Contributed By: Kutti Subramanyam
"గుండెల్లో మండిపోయే బాధ ఉంచుకొని కళ్ళల్లో నీళ్లు ఇంకిపోవడం చూపించిన నాకు వాడు ఒక పాఠం నేర్పించ్చాడు. "Learn to master your emotions" అని అందరు చెప్తుంటే వినడమే. ఆ రోజు నేను వాడి కళ్ళల్లో చూసిన ఆ ఆఖరి కన్నీటి బిందువు, ఒక వేరే ప్రపంచాన్ని వేరే ఆలోచనా విధానాన్ని పరిచయం చేసింది. కలిసే పెరిగాం, పోటీ గా చదివాం, ఒక మంచి స్థాయి కి వచ్చాం, కష్టాలు, కన్నీళ్ళలో ఈదుతూ ఒడ్డుకి చేరుకుంటున్న రోజులవి. నవ్వుల ఆనందాలతో అమ్మ నాన్నల తో సరదాగా వెళ్లిన మొదటి యాత్ర ఆఖరిది అవుతుందని కలలో కూడా అనుకోలేదు. అయినా జీవితం లో అన్ని అనుకున్నట్లు జరిగితే, అది జీవితం ఎందుకు అవుతుంది? జీవిత కాలం పడుతుంది దాని అర్ధం తెలుసుకోవడానికి.
నలుగురు వెళ్లొచ్చిన రోజు నుంచి నాలుగు నెలలు పట్టలేదు నాలుగోలోకం లో నలుదిక్కుల నుంచి నల్లటి పిలుపు వినడానికి. లేని బాధను ఉంది అనుకొని ఉన్న ప్రేమ నుంచి దూరం గా పారిపోయే ఈ కాలం పిల్లల్లో కూడా వాడి లాంటి వాడు ఉన్నాడు. ఉన్న బాధను కూడా చంపుకొని, దొరకని చోట్ల ప్రేమను చూస్తూ నవ్వుతూ, ఏమి జరగలేదనే ధైర్యాన్ని అందరిలో నింపుతూ, పట్టున పందొమ్మిది సంవత్సరాలు కూడా నిండని వాడిని చూసి జాలి వేసింది. తర్వాత అర్ధం అయింది... ఒక సంవత్సరం వయసు పెరగడానికి 365 రోజులు పడుతుంది కానీ, జ్ఞానం తో కూడిన వయసు రావడానికి ఒక్క క్షణం చాలు. ఆ క్షణాన్ని ఎలా వాడుకున్నావు అనేది ముఖ్యం. వాడు స్ఫూర్తి తో కూడిన జీవితం వైపు పయనించాలని నిర్ణయం తీసుకున్నాడు. "మన చేతుల్లో లేనిది ఒకటి ఉంది. ఒక్కటి మాత్రమే! అన్నాడు". అక్షరాలా సత్యం పలికిన వాడు జీవితంలో ఇంకెన్నో సాధించాలి" అని కోరుతూ తమ్ముడంటే ప్రాణంగా చూసుకునే అక్క చెప్పిన మాటలు నా గుండెలకు హత్తుకున్నాయి.
ఆలోచిస్తే నిజం ఉంది అనిపిస్తోంది కదా. అవును, బాధ్యతలు తెలిసినవాడికే విలువలు తెలుస్తాయి. తప్పించుకునేవాడికి కాదు.
వాడి లాగే ప్రతి ఒక్కరికి విలువలు ఏంటో అర్ధమవ్వాలి. ప్రతి పని బాధ్యతతో నిర్వర్తించాలి. మన జీవితం మనమే జీవిస్తాం, కాకపోతే నలుగురితో కలిసి జీవిస్తాం. ఎవరూ రారు ఏది చెయ్యరు అని తెలుసుకున్న రోజు ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం ఏంటో బయట పడుతుంది ఆనాడే స్వతంత్రం సంతోషించే రోజు వచ్చినట్లు.
ఆశకి ఆలోచన తోడు శ్రమకి సాధన తోడు కష్టానికి ఫలితం తోడు జీవితానికి గమ్యం తోడు'
నీ నడకలొ, ప్రతి అడుగులొ ఆశలు కలిగిన, ఆకాంక్షలు కలిగిన ప్రశ్నలు పెరిగిన, పరీక్షలు పెరిగిన కలలు చెరిగిన, బ్రతుకే చిరిగిన
నీరు నిప్పు కల్గి ఉన్న పృథ్వి నింగి గాలిని వాడుకొ, పయనం ఆపకు, అలుపే చెందకు; ఊపిరి నింపుకొ, ధైర్యం పెంచుకొ శక్తి నిండిన కాలం గెలుచుకొ ఓపిక విలువను గుర్తు చేసుకొ ఒంటరి పదానికి అర్ధం తెలుసుకొ
ఎవరూ రారు, ఏదీ చేయరు!