నాపేరు ఎందుకు లేండి.. మాది విలువలు, సనాతన సాంప్రదాయాలకు ఎక్కువ గౌరవమిచ్చే అందమైన కుటుంబం. నేను పుట్టినప్పుడే నాకు భార్యను నిర్ణయించేశారు. చిన్నవయసులో నేను అందరిలానే ఉండేవాడిని కాని వయసు పెరుగుతున్న కొద్ది నా శరీరంలో కొన్ని మార్పులు మొదలయ్యాయి ఒక మగాడిగా ఉన్న నాకు అవి చాలా బాధ కలిగించాయి.. ఒంటరిగా ఎక్కడో దూరంగా కూర్చొని ఏడుస్తూ కూర్చుండేవాడిని నాలో ఇలా విచిత్రంగా జరుగుతున్న పరిణామాలకు ఏం చేయాలో ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు. అమ్మ నాన్నలకు, నా స్నేహితులతో కూడా చెప్పుకోలేక నాలో నేను ప్రతిరోజు కుమిలిపోయే వాడిని. ఒకరోజు డాక్టర్ గారిని కలిశాను నా గుండె పగిలిపోయేంతటి మాట ఆరోజు విన్నాను నేను మగ ఆడ కాని ఒక మూడో రకం మనిషిని అని..
ఇక ఆరోజు నుండి నా జీవితం మరింత భారంగా ఉండేది.. నా పరిస్థితి ఇది అని ఏ ఒక్కరితో చెప్పుకునే వాడిని కాను. నా 22 సంవత్సరాలకు నాకు పెళ్ళి చేయాలని మా అమ్మ నాన్న నిశ్ఛయించారు. నాకు ఆ అమ్మాయి జీవితం నాశనం చెయ్యడం ఎంతమాత్రం ఇష్టం లేదు.. కాని నా చిన్ననాడే ఆ పెళ్లికి అగ్రిమెంట్ కుదిరింది, పెళ్లి జరిగింది. కొన్ని సంవత్సరాలు గడిచింది. ప్రతిరోజు తనని మోసం చేస్తున్నాననే భావన నన్ను చీల్చిచెండాడేది, తన కోరికలను నేను తీర్చలేక పోయేవాడిని. తనని ముట్టుకున్నా ఒక అమ్మాయిని తకాను అన్న పరవశం కలగకపోయేది. నాకు పిల్లలను పుట్టించేంతటి శక్తి లేదు. ఇక లాభం లేదు ఎన్ని రోజులు ఇలా మోసం చేస్తు నమ్మించడం నావల్ల కాదు ఇక నా గురుంచి చెప్పాలని నిర్ణయించుకొని సంవత్సరాల పాటు నా గుండెలో దాచుకున్న వ్యధను గట్టిగా ఏడుస్తు భార్య, తల్లిదండ్రులతో సహా అందరికి చెప్పేశా.. ఇదంతా ఒక కలగా భావించి కొత్త జీవితం ప్రారంభించమని నా భార్యకు సూచించా..
బాధను పంచుకుంటే బాధలు తగ్గుతాయంటారు కాని నాకు మరింత పెరిగాయి.. ప్రేమ కన్నా పరువు మహా గొప్పది వారి దృష్టిలో నేను ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగా అంత వరకు నన్ను ప్రేమగా చూసిన తల్లిదండ్రులు నన్నుఅసహ్యంగా చూస్తు ఇంట్లో నుండి బయటకు గెంటేశారు.. ఇక ఏ ఆలోచన లేకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయా.. ఎలా బ్రతకాలో నాకు తెలియలేదు ఎన్నో ప్రదేశాలు తిరిగాను. నాలాంటి వాళ్ళను ఎంతోమందిని కలిశాను. ఒక ఫామిలీ నుండి దూరమైన నాకు మరొక ఫామిలీ దొరికింది నా బాధను అర్ధం చేసుకుంటున్న వారిని చూస్తుంటే ఆసరాగా అనిపించింది. పెళ్లిళ్ళలో భారాత్ డాన్స్ చేయడం నేను వృత్తిగా ఎంచుకున్నా. అప్పుడే నేను మరల పుట్టాను ఇదే నా జీవితం అంటూ కష్టపడ్డాను. కొన్నాళ్ళు గడిచింది. నేను కలలో కూడా ఊహించని సంఘటన ఆరోజు జరిగింది.. నా మాజీ భార్య నన్ను వెతుక్కుంటు నా దగ్గరకు వచ్చింది. చేతిలో చంటి బిడ్డతో నిస్సహాయతగా నన్ను చుస్తూ... "నా భర్త పెద్ద తాగుబోతు ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు వచ్చే డబ్బులన్నీ Prostitutes కి ఇచ్చేవాడు ఇదేమని అడిగితే రక్తం కారేలా కొట్టెవాడు" అంటూ బోరుమన్నది.
అలాంటి వ్యక్తి కన్నా ఒంటరిగా బతకడం మిన్నా అని విడాకులు ఇప్పించి తనకోసం ఒక రూం అద్దెకు తీసుకున్నాను. తనకు పుట్టిన బాబునే నా కొడుకుగా భావించి అన్ని ఖర్చులు నేనే భారించా.నేను వేరొక చోట ఉంటూ వారికి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నా సంపాదన అంతా వారికి ధారపోశాను నాకు ఎక్కడ దొరకలేని ఆనందం ఆ సహాయంలో దొరికింది. మంచి చదువుతో నా కొడుకుని ప్రయోజకుడిని చేశాను. ఈ మధ్యనే వాడు కోరుకున్న అమ్మాయితో నా సొంత ఖర్చులతో ఘనంగా పెళ్లి చేశాను.. నాకంటు ఈ ప్రపంచంలో ఏ బంధం లేదనుకున్నా కాని.. నా భార్య, బాబుతో ఆ గుండె కోత తీరింది. ఇది కల్పిత కథ కాదండి నిజంగా జరిగిన కథ.. ఓ హిజ్రా జీవితం ఇది.