తెలుగు సినిమా, ఒక్కప్పుడు కొందరి కల, కష్టం, నేడు కొన్ని కోట్ల మందికి ఆనందాన్నిచ్చే కొన్ని లక్షల మందికి ఉపాధిని ఇచ్చే సంస్థ గా ఎదిగింది. సరిగ్గా February 06 1932 తొలి తెలుగు టాకీ చిత్రంగా "భక్తప్రహ్లాద" మన ముందుకు వచ్చింది. సురభి నాటకం "భక్త ప్రహ్లాద" కథ ఆధారంగా ఈ సినిమా ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ సినిమా కి అయినా ఖర్చు 20,000 రూపాయిలు. టిక్కెట్టు 4 అణాలు (16 అణాలు = ఒక్క రూపాయి).
1929 మూకీ చిత్రాలు వచ్చిన తరువాత, నాటకాల ఆదరణ తగ్గుతూ వచ్చింది. అదే సమయం లో మన దేశం లో ప్రదర్శితమైన తొలి టాకీ చిత్రంగా " మెలోడీ అఫ్ లవ్" అనే ఆంగ్ల చిత్రం దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది.
ఆ సినిమా విజయవంతమవడం, ఫోబోట్ అనే ఆంగ్లచిత్రం కూడా నచ్చడం తో " అర్దెషీర్ ఇరానీ అనే వ్యక్తి శబ్దగ్రహణ యంత్రాన్ని కొని, "ఆలం ఆరా" అనే సినిమా ని మొదలు పెట్టారు. 1931 మార్చి 14 న ఈ సినిమా విడుదలయ్యింది. తొలి భారతీయ టాకీ చిత్రం గా చరిత్ర లో నిలిచింది. ఈ సినిమా కి మన తెలుగు వారైనా ఎచ్.ఎం. రెడ్డి(హనుమప్ప మునియప్ప రెడ్డి) గారు సహాయకుడిగా పనిచేశారు.
అప్పటికే ఇరానీ గారి దగ్గర, ఆరు మూకి చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన ఎచ్.ఎం. రెడ్డి గారికే, తొలి తెలుగు, తమిళ్ టాకీ చిత్రాలను కూడా తీసే బాధ్యతని అప్పగించారు ఇరానీ.
ధర్మవరం రామకృష్ణాచార్యులు గారు రాసిన "భక్త ప్రహ్లాద" నాటకం కథావస్తువు అయ్యింది. ఆ నాటకాన్ని సురభి వారు దేశమంతటా ప్రదర్శించే వారు, సి.ఎస్.ఆర్( మాయాబజార్ లో శకుని గా చేశారు కానీ అప్పటికి ఆయన నటులు కాలేదు సురభి నాటక వ్యవహారాలూ చూసుకునే వారు) సహాయం తో సురభి సమాజం వారిని బొంబాయికి తీసుకునివచ్చారు . వారే ఈ సినిమాకి పనిచేశారు.
హిరణ్య కశ్యపుడిగా మునిపల్లె సుబ్బయ్య గారు, సతి లీలావతిగా సురభి కమలాబాయి గారు నటించారు. ఈ సినిమా లో ప్రహ్లదుడి స్నేహితుడు "మొద్దబ్బాయి" గా ఎల్వీ ప్రసాదు గారు నటించారు. భారతీయ తొలి టాకీ చిత్రం "ఆలం ఆరా", తొలి తెలుగు టాకీ చిత్రం "భక్త ప్రహ్లద", తొలి టాకీ తమిళ్ చిత్రం "కాళిదాసు" మూడింట్లో ఎల్వి ప్రసాదు గారు నటించారు. ప్రహ్లాదుడిగా కృష్ణారావు నటించారు. ఈయన మన తొలి టాకీ చిత్ర కథానాయకుడు.
హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీతాన్ని సమకూర్చారు, చందాల కేశవదాసు సాహిత్యాన్ని సమకూర్చారు, గోవర్ధన్ బాయ్ పటేల్ కెమెరామెన్ గా పనిచేశారు. 1931 తొలి కాపీ వచ్చిన ఎన్నో ప్రక్రియల అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి ఫిబ్రవరి 6 1932 కి వచ్చింది.
అలా తెలుగు సినిమా మొదటి అడుగు పడింది. ఇప్పుడు ఎంతోమంది direct గా indirect గా ఈ సినిమా పరిశ్రమ ని నమ్ముకుని బతుకుతున్నారు. ఎంతో మందికి ఊరట సినిమా, మరెంతో మందికి ఊపిరి సినిమా ఎంతో మంది ఊహలు సినిమా మరెంతో మంది ఊసులు సినిమా. మనకు తెలిసింది ఒక్కటే సినిమా సినిమా సినిమా.