి.
పనీతీరు ఎలా ఉంటుంది.?
వీరరఘవమ్మ గారు ప్రతిరోజు సరైన సమయానికి పంచాయితీ ఆఫీసుకు టిఫిన్ బాక్స్ తో వస్తారు. పంచాయితీ ఆఫీసుకు వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆత్మీయంగా పలుకరిస్తూ వారి సమస్యల గురించి కులంకుషంగా తెలుసుకుంటారు. నెలలు కాదు కదా రోజుల తరబడి ఎదురుచూడనివ్వకుండా వెంటనే రంగంలోకి దిగి కొన్ని గంటలలోనే సమస్యల మెడలు వంచుతారు. తాను చెయ్యాల్సిన పనులన్ని వివరంగా ఓ డైరీలో రాసుకుంటారు. ఈరోజు ఎక్కడైనా సంతకాలు పెట్టాల్సి ఉంటుందా.? అని సిబ్బందిని తానే స్వయంగా అడిగి సాధ్యమైనంత వరకు పనులన్ని త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు. దశరథ రామిరెడ్డి తల్లి పేరమ్మ గారి నుండి కూడా ఆ కుటుంబం సమజానికి ఎంతో చేస్తుంది. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి కాక ఇంత ఆస్థిని మేమేమి చేసుకుంటామంటూ, కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరిని సమభావంతో చూడడం వారికి ఎనాటి నుండో అలవాటైపోయింది.
కుటుంబ నేపధ్యం:
రఘవమ్మ గారి రెండో కుమారుడు అయేధ్య రామిరెడ్డి గారు రామ్ కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి వ్యవస్థాపకులు, మూడో కుమారుడు మంగళగిరి ఎమ్మెల్యే రామాకృష్ణ రెడ్డి గారు, మరో కుమారుడు పేరిరెడ్డి గారు వ్యాపారవేత్త. ఆర్ధికపరంగా ఏ లోటు లేదు. ఈ వయసులో విశ్రాంతి తీసుకుంటూ ఓ ఫౌండేషన్ స్థాపించి సేవచేయవచ్చు. కాని రాజకీయాల ద్వారానే సేవచేయాలి అనే అమ్మ వ్యక్తిత్వం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు.
ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా..
ఒకానొక సందర్భంలో కాంట్రక్ట్ ఉద్యోగులకు జీతం రాకుంటే తనే స్వయంగా వారికి జీతమిచ్చారు. మరొక సందర్బంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు ఆలస్యమవడంతో సొంత ఇళ్ళులేని నిరాశ్రాయులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయి ప్రతి ఇంటికి 15,000 రూపాయాలు చెల్లించి ఇళ్ళ నిర్మాణాలు పూర్తిచేశారు. విద్యార్ధుల కోసం ఆర్ధిక సహాయం అందించడం దగ్గరి నుండి తుఫాన్ లో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం వరకు ఓ కన్నతల్లి లా వ్యవహరించడం తన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం.
నా జీవితంలో ప్రజలే నాకు మొదటి స్థానంలో ఉంటారు కుటుంబం పిల్లలు రెండు స్థానంలో ఉంటారు అని చేతలలో నిరూపించే వీరరఘవమ్మ గారి పేరు దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవారు.