'సత్యం శివం సుబహనల్లాహ్' - A Hindu Muslim Camaraderie!

Updated on
'సత్యం శివం సుబహనల్లాహ్' - A Hindu Muslim Camaraderie!
(Written by Saif Ali Syed) నేను ముస్లిం అయితే ఏమిటి? నువ్వు హిందువైతే ఏమిటి? నీ గుడిముందు బిచ్చగాళ్ళు హిందువులే అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు మసీదు ముందు ఫకీర్లు ముస్లిములే అయినా నేను హత్తుకోను. . నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా నేను ఎన్ని రోజా లు పాటించినా నువ్వు టాక్స్ ఎగ్గోట్టెందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను. . నీ మంత్రాలు సంస్కృతం అయినా నా సూరాలు అరబ్బి అయినా మన పిల్లల్ని ఇంగ్లీషు మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు నాకూ లేదు. . నువ్వు గుడికెళ్ళే దారిలో ఏ గుంతల రోడ్డులో ధక్కా ముక్కీలు తింటూ వెళ్తావో నేను అదే కంకర తేలిన నాసిరకం రోడ్డులో మసీదు కు వెళ్తాను. . నీ పండగలకు ఏ వెజ్ వంటలు చేసుకోవాలన్నా నా పండుగులకు ఏ నాన్ వేజ్ వంటలు వండుకోవాలనుకున్నా కిరాణ కొట్టులో ధరల పట్టికలు ఇద్దరికి భయపెడుతూనే ఉంటాయ్. . నువ్వు కళ్ళ మధ్య ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ నేను కళ్ళ లో ఏ సుర్మా పూసుకున్నా కానీ ఎవరి కళ్ళు కూడా ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయ్ . . నువ్వు నదులలో పుణ్య స్నానం ఆచరించాలన్నా నేను నదుల ఒడ్డున ఏ దర్గామసీదు లో వజూ చేసుకోవాలన్నా కలుషితమై ఎండిపోతున్న ఈ బురదనీళ్ళే మనకు దిక్కవుతుంటాయ్ . . నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా నేను ఏ పాయసం చేసుకోవాలనుకున్నా ఇద్దరి వి నీళ్ళ క్యాను కొనుక్కునే బతుకులై నిరీక్షిస్తుంటాయ్. . నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా నేను వాస్తు లేక ఇళ్ళు కట్టుకున్నా మన ఇంటి ముంగిట డ్రైనేజులు మన సహనాల్ని పరీక్షిస్తూనే ఉంటాయ్ . . పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవడం సారే జహాసే అచ్చా అని నేను పాడుకోవడమే కానీ స్వేచ్చగా ఊపిరి తీసుకోలేక పోల్యూషన్ కు ఇద్దరం ముక్కులు మూసుకోని తిరుగుతూనే ఉంటాం . . రోజూ గోమూత్రం తాగినందుకు నీకు ఎవడూ జీతం ఇవ్వడు పవిత్ర జం జం నీళ్ళు తాగినందుకు నాకు ఎవడూ తనఖా ఇవ్వడు నేను ఏ గడ్డం అరబ్ వాని వద్దకు వెళ్ళినా ఇదే స్వర్గాదపి గరియసి నువ్వు అనుకున్నా మనం చెమట చుక్కలు చిందించనిదే మనకెవడూ బువ్వ పెట్టడు. * నువ్వే పండుగ నవరాత్రులు చేసుకున్నా నేను ఏ పండుగ మాసాలు చేసుకున్నా బ్లాక్ మనీ దొంగల్ని ఏ దేవుడు కూడా పూర్తిగా పట్టుకోలేడు అని ఒప్పుకుంటాము . నీ సంప్రదాయం లో పిల్ల పెళ్ళిచేసినా నా తరీఖా లో బేటి పెళ్ళి చేసినా మా లో మంచోడు దొరుకుతాడొ లేదో అనే ఇద్దరం భయపడుతూ వెతుకుతుంటాం. . మనిద్దరికి తెలుసు వర్షాకాలం వస్తుందంటే కాగితం పడువల ఆనందం పోయి మన అపార్ట్మెంట్లు ఎప్పుడు మునుగుతాయో ఫికర్ నీకు ఉంది నాకు ఉంది . మనిద్దరికి తెలుసు నా గజల్ ఖవ్వాలి లాగే నీ తియ్యని ఆలాపన ఏదో ప్రమాదం లో ఉంది . మనమిద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది. * మనిద్దరికి తెలుసు నేను ముస్లిం అయితే ఏమిటి ? నువ్వు హిందువు అయితే ఏమిటి? మేం ఇద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటున్నది నువ్వు అమెరికా పోయినా నేను ఏ అరబ్ కు వెళ్ళినా we know where is our home అనే సత్యం . శివం . సుబహనల్లాహ్ అది.