Contributed by Raviteja Ayyagari
హైదరాబాద్...triumph కాలేజీ... సమయం...సూర్యుడు అస్తమించిన కొద్ది క్షణాల తర్వాత... సీత కాలం... ప్రద్యుమ్న triumph కాలేజీ లో లెక్చరర్. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చెయ్యడం, సాయంత్రం స్నేహితులతో ఒక గంట సేపు కబుర్లు చెప్పడం, ఇంటికి వెళ్లి కుటుంబం తో గడపడం. ఇదే అతని దినచర్య. అలాగే ఆ రోజు కూడా గడుపుదాం అనుకుని, బండి స్టార్ట్ చేయబోయాడు. అప్పుడే ఒక ఆక్సిడెంట్ జరిగింది. చుట్టూ జనం పోగయ్యారు. ప్రద్యుమ్న గాయపడిన ఆ మనిషిని చూసి ఒక్కసారి గా అవాక్కయ్యాడు. తను జీవితం లో అనుకున్నవన్నీ సరిగ్గా జరిగి ఉంటె, ఆ అమ్మాయి ఇతన్ని పెళ్లి చేసుకుని అర్ధాంగి అయ్యేది. కానీ ఇలా అర్థాంతరంగా ఒక అపరిచితురాలి లాగా ఆక్సిడెంట్ లో మళ్ళీ కలుస్తాడు అని అనుకోలేదు. సంక్రాంతి సమయం కావడం వాళ్ళ నగరం అంత ఖాళీ అయ్యి, సరైన సమయానికి అంబులెన్సు వచ్చింది. అందులో ఎక్కించి తను కూడా వెళ్ళాడు. హైదరాబాద్...కేర్ హాస్పిటల్... సమయం...సూర్యుడు పూర్తిగా వెళ్ళిపోయి చంద్రుడు వచ్చిన సమయం... సీతా కాలం... నిశాంత్: రేయ్! ఏంటి రా అర్జెంటు గా రమ్మని ఫోన్ చేసావ్? ప్రద్యుమ్న: కిన్నెర కనిపించింది రా. కనిపించకూడని పరిస్థితులలో, ఆక్సిడెంట్ అయ్యి కనిపించింది. ఇక్కడికి చేర్పించి నీకు కాల్ చేశాను. నిశాంత్: ఉఫ్! ఇదిగో, మళ్ళీ పాత జ్ఞపకాలు గుర్తు తెచ్చుకుని ఇప్పుడే వెలుగులోకి వచ్చిన జీవితాన్ని మళ్ళీ చీకటి చేసుకోకు. బిల్ కట్టేసి, వెళ్ళిపోదాం పద. ప్రద్యుమ్న: నేను మారిపోయాను రా! కానీ మాకు వీడ్కోలు సరిగ్గా జరగలేదు. తనకి సరైన వీడ్కోలు ఇచ్చేసి వెళ్ళిపోదాం. నిశాంత్: నీ ఇష్టం. కానీ. అప్పుడే డాక్టర్ వచ్చారు. డాక్టర్: She is doing fine. Just a small hairline fracture and a few small stitches. You can go and visit her. By the way, she is pregnant. వొంట్లో అసలు శక్తి లేదు. ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళు వస్తే చెప్పండి. Tell them to take good care of her. ప్రద్యుమ్న ఆ మాట విని తన గది వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. వేసే ఒక్కో అడుగుకి, కిన్నెర తనతో ఆఖరి సారి మాట్లాడిన ఒకొక్క మాట ప్రతిధ్వని లాగా వినిపించింది. 4 సంవత్సరాల క్రితం... హైదరాబాద్...ప్రద్యుమ్న వాళ్ళ ఇల్లు... వేసవి కాలం... కిన్నెర (phone): నన్ను మర్చిపో ప్రద్యుమ్న. ప్రపంచంలో ప్రతి ప్రేమ జంట తన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంది. అలా అనుకున్న ప్రతి జంట, భవిష్యత్తు ద్వారం వరకు వెళ్ళలేదు. మన జంట కూడా అంతే. మా నాన్న కోసం, మా అమ్మ ఆఖరి కోరిక కోసం నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నన్ను క్షమించు. ప్రస్తుతం... కిన్నెరని చేర్చిన గది... అలా అన్ని మాటలు, అన్ని అడుగులు ఒకే సారి పయనించిన తర్వాత, కిన్నెరని చేర్చిన గది తలుపు తడబడుతూ తెరిచాడు. మాట లో బెరుకు ఉన్న, గుండెలో ధైర్యం లేకపోయినా, ప్రయత్నం చేసి పిలిచాడు. కిన్నెర తనని చూసి నివ్వెర బోయింది. ఒకరిని ఇంకొకరు చూసుకున్న తర్వాత కన్నీటి తుఫానులు రెండు మొదలయ్యాయి. కొంచం సేపటి తర్వాత... కిన్నెర: ఎలా ఉన్నావ్ ప్రద్యుమ్న? ప్రద్యుమ్న: బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావ్? కిన్నెర: బానే