ఘనత వహించిన మన రాజధాని హైదరాబాద్ లోని గ్రంధాలయాలు గత మూడు సంవత్సరాలుగా ఒక్క పుస్తకం కూడా కొనలేదు.! అదేమని అడిగితే మా దగ్గర సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు ఇంకా పుస్తకాలు ఏలా కొనగలం అని కరాకండిగా చెప్పేశారు. అదేంటి సంవత్సరానికి ప్రతి ఇంటినుండి ఆస్థి పన్నులో 8% నిధులు గ్రంధాలయాల కోసం ప్రజలు ఇస్తున్నారు కదా మరి ఆ నిధులేవని అడిగితే సమాధానం లేదు.
380కోట్ల నిధులు ఖర్చుచేయలేదు.. సుధాకర్ అనే లైబ్రేరియన్ Right to Information (RTI) Act కింద తెలంగాణ రాష్ట్రంలోని గ్రంధాలయాలకు ప్రభుత్వం ఎంత మొత్తంలో ఖర్చుచేస్తుందో అని తెలుసుకోవడానికి ధరఖాస్తు పెడితే అతనికి దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. కేవలం ఒక్క హైదరాబాద్ లోనే 301.70కోట్లు(2013 వరకు) మిగిలిన జిల్లాలు కలిపి దాదాపు 380కోట్ల(2016 వరకు) నిధులు లైబ్రెరీ కోసం ఖర్చుచేయలేదు. మరి ఈ నిధులు ఏం చేశారు.? రూపాయి కే ఒక కేజీ బియ్యం లాంటి పథకాలు అంటే ప్రజలు పట్టించుకుంటారు గాని ఈ లైబ్రెరీ గురించి ఎవరికి కావాలి, ఎవరు పట్టించుకుంటారు, ఎందుకు ఖర్చుచేయాలి అని అధికారులు అవ్వే నిధులు వేరే సమస్యలకు మళ్ళించారు, మిగిలినవి అవినీతి రూపంలో అధికారుల జేబుల్లోకి వెళ్ళిపోయాయి.
మన హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా కాంపిటీటివ్ పరీక్షలు రాసే విద్యార్ధులు చాలామంది ఉన్నారు, గవర్నమెంట్ రీడింగ్ రూములు లేక నెలకు రూ.500-1500 ప్రైవేట్ రీడింగ్ రూముల్లో చదువుకోవడానికి వారికి కడుతున్నారు. హైదరాబాద్ లో మొత్తం దాదాపు 90లైబ్రెరీలు ఉంటే అందులో 85లైబ్రెరీలు నిర్మాణుష్యంగా ఉన్నాయి మరి ఆ నిధులను సరిగ్గా ఖర్చుచేసి వాటిని బాగుచేస్తే స్టూడెంట్స్ అంతలా ఖర్చు చేసుకునే అవసరం ఉండదు, చదువు భారంగా ఉండదు.
ఒకే ఒక్కడు.. నరసింహా దొంతినేని వయసు 25, సి.బి.ఐ.టిలో ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం హర్యాణ రోహతక్ ఐ.ఐ.ఎమ్ లో ఎంబిఏ చేస్తున్నారు. దేశానికి దేశ ప్రజలకి అభిమాని, దేశాన్ని బాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడు. లైబ్రెరీ వ్యవస్థలో ఇంతటి మోసాలు చూసేసరికి చలించిపోయి ఏ ఒక్కరూ కూడా సాహసించలేని "తెలంగాణ ప్రభుత్వంపై లైబ్రెరీల నిధులపై కోర్టులో పిల్ వేశాడు". నిత్యం ప్రభుత్వంపై మీడియా ముందు విరుచుకుపడే ప్రతిపక్ష ఎం.ఎల్.ఏలు కూడా చేయలేని పోరాటం ఒక 25సంవత్సరాల యువకుడు మొదలుపెట్టాడు. నరసింహా దొంతినేని వేసిన పిల్ పై ప్రభుత్వం ఒక రకంగా భయంతో జాగ్రత్త పడ్డారనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం హుటాహుటిన ముందుకొచ్చి ఆ వందల కోట్లు లైబ్రెరీల కోసం ఖర్చుచేయడంతో పాటు, రాష్ట్రంలోని ప్రతి లైబ్రెరీలలో వసతులు పెంచి డిజిటల్ లైబ్రెరీగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి, ఇందుకోసం విద్యాశాఖ వారు వేగంగా ప్రణాళికలు చేస్తున్నారు.
నరసింహా దొంతినేనినీ చూస్తుంటే ఇక్కడ మనకో విషయం తెలుస్తుంది మన ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థ మనకు అన్ని హక్కులు, చట్టాలు ఇచ్చింది.. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు ఒక సాధారణ పౌరడు కూడా దేశాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకురాగలమని...