మిగిలిన వారందరి పాటలు కేవలం వినడానికి మాత్రమే బాగుంటుంది కాని ఇళయరాజా గారి పాటలు వినడానికి మాత్రమే కాదు పాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదే మిగితా వారికి ఇళయరాజా గారికి ఉన్న తేడ. ఆయన పాటలు ఆత్మను తట్టేలా ఉంటాయి.. ఆయన పాటలు ఓటమిలో ఓదార్పులా, ప్రేయసి ఎడబాటులో ఒయాసిస్సులా, ప్రేమికుల ప్రేమలో మాధుర్యంలా ఉంటాయి. మూడు దశాబ్ధాల సినీ ప్రస్థానంలో ఇప్పటికి 1,000కి పైగా సినిమాలు, 8,000కు పైగా పాటలు.. సాధారణంగా ఏ సంగీత దర్శకుడు కలలో కూడా ఊహించలేనటువంటి లక్ష్యం ఇది. మరణం లేని శిశువులా ప్రతి పాటకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఇళయరాజా గారు జూన్ 2 1943న తమిళనాడులో ఉదయించారు. ఆయన అందుకోని ఎవరెస్టు లేదు, సాధించని అవార్ఢులు రివార్ఢులు లేవు. ఏ ప్రాంతం, ఏ రాష్ట్రం అన్న తారతమ్యం లేకుండా ప్రతి ప్రాంతం వారు ఆయన మా వాడు అనుకునేలా ఉండేది ఆ పాటల దేవుడి జీవన శైలి. కెరీర్ తొలినాళ్ళ నుండి చిన్న సినిమాలు చేస్తూ ఆ తర్వాత హై బడ్జెట్, స్టార్ డమ్ ఉన్న హీరోలతో అవకాశాన్ని అందుకున్నా కూడా చిన్న సినిమాలను విస్మరించలేదు. చిన్న సినిమాలకు తక్కువ పారితోషికం తీసుకుంటూ ఒక కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న చాలామంది సంగీత దర్శకులందరు ఇళయరాజా గారినే తమ గురువుగా ఆత్మీయంగా ప్రకటించుకుంటారు. ఇప్పటికి జాతీయ స్థాయిలో ఐదు అవార్ఢులను అందుకున్నారు. అందులో రెండు మన తెలుగు సినిమాలు ఉన్నాయి అవి చిరంజీవి గారి రుద్రవీణ, కమల్ హాసన్ గారి సాగర సంగమం. ఇళయరాజా గారు తమిళం, కన్నడ, మలయాళి, తెలుగు లాంటి దక్షిణాది భాషల సినిమాలే కాక బాలీవుడ్ లో సైతం ఎన్నో గొప్ప సినిమాలకు సంగీత దర్శకత్వం అందించారు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కమల్ హాసన్, రజినీ కాంత్ లాంటి అగ్ర కథానాయకుల సినీ చరిత్రలో ప్రతి ఒక్క హీరోకు కెరీర్ బెస్ట్ ఆల్బమ్ అందించడమే కాక భాను చందర్, కార్తిక్, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు నటించిన చిన్న సినిమాలకు కూడా అంతే స్థాయి సంగీతాన్ని అందించారు. ఆయన దృష్టిలో చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు కేవలం మంచి సినిమా మాత్రమే ఉంటుంది. 2003లో 155 దేశాల నుండి ప్రఖ్యాత న్యూస్ ఛానల్ “బి.బి.సి” నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో “దళపతి” సినిమా లోని “అరె చిలకమ్మా” పాట అల్ టైం 10 పాటలలో 4వ స్థానం అందుకున్నది. 2013లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్. వారు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రజలు ఎన్నుకున్నారు. భారతీయ సంగీతానికి అందించిన సేవలకు గాను 2010 లో భారత ప్రభుత్వం ఇళయరాజా గారిని “పద్మభూషణ్” పురస్కారంతో సత్కరించింది.. 12 ఫిల్మ్ ఫేర్ అవార్ఢులు, ఇతర రాష్ట్రాల అవార్డులతో పాటు ఒక్క మన తెలుగులోనే నాలుగు నంది అవార్ఢులను అందుకున్నారు..
ఇళయరాజా గారి పాటలు కొన్ని మాత్రమే పొందుపరచాలి అంటే అది ఖచ్చితంగా రక్తం చిందకుండా కత్తి మీద నడవడం లాంటిది.. ఐనప్పటికీ కొన్ని పాటలు మాత్రమే పొందుపరుస్తున్నాం.. సమస్యను అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ..
1. వేదం అనువనువున నాధం (సాగరసంగమం)
2. చుట్టు పక్కల చూడరా చిన్నవాడా (రుద్రవీణ)
3. ఓ ప్రియా ప్రియా (గీతాంజలి)
4. ఎదుటా నీవే (అభినందన)
5. జగదానంద కారక (శ్రీరామ రాజ్యం)
6. మాటే మంత్రము (సీతకోక చిలుక)
7. లాలి జో లాలి జో (ఇంద్రుడు చంద్రుడు)
8. సింగారాల పైరుళ్ళోన (దళపతి)
9. ప్రియతమ (జగదేక వీరుడు అతిలోక సుందరి)
10. సుమం ప్రతి సుమం (మహర్షి)
11. చుక్కల్లె తోచావె (నిరీక్షణ)
12. ప్రియతమ నా హృదయమ (ప్రేమ)
13. సువ్వి సువ్వి (స్వాతి ముత్యం)
14. కమ్మని ఈ ప్రేమ (గుణ)
15. మళ్ళి మళ్ళి ఇది రాని రోజు (రాక్షసుడు)
16. బోటని పాట (శివ)
17. జానవులే..(ఆదిత్య369)
18. కలయా నిజమా.. (కూలీ నెం1)
19. అసలేం గుర్తుకు రాదు (అంత:పురం)
20. యురేకా..(అభిలాష)
21. హలో గురు..(నిర్ణయం)
22. చుక్కలు తెమ్మన్నా.. (ఏప్రిల్ 1 విడుదల)
23. కొత్తగా రెక్కలోచ్చేనా.. (స్వర్ణ కమలం)
24. కరిగిపోయాను కర్పూర వీణలా.. (మరణ మృదంగం)
25. చిరుగాలి వీచనే.. (శివపుత్రుడు)