ఉన్నాను. చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి. ప్రద్యుమ్న: అవును. అన్ని అనుకున్నట్టు జరిగి నీకు నాకు పెళ్లి అయ్యి ఉంటె, మనకి ఈ పాటికి స్కూల్ కి వెళ్లడం మొదలు పెట్టె అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉండేవారు. అన్ని చాలా రోజులు అయ్యింది. సర్లే. ఏంటి సంగతులు? మీ ఆయన ఎలా ఉన్నారు? పిల్లలు ఉన్నారా? అన్నట్టు, కంగ్రాట్స్. నువ్వు అమ్మ కాబోతున్నావ్ అంట. కిన్నెర ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఏడ్చేసింది. ప్రద్యుమ్న కి ఎం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఈ లోపులో తలుపు తెరుచుకుని ఒకావిడ వచ్చారు. మేరీ: కిన్నెర! ఎలా ఉంది అమ్మ? మీరు? ప్రద్యుమ్న: నా పేరు ప్రద్యుమ్న. మేరీ: కొంచం సేపు తనని రెస్ట్ తీసుకోనివ్వండి. పదండి, బయటకి వెళ్దాం. ఇద్దరు బయటికి వెళ్లారు... మేరీ: ఈ ఆక్సిడెంట్ లో ఆ అమ్మాయి పోయినా బాగుండును. ప్రద్యుమ్న ఒక్కసారిగా కోపంగా చూసాడు. మేరీ: నేను చర్చి లో పని చేస్తూ ఉంటాను. ఆ చర్చికి తను పని కోసం వచ్చింది. హిందూ అమ్మాయి అయినా, ఇతర మతాల మీద తన భక్తిని చూసి నేను పని లో పెట్టుకున్న. చాలా చురుకుగా ఉండేది. 2 నెలల క్రితం తాళి కట్టిన భర్త, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఇద్దరు చనిపోయారు. 1 నెలల క్రితం ఉన్న తండ్రి కూడా పోయాడు. అప్పటి నుంచి జీవచ్ఛవంలా బ్రతుకుతోంది. నా అనే వాళ్ళు ఎవరు లేక ఎంత అల్లాడిపోతోందో నాకు తెలుసు. నీ గురించి కూడా చెప్పింది. నీకు అన్యాయం చేసానని, అందుకే దేవుడు తనకి ఈ శిక్ష విధించాడు అని బాధపడేది. అందుకే అలా అన్నాను. తప్పుగా అనుకోవద్దు. ఆ మాటలు విని ప్రద్యుమ్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జరిగింది నిశాంత్ కి చెప్పాడు. ప్రద్యుమ్న: దేవుడు ఎంత క్రూరుడురా! ప్రాణం పోసిన తల్లిదండ్రులని దూరం చేసేసాడు, ప్రేమించిన నన్ను దూరం చేసేసాడు, పెళ్లి చేసుకున్న భర్తని దూరం చేసేసాడు, పుట్టిన బిడ్డని దూరం చేసేసాడు. ఏం పాపం చేసింది రా తను. ఇప్పుడు తల్లి కాబోతోంది. తండ్రి లేకుండా పూటబోయే బిడ్డని ఎలా పెంచుతుంది? ఎలా పోషిస్తుంది? నిశాంత్: నేను ఒక మార్గం చెప్పనా? కిన్నెరని పెళ్లి చేసుకో. తనకి మళ్ళీ జీవితం లో ఆనందం అందించు. ఇప్పుడు తను నీ బాధ్యత. లేకపోతే, నువ్వు పని చేసే కాలేజీ దగ్గరే ఆక్సిడెంట్ అవ్వడం ఏంటి? ఒకసారి ఆలోచించు. ప్రద్యుమ్న ఆలోచిస్తూ కిన్నెర గది లోకి వెళ్ళాడు. ప్రద్యుమ్న: కిన్నెర! నాకు మేరీ గారు అంతా చెప్పారు. కిన్నెర ఏడుపు మొదలుపెట్టింది. ప్రద్యుమ్న: నన్ను పెళ్లి చేసుకో కిన్నెర. కిన్నెర కళ్ళు పెద్దది చేసి చూసింది. ప్రద్యుమ్న: నీ మీద జాలితో కాదు, నీ మీద ప్రేమతోనే అడుగుతున్నాను. నీ గురించి తెలిసాక కూడా, నిన్ను ఇలా వదిలేయడం నా ప్రేమ కి పెద్ద మచ్చ లాగా మిగిలిపోతుంది. వీడ్కోలు సరిగ్గా జరగలేదు అనుకున్నాను కానీ, అసలు వీడ్కోలే అవసరం లేదు అని ఇప్పుడే అర్థం అయ్యింది. మన ప్రేమని గెలిపించుకోవడానికి, మన భవిష్యత్తు ద్వారం వైపు అడుగు వెయ్యడానికి దేవుడు మళ్ళీ మనకి అవకాశం ఇచ్చాడు. మన జంట కి భవిష్యత్తు ఉంటుంది కిన్నెర. అది చాలా అందంగా ఉంటుంది. ఆ మాటలు విని కిన్నెరకి ఆనంద భాష్పాలు వచ్చాయి. ప్రద్యుమ్న ని దగ్గరకి పిలిచి నుదుట మీద ముద్దు పెట్టి, తన వొళ్ళో తల పెట్టుకుని సంతోషంగా నిద్రపోయింది.