(Story by PR)
రాత్రి 10 అవబోతుంది. చందు(24) తన మెడికల్ స్టోర్ కట్టేసే పని లో పడ్డాడు. సామాన్లు లోపల పెడుతున్నాడు. పనికి సాయంగా ఉన్న కుర్రాడు పండక్కి ఊరు వెళ్ళడంతో పని అంతా తన మీదే పడింది. నెమ్మదిగా సర్దుతున్నాడు. ఇంతలో గిరి(23) వచ్చి “చందు! యామినికి పెళ్లి కుదిరింది! వచ్చే వారమే ఎంగేజ్ మెంట్ అంట!” యామిని కాలేజీలో చందు లవర్. కాసేపు అంతా బ్లాంక్ అయినట్టు ఉంది చందుకి. సామాన్లు సర్దుతున్నాడు కాని మనసు మనసులో లేదు. గిరి వెంటనే చందు ఫీల్ అవుతున్నాడు అని గ్రహించి “ఐనా ఆ పిల్ల నీకు కరెక్ట్ కాదు! పోనీ దరిద్రం పోయింది!” అన్నాడు. (రాత్రి 11 అయ్యింది)
చందు ఇంకా అలానే ఉన్నాడు. లాభం లేదని, మందు పడాల్సిందే అని గిరి బాటిల్ తేవటానికి బార్ కి వెళ్ళాడు. చందు ఒక్కడే షాప్ లో ఉన్నాడు. యామిని నే గుర్తు వస్తుంది. ఇంతలో సడన్ గా ఎవరో 21 ఏళ్ళ అమ్మాయి వచ్చి - “ఓ 50 స్లీపింగ్ పిల్స్ కావాలి! ప్రిస్క్రిప్షన్ అడగొద్దు! నేను చావటానికి ఏమి కొనట్లేదు! అవి మా నానమ్మకి! దానికి నిద్ర పట్టి చావట్లేదు!” అంటూ గ్యాప్ లేకుండా చెప్పుకుంటూ వెళ్లింది. చందు నెమ్మదిగా రెండు పిల్స్ ఇచ్చి, “రేపు ఆవిడ ప్రిస్క్రిప్షన్ తీసుకుని రండి! ఇస్తా! ఈ రెండు ఈ నైట్ నిద్ర కి సరిపోతాయి!” అన్నాడు. ఆ పిల్ల చందు వంక సీరియస్ గా చూసింది. ఓ క్షణం ఆగి, “కండోమ్స్ ఉన్నాయా? Flavored..” అని అడిగింది. చందుకి ఫ్యూస్ ఎగిరి పోయింది. కాస్త కంగారు పడ్డాడు. వెంటనే ఆ పిల్ల గట్టిగా నవ్వింది. నవ్వినప్పుడు అందంగా వుంది. ఆ నవ్వు ఇంకా అందంగా వినపడింది. పిల్ల నవ్వుతూ, “ ఊరికే ఆట పట్టించా!” అంటూ ఆ రెండు స్లీపింగ్ పిల్స్ తీసుకుని వెళ్ళిపోబోతుంటే.. చందు వెంటనే.. “డబ్బులు!” అన్నాడు. ఆ పిల్ల నవ్వి.. “రాత్రి కలలోకి వచ్చినప్పుడు ఇస్తా లే!” అంది. అని మళ్ళీ నవ్వి వెళ్ళిపోయింది. అప్పుడే గిరి బాటిల్ తో లోపలికి వస్తూ, “ఎవరా పిల్ల? డబ్బులు ఇవ్వలేదా?” అని అడిగాడు! చందు నవ్వి, “ ఆ పిల్ల నవ్వితే చాలు.. డబ్బులు ఎందుకు?” అని నవ్వుకుంటూ షాప్ షట్టర్ దించాడు. “నేను వెళ్తున్నా!” అని బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. గిరి కి ఏమి అర్ధం కాలేదు. బాటిల్ తో అలా చూస్తూ ఉండిపోయాడు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.