మనకు నక్షత్రాల కంటే సూర్యుడు గొప్పోడిలా అనిపిస్తాడు, ఎందుకంటే మనకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి. సాహిత్య ప్రపంచం లో కూడా అంతే, కొంతమంది సూర్యుళ్ళ పక్కనే ఎంతో మంది నక్షత్రాల్లా వెలుగుతుంటారు. మనం సూర్యుడికి ఇచ్చినంత గుర్తింపు మిగిలిన నక్షత్రాలకు ఇవ్వం. అలా అని సూర్యుడే గొప్ప, నక్షత్రాలు తక్కువని కాదు కదా. ఎవరికి తెలుసు... ఈ సూర్యుడి కంటే పెద్దవి, గొప్పవైన నక్షత్రాలు బోలెడు ఉండొచ్చు. అచ్చం అలానే... తెలంగాణ సాహిత్య ఆకాశంలో కూడా ఎంతోమంది పెద్ద పెద్ద సూర్యుళ్ళ మధ్యలో ఓ గుర్తింపు లేని గొప్ప నక్షత్రం ఉండింది నిన్నటి వరకు. ఆ నక్షత్రం పేరు గూడ అంజయ్య.
ఒక మనిషి గొప్పతనం అతను ఉన్నప్పుడు ఎంత మంది గొప్పలు చెప్పారనే దాని మీద కాదు, అతను లేనప్పుడు ఎంతమంది తలుచుకున్నారనే దాని పైనే ఆధారపడుతుంది. ఈరోజు ఆయన గురించి మాతో, మీతో పాటు తెలుగు వారందరు తలుచుకుంటున్నారంటే అర్ధమైపోతుంది ఆయన గొప్పతనం. మరి అలాంటి గొప్ప వ్యక్తి గురించి కొంతైనా తెలుసుకోవాలి కదా...
ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దాదాపు పదహారు భాషల్లో అనువదించబడింది, కొన్ని లక్షల మందిని ఉరకలెత్తించింది, కొన్ని వందల మందికి నిద్రలేకుండా చేసింది ఒక పాట... అదే "ఊరు మనది రా, ఈ వాడ మనది రా..." పాట. ఆ పాటకు ప్రాణం పోసిన వ్యక్తే గూడ అంజయ్య గారు. ఆయన పదాలు సాహిత్య కట్టుబాట్లకు తలవంచలేదు, పద ప్రక్రియల తమాషాల వెంబడి పరిగెత్తలేదు, నిగూడార్ధాల వెనుక దాక్కోలేదు. సామాన్య జనం ఏం మాట్లాడుకుంటారో, ఎలాంటి పదాలు వాడుతరో, వేటికి చలించిపోతారో అవే ఆయన పాటల్లో కనిపించేవి.
రంగుల కల అనే సినిమా కోసం రాసిన "భద్రం కొడుకో... నా కొడుకో కొమరన్న జరా", పోరు తెలంగాణ సినిమా కోసం రాసిన "రాజిగ ఓ రాజిగ...", ఒసేయ్! రాములమ్మ సినిమా కోసం రాసిన "లచ్చులో లచ్చన్న...", ఎర్ర సైన్యం సినిమా కోసం రాసిన "కొడుకో బంగారు తండ్రి.. " పాటలు తెలంగాణ పల్లెల్లో ఏదో ఓ మూల వినిపిస్తూనే ఉంటాయి. పాటలే కాకుండా పొలిమేర(నవల), దళిత కధలు అనే రచనలు కూడా చేశారు అంజయ్య గారు. తెలుగు సాహిత్యంలో ఆయన చేసిన కృషికి 1986 లో సాహిత్య బంధు రత్న మొదలుకొని గండ పెండేరా, కొమరం భీం జాతీయ అవార్డు వంటివి ఎన్నో ఆయన దరికి చేరాయి. ఆయన రాసిన పాటలు అంకెల్లో ఉండొచ్చు, ఆయన చేసినవి ఒకటి రెండు రచనలే అయ్యుండొచ్చు, ఆయన పేరు అందరికీ తెలియక పోవచ్చు కానీ ఊరు మనదిరా అనగానే కదలని కాలు ఉండదు, భద్రం కొడుకో వినగానే చెమర్చని కన్ను ఉండదు.
ఉక్కకి ఉడుకుతున్న ఒంటికి సల్లగాలి తగిలినట్టి హాయి, మంటెత్తిస్తున్న సూర్యుడి ఎండని మేఘం అడ్డొచ్చి ఆపినట్టి ఆనందం, పంటెండి పోతుందనే దుఃఖంలో వర్షం పడినట్టి సంతోషం, ఓ పూట కడుపు మాడ్చుకొని బిడ్డ కడుపునింపిన సంతృప్తి ఎలా ఉంటుందో తెలంగాణ యాసలో తొణికిసలాడే తెలుగు సాహిత్యం కూడా అలానే ఉంటుంది. అంత గొప్ప సాహిత్య ప్రపంచంలో చిరకాలం నిలిచిపోయే ప్రతిష్ట సంపాదించుకున్న అంజయ్య గారు మీరెప్పటికీ చిరంజీవేనండి.