You'll Be Surprised That This Place In Hyd With AC Rooms, WiFi, Canteen Is A Crematorium!

Updated on
You'll Be Surprised That This Place In Hyd With AC Rooms, WiFi, Canteen Is A Crematorium!

గ్రామీణ ప్రాంతాలలో మాత్రమే కాదు నగరాలలో సైతం శ్మశాన వాటికలు అపరిశుభ్రంగానే ఉంటాయి. పిచ్చి మొక్కలు, అక్కడే నివాసంగా బ్రతుకుతున్న జంతువుల వ్యర్ధాలు, ఎక్కడా స్థలం లేక శ్మశానంలోనే వేసే చెత్త. ఇలాంటి వాతావరణంలో తాము ప్రాణంగా ప్రేమించిన వారి అంత్యక్రియలు జరుపాలంటే మనసు చివుక్కుమంటుంది. ఎంత వీలుంటే అంత త్వరగా అక్కడి నుండి బయటపడాలనే అనుకుంటుంటారు. జీవితంలో ఈ భూమి మీద జరిగే చివరి ప్రయాణం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని సదుద్దేశంతో జి.హెచ్.ఎం.సి, ఫినిక్స్ ఫౌండేషన్ వారు కలిసి హైదరాబాద్ నగర ప్రజలందరికి అందుబాటులో ఉండేలా రాయదుర్గంలో "వైకుంఠ మహాప్రస్తాన స్మశాన వాటికను" (9703153111 / 9703158111) 2015లో నిర్మించారు..

3.7 ఏకరాలలో ఉన్న ఈ ప్రాంతం కూడా ఒకప్పుడు ముళ్ళ పొదలతో, ఓ రూపు లేని బంజరు భూమిగా ఉండేది. ఎదో నిషిద్ధ ప్రాంతాన్ని పొలినట్టుగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఫినిక్స్ ఫౌండేషన్ వారు ఓ గొప్ప గుర్తింపును తీసుకురాగలిగారు. రెండు సంవత్సరాల పాటు శ్రమించి స్మశాన వాటిక ఎలా ఉంటె బాగుంటుంది అని రకరకాల పరిశోధనలు చేసి కళ్ళకు, మనసుకు శాంతిని చేకూర్చే పూల మొక్కలతో, పచ్చని చెట్ల మధ్యలో నిర్మించిన ఈ వాటికలో అత్యాధునిక సదుపాయాలు కల్పించారు.

వైఫై, లైబ్రెరీ:

టెక్నాలజీ పెరిగిపోవడంతో పెళ్ళికి, ఇతర శుభకార్యాలకు రాలేకపోయినా ఆన్ లైన్ లో చూసేస్తున్నాము. అదే విధంగా అంత్యక్రియలకు అందుకోలేని వారు లైవ్ లో చూసుకోవచ్చు. భద్రత కోసం సిసి కెమెరాలను సైతం ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగస్థులు కాషాయ రంగులో యునిఫామ్ ధరించి అన్ని రకాల పనులను నిర్వర్తిస్తుంటారు.

ఇక్కడ మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది లైబ్రెరీ గురుంచి. స్మశానంలో లైబ్రెరీ అనేది మీరు కొత్తగా విని ఉండవచ్చు కాని ఇక్కడ కూడా గ్రంథాలయం చాలా ముఖ్యమే. ఇందులో భగవద్గిత, రామాయణం, మహాభారతం, భారతీయ ఫిలాసఫీని తెలిపే పుస్తకాలతో దీనిని ఏర్పాటుచేశారు. తమ ఆత్మీయులు చనిపోయినప్పుడు ఉండే బాధ కొంతవరకైనా తగ్గించి ఓదార్పు ఇవ్వాలనే ఉద్దేశానికి కార్యరూపమే ఈ లైబ్రెరీ.

లాకర్లు, ఏ.సి వెయిటింగ్ రూమ్:

మూడు ఎకరాలకు పైగా విస్తరించిన ఈ స్మశాన వాటిక కోసం పూర్తిగా సోలార్ పవర్ మాత్రమే వినియోగిస్తున్నారు. కలపతో దహనం చేయాలనుకున్న వారికి కలప సౌకర్యం, విద్యుత్ దహన వాటిక ఉన్నాయి. స్త్రీలకు, పురుషులకు ప్రత్యేక స్నాన గదులు, వెయిటింగ్ రూమ్ లు, ఆయా మతాలకు సంభందించిన సంగీతం, శాంతి ప్రవచనాల ఆడియో, బంధువులు వచ్చే వరకు శవాలను భద్రపరిచే సౌకర్యం, శాస్త్ర బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించే పూజారులు, లేదా మత పెద్దలు, అస్థికలను భద్రపరిచే లాకర్లు, వంద మందికి సైతం భోజనం అందించే క్యాంటీన్, అంతిమ యాత్ర వాహనం ఇలా ఎక్కడా ఏ విధమైన ఇబ్బందులు ప్రతి ఒక్క సదుపాయం కూడా బాధ్యతాయుతంగా అందిస్తున్నది.

ఇన్ని రకాల సాధుపాయాలు కల్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎదో లాభాపేక్ష కోసమే నిర్మించారు అని మనలో చాలా మంది అనుకుంటునుంటారు. మీరు ఆ అనుమానం, భయాలు ఏమి పెట్టుకోకండి. పేద, అనాథలకు, వృద్ధాశ్రయాలలో మరణించిన వారికి సౌకర్యాలు ఉచితంగా లభిస్తాయి. మిగిలిన వారు కేవలం నామా మాత్రపు రుసుము చెల్లిస్తే సరిపోతుంది.

ఎక్కడో ఎందుకండి కొంతమంది నా మిత్రుల ఇళ్ళల్లో మరణం జరిగినప్పుడు వారు అంత్యక్రియలకు డబ్బులు లేక ఎలా నిర్వహించాలనే భయంతో పోయిన తమ వారిని చూస్తూ రోదించేవారు. పేదవారు సైతం తమవారిని ఏ లోటు లేకుండా అంతిమ విడుకోలు పంపవచ్చు. నిజంగా ఫినిక్స్ ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ గొప్ప కార్యం నేటి ప్రపంచంలో మానవత్వాన్ని పటిష్ట పరచడానికి ఒక ఉదాహరణ అవుతుంది. ఇలాంటి స్మశాన వాటికలు ప్రతి మండలనికొకటి ఏర్పాటుచేయాలి. ప్రజలు సైతం వీటి నిర్మాణానికి భాగస్థులు కావాలి.