కాస్త భూమి, కాస్త నీరు దొరికిందంటే ఎక్కడ పాతిపెట్టినా వట వృక్షమైపోవచ్చు. ఎక్కడో చంద్రగిరి మండలం తొండవాడ అనే దళితవాడకు చెందిన కొండా సుశీల గారు సామాజికంగా, ఆర్ధికంగా, జెండర్ గా వెనక్కి నెట్టివేయబడ్డ మహిళ. అమ్మ దేవదాసి, స్కూల్ లో జాయిన్ అయ్యే ముందు మీ నాన్న పేరేమిటి.? అన్న సందర్భం నుండి అడుగడున ఎన్నో అడ్డంకులు, ఎన్నో చిన్నచూపు చూసే సంఘటనలు, ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు.. కానీ అవన్నీ కొంత కాలమే.. ఎప్పుడైతే తన ప్రతిభ దేశ స్థాయిలో ప్రకాశితమయ్యిందో అనుభవించిన కష్టాలు ఇబ్బందులన్నీ తన బలాలయ్యాయి..
హాకీ స్టిక్: ఆరో తరగతిలో ఉన్నప్పుడు పీయిటి టీచర్ చేతిలో కాస్త డిఫరెంట్ గా ఉన్న కర్రను చూసింది. ఇదేంటి మేడమ్.? ఇది హాకీ స్టిక్ సుశీల, దీనితోనే మన నేషనల్ గేమ్ ఆడతారు! సుశీల గారి జీవితాన్ని ఆ ఒక్క హాకీ స్టిక్ మార్చివేసింది. హాకీలో నెమ్మదిగా ఓనమాలు దిద్దడం మొదలుపెట్టారు. హాకీ నేర్చుకుంటున్న కొద్దీ, ఇందులోని గొప్ప ప్లేయర్స్ గురించి తెలుస్తున్న కొద్దీ అమ్మ రేణుక గారిని , పుట్టిన ఊరికి గుర్తింపు తీసుకురావాలనే తపన కూడా పెరుగుతూ వచ్చేది.
అమ్మ స్వీపర్ గా, పనిమనిషిగా: అమ్మ రేణుక గారికి ఊహ తెలిసేనాటికే దేవదాసి. నలుగురు పిల్లలు గల ఇంటిని అమ్మ ఒక్కరే నడుపుతారు. అమ్మ నేను కూడా మీకు సహాయం చేస్తానని అంటే, మీరు బుద్దిగా చదువుకుని ప్రయోజికులు అవ్వండి అని అమ్మ బదులిస్తారు. అమ్మ తిరుపతి రుయా హాస్పిటల్ లో స్వీపర్ గా పని చేస్తూ వచ్చే ఆరువేల రూపాయలు కష్టంగా ఉండడంతో వివిధ ఇళ్లల్లో పనిమనిషిగా కూడా పనులు చేస్తూ చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. నాన్న ఎవరమ్మా.? ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు.? అని పిల్లలు అడిగే ప్రశ్నల ముందు మిగిలిన పనులు చాలా చిన్నగా ఉండేవి.
8th క్లాస్ నుండి: 6th లో నేర్చుకోవడం మొదలుపెట్టి 8th క్లాస్ వచ్చేసరికి జిల్లా స్థాయిలో హాకీ ఆడడం మొదలుపెట్టారు. అండర్-17 లోనే నేషనల్ లెవల్ లో ఆడడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు జిల్లా స్థాయిలో 23, జాతీయ స్థాయిలో 5 టోర్నమెంట్లు ఆడారు. ఇంట్లో సుశీల గారు అనే కాకుండా అన్న దినేష్ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు, చిన్న తమ్ముడు వెంకటేష్ ప్రస్తుతం చదువుకుంటూనే జిల్లా స్థాయిలో కబడ్డీ ఆడుతున్నారు, చెల్లి భూమిక రాష్ట్ర స్థాయిలో హాకీ ఆడుతున్నారు.
Source: Sakshi