మాములుగా మనకి 17 సంవత్సరాల వయస్సు వ్యవధి లో మనకి అంతర్మధనం మొదలవ్వుద్ది . మనం ఏమి చేయాలో , రాబోయే కాలం లో ఏమి అవ్వాలో కూడా అప్పుడే ఆలోచిస్తాం. "మనుషులు కదా .... మారతారు" అని మిర్చి సినిమా లో అన్నట్టు , కాలాన్ని బట్టి మనుషులు ఎలా మారిపోయారో , వాళ్ళ ఆలోచనలు ఎలా మారాయో ఒక చూపు (లుక్) వేసుకుందామా ?! ఇది ఒక 17 ఏళ్ల కుర్రాడి మనసులో మాట! అదే వయసు ఉన్న ఒక మనిషి తన చుట్టూ ఉన్న కాలం అనుగుణం గా ఎలా మారిపోయాడో చూద్దాం.
May 17th, 1917 :
ఊరిలో పరిస్థితులు ఏమీ బాగోలేదు . ఎప్పుడూ ఏదోక ఇంట్లో చావు కేకలే వినిపిస్తున్నాయి . అసలు వారెవరు మన సొంత గడ్డ ని పాలించడానికి ? మా పొలం మా హక్కు . వాళ్లెవరు అందులో వాటాలు అడగడానికి ? 50 ఎకరాల పొలం ఉండేదంట మా తాతయ్య కి అది కాస్తా ఇప్పుడు ఎనిమిది ఎకరాలు అయ్యింది . మావే కాదు అందరివీ ఇలా బలవంతంగా లాగేసుకున్నారు ఈ నీచమైన ఆంగ్లేయులు . ఇవన్నీ తలుచుకుంటుంటే రోజురోజుకీ ఒంట్లో రక్తం ఉడుకుతుంది . ఈ నెలాఖరున ఊరిబయట పండక్కి డబ్బు వసూలు చేయడానికి వస్తారు కదా , అక్కడ నరికేయాలి . ఈసారి ఆ నాగులు గాడితో గట్టి పన్నాగమే వెయ్యాలి . ఊరికి 10 మంది ఉంటారు వీళ్ళని వేసేస్తే పక్క ఊరివారికి కూడా ధైర్యం వస్తుంది . అలా మా వాడ ని ఆదర్శం గా తీస్కొని మిగిలిన ఊర్లు తయారవుతాయి . మొత్తానికి ఈ ఆంగ్లేయులు నా భారత భూమి ని వదిలి వెళ్లిపోయేలా చేయాలి . రేపే వెళ్లి మామిడి తోట లో ఆ నాగులు గాడిని కలుస్తా . కానీ నాన్నకి ఆరోగ్యం బాలేదు . అమ్మ గుమాస్తా గారి ఇంట్లో పనికి పోయి ఎప్పుడో వస్తుంది . నేనూ చదువుకుంటే బావుండేది . పోనీ లే అన్నయ్యలు చదువుతున్నారు గా ! వాళ్ళ ఉత్తరాలు ఇంకా అందలేదు . ఈ ఆంగ్లేయులే ఉత్తరాలని ఆపేసి ఉంటారు . వాళ్లెలా ఉన్నారో ఏంటో ! ఇంకో వారం రోజుల్లో పండగ జాతర మొదలవ్వుద్ది . ఇంట్లో తినడానికే తిండి సరిగ్గా సరిపోవడం లేదు . ఈ ఏడాదైనా పంటలు పండితే బాగున్ను . ఇంట్లో ఉన్న అన్ని పంచెలు , లాల్చీలు చిరిగిపోయాయి . ఐనా నా తల్లి భారతావని కి ఉన్న ఇక్కట్లు పోయాకే నా ఇక్కట్లు చూసుకోవాలి . నా తల్లి భారతమాత ముందు నా సుఖదుఃఖాలు ఏపాటి ? మొన్న పక్కనున్న రైలు స్టేషను లో బాంబు పెట్టి, పారిపోయినా మంచి పనిచేసాడు ఆ రాజా గాడు . పట్నం లో ఉన్నా ఆ పండ్రెండు తెల్లదొరల పీడా విరగడైంది . పాపం వాడివల్ల నలుగురిని అనుమానించి కాల్చేశాడు రోబెర్ట్ దొరగాడు . ముందు వాడిని చంపే ప్రయత్నం చేయాలి . ఏదేమైనా ముందు నా దేశం బాగుండాలి ఆ తర్వాతే ఎవరైనా .
