మన ఇండియన్స్ లో ఉండే గొప్ప లక్షణాలలో ఒకటి పొదుపు చేయడం. అందుకే ఆ మధ్య ఆర్ధికమాంద్యం వచ్చినా గాని తట్టుకోగలిగాం. ఫైవ్ స్టార్ హోటల్ లోని కాఫీకి 3,000 పెట్టి తాగడం కన్నా రోడ్డు పక్కన పదిరూపాయలు పెట్టి తాగడానికే మనం ఎక్కువ ఇష్టపడుతాం.. ఎంజాయ్ చేస్తుంటాం. ఈ లక్షణం వల్లనే మన ఇండియాలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఎంత ఫేమస్ అయ్యాయో రోడ్డు పక్కన చిన్నపాటి దుకాణాలు కూడా అంతే ఫేమస్ అయ్యాయి. అలా మన జీవితాలలో భాగమై దాదాపు 35 సంవత్సరాల పాటు భోజనప్రియుల ఆకలిని తీరుస్తున్న "అక్భర్ భాయ్ బ్రెడ్ ఆమ్లెట్" వారి గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్ కాచిగూడలో 1983లో అక్బర్ గారు దీనిని ప్రారంభించారు. ఒకరకంగా హైదరాబాదీలకు బ్రెడ్ ఆమ్లెట్ ను పరిచయం చేసింది అక్భర్ గారే అని చెప్పుకోవచ్చు. దాదాపు 35సంవత్సరాల క్రితం ప్రారంభించిన నాటి నుండి చాలామందికి ఈ రుచి నచ్చింది. కాని కాచిగూడ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలలో వివిధ వ్యక్తులు కూడా స్టార్ట్ చేశారు. ఏ ఫుడ్ ఐనా రుచికరంగా ఉండాలంటే అందులోకి వాడే పదార్ధాలు ఫ్రెష్ గా ఉన్నవి ఉపయోగించాల్సి ఉంటుంది. అక్భర్ గారు ఆమ్లెట్ లోకి వాడే ఎగ్స్, నూనె, బ్రెడ్ ఇతర పదార్ధాలన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి మాత్రమే వాడుతుంటారు.
అక్భర్ గారు ఇంతకుముందు కాచిగూడలోని మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ దగ్గర ఫిష్ ఫ్రై చేస్తూ అమ్మేవారు. అక్కడికి ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి మాములుగా మాట్లాడుతు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలి అని వివరించారట. ఇది జరిగిన కొంతకాలం తర్వాత ఫిష్ ఫ్రై అమ్మకాలు తగ్గి చాలావరకు నష్టాలు వచ్చేశాయి. అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ ను అమ్మితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆరోజుల్లో ఒక ఎగ్ 35పైసలు ఉండేది ఆ ధరతో 100 ఎగ్స్ కొనుగోలు చేసి బ్రెడ్ ఆమ్లెట్ బిజినెస్ ప్రారంభించారట. ముందు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలామందికి తెలియకపోవడం వల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కున్నా గాని తర్వాత మాంచి సక్సెస్ అందుకుంది.
చాలా స్టాల్స్ లో బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా ఉంటుంది.. కాని అక్భర్ గారి స్టాల్ లో మాత్రమే ఆరు రకాల పదార్ధాలను కలిపి రుచికరంగా తయారుచేస్తుంటారు.. ఇప్పటికి అసలైన బ్రెడ్ ఆమ్లెట్ తినాలి అని అనుకునేవారంతా కాచిగూడాకు క్యూ కడుతారు.