ఒక ఊరిని దాని చరిత్రను బట్టి గుర్తించడం అనేది ఒక పద్దతి కాని భోజన ప్రియులకు మాత్రం ఏదైనా ఒక ఊరి పేరు చెప్పగానే అక్కడ దొరికే అద్భుతమైన వంట గురించే గుర్తొచ్చెస్తుంది.. అలా కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్., పెద్దాపురం పాలకోవ, ఇంకా "బందర్"లడ్డు ఇలా గుర్తొచ్చెస్తాయన మాట..
లడ్డు హిస్టరీ: బందర్ లడ్డుకు వందల సంవత్సరాల హిస్టరీ ఉందండి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఈ లడ్డును బుందేల్ ఖడ్ రాజ్ పుత్ వంశస్తులైన సింగ్ లు మన బందరుకు వచ్చి బందర్ లోనే తయారు చేసేవారట. లడ్డు రుచి మహాద్భుతంగా ఉండడంతో మన వాళ్ళు నేర్చేసుకున్నారు. ఈ లడ్డు రుచిని మరింత పెంచడానికి మనవారు కొన్ని పద్దతులు మార్చారట. ఇక అప్పటి నుండి మన తెలుగు వారు బందర్ లడ్డును తయారు చేయడంలో ఆరితేరిపోయారు.
బందర్ బ్రాండ్: బందర్ నుండి చాలా ప్రాంతాలకు లడ్డు వెళ్ళినా గాని "బందర్ లడ్డు" అనే పేరు మాత్రం మారలేదు. చాలా ప్రాంతాలలో లడ్డును పంచదారతోనే చేస్తారు కాని ఒక్క బందర్ లోనే ఎక్కువ శాతం బెల్లంతో చేస్తారు. ఒక వస్తువుకు బ్రాండ్ వాల్యూ పెరగడం వల్ల దానిని అనుసరిస్తూ నకిలీ వచ్చేస్తుంది. అలా బందర్ లడ్డు అని చెప్పి నకిలీ నాసిరకం లడ్డులు కూడా చాలానే వచ్చేశాయి ఒకానొక సందర్భంలో. ఈ నకిలీ లడ్డుల వల్ల అసలైన బందర్ లడ్డు రుచి విలువ పోతుందని మనవాళ్ళు పేటెంట్ కోసం దరఖాస్తు చేసి సాధించుకున్నారు, ఇప్పుడు బందర్ లడ్డుకు పేటెంట్ రావడంతో డుప్లికేట్ లడ్డులు చాలా వరకు తగ్గిపోయాయి.
లడ్డు శ్రామికులు: మరెక్కడా లేనంతగా మచిలీపట్నంలోనే ఈ లడ్డును ఎక్కువ సంఖ్యలో తయారు చేస్తుంటారు. ఒక్క మచిలీపట్నంలోనే లడ్డు తయారీలో 500 నుండి 700 కార్మికుల వరకు వివిధ చోట్లలో పనిచేస్తుంటారు. దీనిని తయారు చెయ్యడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. పాకం పట్టడం, లడ్డూని తయారుచేయడం, అగ్నిగుండంలా ఉండే వంటపొయ్యల దగ్గర పనిచేయడం, ఇంకా వేడి నెయ్యితో పని చేస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాని లడ్డుకు మంచి రుచి వచ్చేంత వరకు వారు ఎక్కడా రాజీ పడరు.