దాదాపు 600 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ కథ. అద్వితీయ్యమైన భగవంతుని కృపకి, స్వచ్చమైన భక్తుని ప్రేమకి, అనంతమైన మనిషి మూర్కత్వానికి నిదర్శనంలా నిలిచిన కథ. మానవ తాత్విక మేధస్సు ఎన్ని లక్షల యుగాలు శ్రమించినా, ఎన్ని కోట్ల పరిశోధనలు జరిపినా అర్ధం చేసుకోలేని కథ.
ఉత్తర భారతం నుండి తిరుమల దర్శనానికి వచ్చాడు శ్రీ రామునికి పరమ భక్తుడైన బావాజీ. ఆలయంలో స్వామివారి మంగళ సుందర స్వరూపాన్ని మొదటిసారి దర్శించగానే, స్వామివారి దర్శనం లేక ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వెళ్ళిపోయాడు బావాజీ. అందుకే, తిరుమలలోనే స్వామివారి ఆలయానికి దగ్గరలో ఒక మటం నిర్మించుకొని, ప్రతీ రోజు స్వామి దర్శనం చేసేవాడు. స్వామిని చూస్తూ గంటల గంటలు, తన్మయత్వంలో అలానే నిలబడిపోయేవాడు. ప్రతీ రోజు ఇదే తంతు, దర్శనానికి రావటం, స్వామిని చూస్తూ తన్మయత్వంలో గంటలు గంటలు నిలబడి పోవటం. దీన్ని గమనించిన ఆలయ అధికారులు బావాజీ ప్రవర్తనను అనుమానాస్పదంగా పరిగణించి, బావాజి దర్శనానికి రాకూడదని నిశ్చయించారు. ఆ తర్వాత నుండి బావాజికి స్వామివారి దర్శనభాగ్యం దొరకలేదు. స్వామివారి దర్శనం తప్ప ఇంకేం చేయాలో తెలీని బావాజీ, ఆ నిర్ణయానికి తీవ్ర నిరాశకు లోనయ్యాడు. మటంలో కూర్చొని, అంతులేని దుఃఖంతో, తను చేసిన నేరం ఏమిటని, ఎందుకు ఇంత పెద్ద శిక్షని స్వామివారితో మొరపెట్టుకున్నాడు.
ప్రతీ రోజు ఒంటరిగా ఏం చేయాలో తెలీక, ఎదురుగా స్వామివారు ఉన్నట్టు ఊహించుకుంటూ తనతో తానె పాచికలు ఆడటం మొదలెట్టాడు. ఒక రోజు, బావాజీ గాడ నిద్రలో ఉండగా ఎవరో తట్టినట్టు అనిపించి లేచి చూసాడు. అఖిలాండ కోటి బ్రంహ్మాడ నాయకుడు బావాజీ ఎదురుగా నిల్చున్నాడు. బావాజీతో కలిసి పాచికల ఆటలో ఓడిపోయిన స్వామి, ఏదైనా వరం కోరుకోమన్నారు. సర్వ లోకాలను శాసించే స్వామి తనకు కనిపించటమే కొన్ని కోట్ల జన్మల పుణ్యం, అలాంటిది తనతో ఆడటం, వరం కోరుకోమనడం ఎటువంటి భాగ్యమో తెలిసిన బావాజీ, తుచ్చ మానవ ప్రాపకంలో పడిపోకుండా, ప్రాపంచిక విషయాలకు సంబందించిన వాటిని కోరుకోకుండా, ప్రతీ రోజు అదే భాగ్యం కావాలని కోరుకున్నాడు. ఇలా ప్రతీ రోజు, ఆలయ ద్వారాలు మూసిన తర్వాత స్వామి రావటం, బావాజీతో ఆడటం జరుగుతుంది. ఒకరోజు, స్వామి వారు హారం మరిచిపోయి వెళ్తారు. హారం పోయినట్టు గమనించిన ఆలయ అధికారులు వెతకటం ప్రారంభిస్తారు. స్వామి వచ్చినప్పుడు ఇవ్వాలని, ఆ హారాన్ని జాగ్రత్తగా దాచిపెడతాడు బావాజి.
బావాజీ మీద అనుమానంతో, హారం కోసం అతని మటంలో తనిఖీ చేస్తుంటారు. బావాజీ హారం తీసుకొచ్చి, స్వామివారు వస్తే ఇద్దామని దాచిఉంచాను అని చెప్పి వాళ్ళకి అందజేస్తాడు. ఆలయంలోనికి ప్రవేశించని అతని దగ్గరికి హారం ఎలా వచ్చిందని ఆరా తీస్తే, స్వామి తనతో ఆడుతూ మర్చిపోయి వెళ్ళారని చెప్తాడు బావాజీ. తరతరాలుగా పూజలు చేస్తున్నా తమకు దొరకని దర్శనం, బావాజీకి దొరకటం జీర్ణం చేసుకోలేని ఆలయ అర్చకులు అతన్ని దొంగగా ప్రకటిస్తారు. శిక్ష కోసం నవాబు సభలో హాజరు పరుస్తారు. స్వామి వారి దర్శనం, పాచికలు ఆడటం, హారం మర్చిపోవటం అంతా నవాబుకు విన్నవిస్తాడు బావాజీ. అతని వాదన నిజమని నిరూపించటానికి నవాబు అతనికో అవకాశం ఇస్తాడు. బావాజీని కొన్ని వందల చెరుకు గడలున్న పెద్ద గదిలో నిర్బందించి, ఒక్క రోజులో మొత్తం తినేయ్యాలని ఆదేశిస్తాడు.
బావాజీ ఏం చెయ్యాలో తెలీక స్వామివారిని ప్రార్ధిస్తాడు. ఐరావతం(తెల్ల ఏనుగు) బావాజీ ముందు ప్రత్యక్షమవుతుంది, ఘీంకారం చేస్తూ గదిలో ఉన్న చెరుకుగడలు మెత్తం తినేస్తుంది. ఆ ఘీంకారానికి బయపడిన సేవకులు, నవాబుకి సమాచారం అందిస్తాడు. బావాజీ, తనని రక్షించటం కోసం ఐరావత రూపం లో వచ్చిన స్వామి కాళ్ళకు నమస్కరిస్తాడు. నవాబు వచ్చేలోపు, ఐరావతం బావజీని బంధించిన గది తలుపు బద్దలుకొట్టి వెళ్ళిపోతుంది. నవాబు వచ్చేప్పటికి, ఐరావతం వెళ్ళిన వైపు చూస్తూ హాథీరాం, హాథీరాం...హాథీరాం అని జపిస్తుంటాడు బావాజీ. ఆ తర్వాతి నుండి ఆయన హాథీరాం బావాజీగా మారిపోయారు. బావాజీ చెప్పింది అంతా నిజమే అని నమ్మి, అతన్ని నిర్దోషిగా ప్రకటించి, ఆలయ నిర్వహణ మొత్తం బావాజీకి అప్పగిస్తాడు నవాబు. బావాజీ కోరిక ప్రకారమే స్వామివారి పాదపద్మాలను సేవించుకునే అదృష్టం కల్పించాడు శ్రీనివాసుడు. కొంతకాలానికి తిరుమలలోనే తన మటంలో జీవసమాధి అయ్యారు బావాజీ.
నాగార్జున, రాఘవేంద్ర రావు గారు కలిసి ఈ అపర భక్తుడి కథని, వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.