వి.సరిత.. భారతదేశంలోనే తొలి Heavy Motor Vehicle License తీసుకున్న తెలంగాణ మహిళ డ్రైవర్. సరిత గారి స్వస్థలం నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లోని సీతయ్య నగర్ అనే ఒక చిన్న గ్రామం.. ఐదుగురు అక్కచెల్లెల్లు ఉన్న వారిది చాలా పేద కుటుంబం, ఆకలి నేర్పించినంతగా బాహుశా ఏ ఉపాధ్యాయుడు నేర్పించలేడేమో.. సరిత 15సంవత్సరాల నుండే డ్రైవింగ్ చెయ్యడం మొదలుపెట్టారు. మొదట ఆటో, ట్రాక్టర్, క్యాబ్, జీప్, ఇప్పుడు 70మంది ఉన్న బస్. ఒక మహిళ ఏం చేస్తుంది ఎలా బ్రతుకుతుంది అని భయపడే గ్రామంలో ఉండే తల్లిదండ్రులకు సరిత ప్రస్థానం ఒక గొప్ప బలాన్ని ఇవ్వగలదు.
డ్రైవింగ్ కు దారి తీసిన పరిస్థితులు: మొదట అక్క దగ్గర ఉంటూ టెన్త్ వరకు చదువుకున్న తర్వాత అమ్మనాన్నలకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి చదువు మానేసి చిన్నచిన్న వ్యవసాయ పనులు, టైలరింగ్ చేయడం ప్రారంభించారు. ఐనా కూడా వాటి ద్వారా వచ్చే డబ్బు ఏ మాత్రం సరిపోకపోయేది. సరిత పెద్ద అక్క భర్త ఒక ఆటో డ్రైవర్, అతనికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతని ఆటో నడిపించడం నేర్చుకుంది. అలా ఆటో నడిపించి ఇటు అక్క కుటుంబాన్ని అటు అమ్మనాన్నలను ఒక బలమైన కొడుకులా పోషించింది, ఆ వచ్చే డబ్బుతో ముందు అమ్మనాన్నల ఆరోగ్యం బాగుచేసింది, ఒక సోదరి పెళ్ళి కూడా చేశారు.
తన రక్షణ: నేను ఈమధ్య ఎవరో చెబుతుండగా విన్నాను 'ఒక మహిళ ఎం.బి.బి.యస్ స్టూడెంట్ తన ఎడ్యుకేషన్ పూర్తిచేయడానికి మగవానిగా డ్రెస్ వేసుకుని, బాడీలాంగ్వేజ్ చేంజ్ చేసుకుని పూర్తిచేసిందట'. ఒక కాలేజ్ స్థాయిలోనే అలా ఉంటే ఇంకా ఆటో నడిపే మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే క్యాబ్ లలో రేప్ చేసే జంతువులున్న అనాగరిక రోజులివి. సరిత తన రక్షణ కోసం అచ్చం మనవానిలా ఉండేలా తనను తాను మార్చుకుంది. హేయిర్ స్టైల్ దగ్గరినుండి బాడీ లాంగ్వేజ్, మాటతీరు అంతా.. చూస్తే అమ్మాయి అని తెలుస్తుంది కాని మనం లొంగతీసుకునే రకంలా లేదు అని కొంతమందిని భయపెట్టేలా ఉంటుంది తను.
DTC New Delhiలో జాబ్: ఆ తర్వాత ఈ రంగంలోనే గవర్నమెంట్ జాబ్ కొట్టేశారు. మొదట ఢిల్లీ ట్రాన్స్ ఫోర్ట్ కార్పోరేషన్‌లో డ్రైవర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు డిటిసిలో మహిళా కండక్టర్లు 243, డ్రైవర్లు 12,000 ఇందులో మొదటి మహిళ డ్రైవర్ గా సరిత దేశంలోనే చరిత్ర సృష్టించారు. రెండు సంవత్సరాలుగా అక్కడ జాబ్ చేస్తు తల్లిదండ్రులు ఇక్కడ నల్గొండలో ఉండడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఇదే విషయం మీద తెలంగాణ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు తెలంగాణలో అవకాశం ఇస్తాననడంతో ఇప్పుడు మన తెలంగాణలో మొదటి మహిళ డ్రైవర్ గా టి.ఎస్. ఆర్.టి.సి లో జాబ్ చేయబోతున్నారు.