జగ్గయ్యపేటలో మానసిక వికాలాంగులైన రమాదేవి, భార్గవి అనే ఇద్దరు పిల్లలకు రూ.10,000 ఆర్ధిక సహాయం చేసిన హెల్పింగ్ హార్ట్స్. ప్రత్తిపాడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిరుపేద మహిళ సావిత్రమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10,000 చెక్కును అందజేసిన హెల్పింగ్ హార్ట్స్. కొండగుంటూరికి చెందిన బాబు కిడ్నీ ఆపరేషన్ ఖర్చుల కోసం రూ. 30,000తో అండగా నిలిచిన హెల్పింగ్ హార్ట్స్.
ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో.. చీకటి ఉన్న చోటికె సూర్యుని ప్రయాణంలా అవసరం ఉన్న ప్రతిచోటుకు హెల్పింగ్ హార్ట్స్ వెళుతుంది. ఆత్మీయంగా పలకరించి మాటలతో, చేతలతో ధైర్యాన్ని నూరుపోస్తుంది. ఈ హెల్పింగ్ హార్ట్స్ సృష్టికర్త ఆకాష్.
"ఆకాష్ పదవ తరగతి చదువుతున్న సమయంలో కాకినాడ నుండి అన్నవరానికి బస్ లో వెళుతున్నాడు. దారిలో ఒక ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఓ చిన్నారి రెండు కాళ్ళు విరిగిపోయి ఏం జరుగుతుందో తెలియక ఏడుస్తుంది. చుట్టూ ఉన్న మనుషులు చూస్తూ ఉన్నారే తప్పా అనుకున్నంత వేగంగా కదలలేదు." అప్పుడే అనుకున్నాడు ఏదైనా చెయ్యాలని. అప్పటి నుండి తనకు ఇచ్చిన పాకెట్ మనీతో సహాయం చెయ్యడం మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలో మౌనిక, అనుదీప్, భార్గవ్, నిహారిక, ఫణీంద్ర మరికొందరు మిత్రులు తోడయ్యారు. అలా 2018లోనే హెల్పింగ్ హార్ట్స్ పురుడుపోసుకుంది.
హెల్పింగ్ హార్ట్స్ మొత్తం 15 బృందాలుగా ఏర్పడి ప్రతి చోటుకి చేరుకుంటుంది. దాదాపు 500కు పైగా ఉన్న వీరి వాలంటీర్లు రక్తదానం చేస్తుంటారు.. ప్రకృతి వైపరీత్యాలు జరిగితే సహాయకార్యక్రమాలలో పాల్గొంటారు.. చదువుకోసం, ఆరోగ్య అవసరాల కోసం బాధితులకు అండగా విరాళాలు సేకరిస్తారు.. పుట్టినరోజు వేడుకలకు, ఇతర పండుగలరోజులలో ఒంటరిగా జరుపుకోకుండా ప్రభుత్వ పాఠశాలలకు, అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు ఇస్తూ సంతోషాలను ఇచ్చి పుచ్చుకుంటారు.
టెక్నాలజీ ఊహకందకంత విస్తరించింది. దీనిని సరైన విధంగా టీం ఉపయోగించుకుంటుంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాకు సోషల్ మీడియా ద్వారా చేరుకుని ఆ ప్రాంతాలలోని ఔత్సాహిక యువతకు ఒక వేదిక కల్పిస్తుంది. లోకల్ గా ఉన్న అవసరాల కోసం "బ్లడ్ డొనేషన్, పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, మెడికల్ క్యాంప్స్, మొక్కలు నాటడం మొదలైన అవసరాలన్ని అందరితో పంచుకుని త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపెడతారు. పైన చెప్పుకున్న కిడ్నీ బాధితుడికి రూ.30,000 ఆర్ధిక సహాయం అందింది కూడా సోషల్ మీడియా ద్వారానే.
సమాజం మనకు నడక నేర్పించింది.. సమాజం మనకు మాటలు, భాషలు నేర్పించింది.. చదువు చెప్పి, మంచి బుద్దులతో సరైన మార్గాలలో నడిపిస్తుంది. ప్రయోజకులను చేసి ఉద్యోగం కల్పించింది. ఇంతచేసిన మన సమాజానికి జీతంలో జీవితంలో కొంతైనా భాగం కల్పించకుంటే ఎలా.?
ఆకాష్ కు ఎదురైన సంఘటనే మనలో చాలామందికి ఎదురయ్యింది, అల్పుడికి ఉపద్రవం ఎదురైతే కృంగిపోతాడు.. పట్టించుకోడు.. అదే ఒక దృఢమైన వ్యక్తికి ఉపద్రవం ఎదురయితే అది సమాజానికి మేలు జరుగుతుంది. ఆకాష్ కథనే ఇందుకు ఉదాహరణ.
Join with him: http://www.instagram.com/helping_hearts_foundations