దేశంలో దొంగలు పడ్డారు,నిజమే సూటు బూటు వేసుకొని,విలాసవంతమైన ఇళ్ళలో ఉంటూ, ఖరీదైన కార్లలో తిరుగుతూ పలుబడి, పరిచయాలు ఉన్న పేరుమోసిన పెద్దమనుషులు, విమానాల్లో ఊరేగేవాళ్ళు,మన ఊర్లేలే వాళ్ళు,చట్టాన్ని తమ చుట్టంగా చేసుకొని,వ్యవస్థలోని లోపాలను తమకి అనుకూలంగా మార్చుకొని, అప్పులు తీసుకొని దర్జాగా దేశాన్ని వొదిలి ధైర్యంగా బయట తిరుగుతూ అసలే పాపం ఎరగనట్టు,తాము ఏ తప్పూ చేయనట్టు హాయిగా బ్రతికేస్తున్నారు ఆ దొంగలు . దొంగలనే మాట కూడా తక్కువే ,ఆర్దిక నేరగాళ్ళు. వారి నుండి డబ్బు రాబట్టలేక,వాళ్ళని తిరిగి దేశానికి రప్పించలేక ,చట్టం ముందు దోషులుగా నిలబెట్టలేక మౌనంగా చూస్తూ ఉంది పోతోంది మన సమాజం.
బతక నేర్చిన ఆ బలిసినోళ్ళు బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీసే సగటు మద్య తరగతి మనుషుల కష్టాన్ని గద్దల్లా ఎత్తుకు పోతున్నారు . చెమట నంతా పోగు చేసి రక్త మాంసాలే పెట్టుబడిగా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఓ పూట పస్తులుంటూ మరీ రేపటి కోసం అవసరానికి ఉంటాయి అని కొన్ని కోట్ల మంది బ్యాంకులో దాచుకున్న రెక్కల కష్టాన్ని ఎవడో వచ్చి రాబందుల్లా ఎత్తుకు పోతుంటే వాడు ఎగబెట్టే సొమ్మంతా నా కష్టార్జితం అని తెలిసినా మౌనంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయుడిలా మిగిలిపోతున్నాడు సామాన్యుడు . అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతీ లావాదేవీలనీ ఓ కంట కనిపెట్టే వ్యవస్థ ,ఏడేళ్ళుగా ఒకడు బ్యాంకునే మోసం చేస్తుంటే కనిపెట్టలేకపోయింది.అప్పులు కట్టలేడని తెలిసీ కూడా మళ్ళీ అప్పు ఇచ్చి హాయిగా పెట్టేలన్నీ సర్దుకొని దేశం నుండి జారుకున్నాక నెమ్మదిగా తేరుకొని ఆ బరువుని ఎవరి నెత్తిన వేయాలో తెలియక తిరిగి మన మీదే వేసేస్తుంది.
ఆ పలుకుబడి ఉన్న దొంగ దొరలకి ఎలా చెబితే అర్ధం అవుతుంది,వాడు ఎగరేసుకుపోయిన ప్రతీ రూపాయి కేవలం డబ్బు కాదు,కరెన్సీ కట్టలు కావు,అది తన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం తండ్రి పెట్టుకున్న ఆశ,అనారోగ్యం వస్తే అవసరానికి ఉంటుంది అనే భరోసా,ఓ పేద వాడి అందమైన కలల ఇంటికి పునాది అని వాళ్లకి ఎలా చెబితే అర్ధం అవుతుంది .
తొమ్మిది వేల కోట్లని అప్పులుగా తీసుకొని అప్పనంగా విదేశాలకి చెక్కేసిన విలాస పురుషుడొకడు....17,600 కోట్లు బ్యాంకుకే తెలీకుండా నొక్కేసి దర్జాగా దేశాన్ని వొదిలి వెళ్ళిపోయినోడు ఇంకొకడు...ఓ విజయ్ మాల్య,ఓ లలిత్ మోడీ,ఓ జతిన్ మెహతా,ఓ నీరవ్ మోడీ,ఓ సంజయ్ భండారి ...,స్కాంలు వెలుగులోకి వస్తే చీకటిలోకి జారుకునే బడా బాబులు ఇంకెందరో...
ఒక మద్య తరగతి మనిషి బ్యాంకు ఎకౌంటులో ఒక్క రోజు కేవలం పది రూపాయిలు మినిమం బాలన్స్ లిమిట్ తగ్గితే నిర్దాక్షిన్యంగా ఫైన్లు వేసే బ్యాంకులు,(కేవలం ఆ జరిమానాలే 1771 కోట్లు,ఒక్క ఏడాదికి ) . అంత కచ్చితంగా ఉండే నియమాలు ఈ పెద్ద మనుషులకి ఎందుకు వర్తించవో ?? మన నేల పై సాగు చేసి మనకి అన్నం పెట్టె ఓ రైతు పంట నష్టంతో తీసుకున్న ఋణం కట్టడంలో కాస్త ఆలస్యం అయితే ఎలాంటి దయ లేకుండా ఆస్తులు జప్తు చేసే అధికారులు ఇక్కడ వేల కోట్లు అప్పులు తీసుకొని ఎక్కడో పరాయి దేశంలో పెట్టుబడి పెట్టె పారిశ్రామిక వేత్తలు ఆ అప్పులు కట్టకపోయినా వారి ఆస్తులని ఎందుకు అంత త్వరగా జప్తు చేయరో?? (తిరిగి వసూలు కాబడని మొండి బకాయిలు 7.34 లక్షల కోట్లుట)
నిజమే కదూ మర్చిపోయా...మనం సామాన్యులం ....అదిక సంఖ్యలో ఉన్న బలహీనులం ....అసమర్ధులం.....చేతకాని వాళ్ళం.......నిస్సహాయులం.....ఎవడు ఎన్ని కోట్లు కాగేసినా, ఎన్ని స్కాములు చేసినా ప్రధమ సాక్షులం మనమే....దోషులెవరైనా శిక్షలూ మనకే.....వాడు ఎగవేసే బాకీలకి వడ్డీలు కట్టేదీ మనమే....నియమాలు అన్నీ మనకే వర్తిస్తాయి,నిబంధనలు అన్నీ మనమే పాటించాలి,కడుపు మండి అరిస్తే మనది తిరుగుబాటు,గుండె పగిలి ఏడిస్తే దేశ ద్రోహం,ఎదురు తిరిగి ప్రశ్నిస్తే సంఘ వ్యతిరేకులం.....మనం కోపాలు,మన అసహనం అంతా మన మీదే మన మద్య తరగతి బతుకుల మీదే...... ఏదేమైనా తస్మాత్ జాగ్రత గురూ....దేశంలో దొంగలు పడ్డారు ....