నాకు ఈ స్కూల్ గురించి తెలిసినప్పుడు, ఇందులోని సరైన విద్యాభ్యాసం విధానాలను చూసినప్పుడు వెంటనే చిన్నపిల్లాడిగా మారిపోయి మరొక్కసారి నా బాల్యాన్ని మరింత ఆనందంగా గడపాలని అనిపించింది. నిజంగా నేను అనే కాదు నాలాంటి ఎంతోమంది వారి బాల్యం అంతా ఇంకొకరి చెప్పుచేతుల్లోనే ఉండేది అది తల్లిదండ్రులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు.. వారు కూడా మన బంగారు భవిషత్తు కోసం ఎంతో కృషిచేసినా కాని వారు చెప్పే పద్దతుల్ని మనం ఏదో చేయాలని ఆచరించాము.. నిజానికి అవి ఇబ్బందిగా, కష్టంగా ఉండేది.. మనం వాటిని ఎంజాయ్ చేయలేకపోగా, చదువు మీద భయంతో కొంత, ఒత్తిడితో కొంత ఏదో కొల్పోయామనే భావన ఉంటుంది. ఇప్పటి స్కూల్స్ కాంపిటీషన్ పెరిగిపోవడంతో విద్యార్ధి జీవితానికి మార్కులే లక్ష్యంగా బట్టీపట్టి చదివిస్తున్నారు తప్ప వారి బాల్యం ఎంత విలువైనది, ఎంత అందమైనది అని గుర్తించడం లేదు. కాని ఇప్పుడు మనం చూస్తున్న విద్యాలయం అలా కాదు.. ఒక విద్యార్ధి ఉన్నతంగా ఎదగడానికి అవసరమైన అన్ని విధానాలను ఇక్కడ అవలంభిస్తున్నారు. మన విజయవాడ గుణదల కొండ మీద గంగిరెద్దుల దిబ్బకు సమీపంలో దీపా చారిటబుల్ ట్రస్టు ద్వారా స్థాపించబడిన "అభ్యాస విద్యాలయం" విద్యార్ధికి పరిపూర్ణమైన స్వేచ్ఛను, ఆనందాన్ని అందిస్తూనే ప్రస్తుత పోటి ప్రపంచానికి ఏలా ఎదగాలో స్పష్టంగా నేర్పిస్తున్నారు.

జోత్స్న గారు 1995లో వారి కూతురు దీప జ్ఞాపకంగా దీపా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ "అభ్యాస విద్యాలయాన్ని" స్థాపించారు. ఈ పాఠశాలలో సైన్స్ సబ్జెక్ట్ కోసం ఒక రూమ్, సోషల్ సబ్జెక్ట్ కోసం ఒక రూమ్, ఇలా ఈ విద్యాలయంలో ప్రతి సబ్జెక్టుకు ఒక ప్రత్యేకమైన క్లాస్ రూమ్ ఉంటుంది. ఆయా సబ్జెక్ట్స్ కోసం ప్రతి తరగతి గదిని ప్రత్యేకంగా మార్పులు చేశారు. విద్యార్ధులు వారి పాఠశాలను వారే శుభ్రం చేసుకుంటారు. పరిసరాలలో మొక్కలను నాటి వాటి బాగోగులు వారే చూసుకుంటారు. ప్రతి విద్యార్ధి బాధ్యతలను, వారి మానసిక వికాసాన్ని, వారి ఎదుగుదలను కన్న తల్లిదండ్రుల కన్నా క్షుణ్ణంగా ఇక్కడి ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. డబ్బే పరమావధిగా నడుస్తున్న పాఠశాలలకు ఈ విద్యాలయం పూర్తి భిన్నం. ప్రతి క్లాస్ కి కేవలం 25మంది విద్యార్ధులు మాత్రమే ఉండడం వల్ల ప్రతి విద్యార్ధిపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యమవుతుంది.




కేవలం తెలుగు, సైన్స్, సోషల్, మాథ్స్, ఇంగ్లీష్, హిందీ లాంటి సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, విద్యార్ధులలో క్రియేటివిటిని పెంచే శిక్షణ కూడా ఇక్కడ సబ్జెక్ట్స్.. మన భారతీయ సాంప్రదాయక నృత్యాలలో ప్రత్యేక శిక్షణతోపాటు "నేను నవల రాశానోచ్" అనే ప్రోగ్రామ్ మీద పిల్లలు నవలలు, కథలు, కవిత్వాలు రాస్తుంటారు. ఇందులో పోటి, ప్రైజ్ కాకుండా ఆ రచనలో ఏవైనా తప్పులుంటే మాత్రమే చర్చిస్తారు. పిల్లలకు చిరుతిళ్ళు, మిగిలిన అనవసర ఖర్చుల గురించి వివరంగా వివరిస్తూనే పిల్లలు కిడ్డి బ్యాంకులలో దాచుకున్న డబ్బుతో వారికి అవసరమయ్యే విలువైన పుస్తకాలు, వస్తువులు కొనేలా ప్రోత్సహిస్తారు.




ఇప్పుడు నగరాల్లో అంటే అపార్ట్ మెంట్ లలో స్కూల్ నడిపిస్తున్నారు.. స్కూల్ లో గెమ్స్ కోసం గ్రౌండ్ కాదు కదా చివరికి పార్కింగ్ ప్లేస్ కూడా లేని స్కూల్స్ చాలానే ఉంటున్నాయి. కాని అభ్యాస విద్యాలయంలోని సువిశాల ఆట స్థలంలో పిల్లలు వారికి నచ్చిన ఆటలు ఉపాధ్యాయుల శిక్షణలో ఆడుకుంటారు. అంతేకాకుండా పిల్లలకు డబ్బు విలువ తెలియాలి.. చిన్నతనం నుండే వారిలో వ్యాపార మెళకువలు తెలియాలి అని ఒక సంత ఏర్పాటుచేసి వారు తయారుచేసిన వస్తువులను, కూరగాయలను సంతలో అమ్మించడం చేస్తుంటారు.


అసలైన జీవితం అంటే ఎలా ఉంటుంది.. సమస్యలను, ఓటములను, నిరాశ, బాధాకర సంఘటనలు ఎలా ఎదుర్కోవాలి మొదలైన అన్ని విషయాల మీద కూడా ప్రాక్టికల్ గా వివరించడం వల్ల చదువు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా జీవితంలో ఎలా ఉన్నతంగా ఎదగాలో వీరి విద్యావిధానం వల్ల తెలుస్తుంది. ఇక్కడ పరిపూర్ణ విద్యను నేర్చుకున్న విద్యార్ధులెందరో తమ తమ రంగాలలో ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. నిజంగా ఒక వ్యక్తి గొప్పతనం అతని సక్సెస్ ద్వారా తెలియదండి అతని వ్యక్తిత్వం ద్వారా తెలిస్తుంది.. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న పౌరులు ఇక్కడి నుండి ఎంతోమంది వస్తున్నారు.