(After 50 years)
May 17th, 1967 :
అవును బాబాయ్ గారు చెప్పింది వింటే మంచిదే కదా అనిపిస్తుంది . మన దగ్గర పరిస్థితి అంతంతమాత్రం . ఇలా నిజాము వంశీయుల కింద పనిచేసేకంటే , నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే చాలా బావుంటుంది కదూ . ఒక 50 సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు , ఇప్పుడు వీళ్ళు ! ఒక్క ఒస్మాన్ అలీ ఖాన్ గారికే అంత సంపద ఉంటే , ఇంక ఆ ఆంగ్లేయులు ఎంత దోచేసారో కదా ! ఐనా ఎవడికైనా గెలుపు వాడి కష్టం లోనే వస్తుంది . మెట్రిక్యూలేషన్ పూర్తిచేసి ఎలాగైనా ప్లీడరు అవుతా . అప్పుడు డబ్బే డబ్బు . అప్పుడు నా తరువాతి తరాల వారికీ చెప్పుకోడానికి ఉంటది . కానీ ఇవన్నీ చదవాలంటే డబ్బు ఉండాలి . ఇంటాబయటా అంట డబ్బు లేదు . పోనీ అప్పు అడుగుదాం అంటే ఆ లక్ష్మయ్య గారు వడ్డీ కి ఎసరు వడ్డీ వేస్తారు . ముందు డబ్బు సంపాదించే మార్గం చూడాలి . అంటే ఇంకా కొన్ని నెలలు నేను నిజాం కుటుంబీకుల దగ్గర పనిచేయాల్సిందే నా ....... దేవుడా ఎలాగైనా నువ్వే నా చదువుకి దారి చూపాలి . బాగా చదివి , మా అన్నయ్య అంత స్థాయి కి ఎదగాలి . మా నాన్న పడుతున్న కష్టం తీర్చాలి . ఏదేమైనా ముందు మా కుటుంబం బాగుండాలి ఆ తర్వాతే ఎవరైనా .
(After 50 years)
May 17th, 2017 :
ఛీ ! ఎందుకురా ఈ బతుకు ! అసలు ఈ చదువులు ఎవడు కనిపెట్టాడు రా బాబు . స్కూల్ లో ఆడుతూ పాడుతూ అయిపొయింది . ఇంటర్ లో సరదా తీరిపోతుంది . ఊరికే కాలేజీ కి వెళ్ళబుద్ధి కావట్లేదు . ఇంట్లో అంత డబ్బు ఉన్నా తొక్కలో బండి మీద తిరుగుతారు నాన్న . ఒక చిన్న బైక్ ఏ గా నేను అడిగింది . ఆస్తులు ఏమైనా అడిగానా ? దేవుడా మా నాన్నని ఎలాగైనా మార్చు సామి . డబ్బులు అడిగితె ఒక పదో ఇరవయ్యో మొహానికి కొడతారు . ఏం చేసుకోవాలి వాటితో . హాయిగా బైక్ ఉంటే బ్యాగ్ కిటికీ లోంచి బయటికి విసిరేసి , మధ్యాహ్నం మాథ్స్ క్లాస్ కి బంక్ కొట్టచ్చు . కావాలంటే ఆ శ్రావ్య ని ఎక్కించుకొని మాట్నీ కి వెళ్ళచ్చు . ఆహా ఆ ఊహ ఎంత బాగుంది . చాల్లే నా మొహానికి శ్రావ్యా అంట . సిగ్గుండాలి రా రేయ్ ! ఐనా అన్నయ్య బీటెక్ చదువుతాడు ..... వాడి లైఫ్ ఏ బావుంది ఒక స్కూటీ ఒకటి కొనుక్కున్నాడు స్కాలర్షిప్ తో . నా లైఫు ఉంది ఎందుకు ఉపయోగం ? ఐనా వాడితో మాట్లాడటం తగ్గించేయాలి వేస్ట్ గాడు ...... యాభై అడిగినా ఇవ్వడు . ఐనా మనం మాస్ కదా ,.... కానీ ఇంట్లో ఏంటో పేరెంట్స్ క్లాస్ పీకుతారు . ఏంటో ఈ జీవితం . ఎందుకు దేవుడా నన్ను ఇండియా లో పుట్టించావ్ ? ఈ భారతీయులు ఇంక మారరా ? ఎప్పుడు బాగుపడి , ఈ దేశాన్ని ఎప్పుడు బాగుచేస్తారో ఏంటో !ఏదేమైనా ముందు నేను సెటిల్ అవ్వాలి ఆ తర్వాతే ఎవరైనా .
ఐనా ఇదంతా మనిషి చేసిన తప్పు కాదు బాసూ . తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టే మనుషులు మారతారు . వాడు మారిపోయాడు రా .... వీడు మారిపోయాడు రా అని అనడం వేస్ట్ బాసూ . ఇదంతా కాలం మనతో ఆడించే నాటకం . ఒక మనిషి భవిష్యత్తు లో ఎలా ఉండబోతాడో అనేది వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం, ఇంకా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వెయ్యచ్చు . కాలం ఎవడిని వదిలిపెట్టడు బాసు . సింపుల్ గా చెప్పాలంటే..... "ఎవరికీ కావాల్సిన సరదా వాళ్లకి తీర్చేస్తది." దీన్నే రామాయణం రచించిన వాల్మీకి ఋషి , " కాలోహి దురతిక్రమః " అని అంటారు. అంటే " ఈ కాలం అన్నది ఏదైనా చెయ్యగలదు . ఈ కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు" అని .
Also, ICYMI here's a video from "Girl Formula" depicting how girl talks have evolved throughout the ages.